Home Insurance: ఇళ్లకు కూడా ప్రత్యేకంగా ఇన్సూరెన్స్.. ప్రయోజనాలు, ఇతర పూర్తి వివరాలివే..
హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance), లైఫ్ ఇన్సూరెన్స్ మాదిరిగానే ఇళ్లకు కూడా ప్రత్యేకంగా హోమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
కానీ దీని గురించి చాలామంది ప్రజలకు తెలియదు. ఇంటికి ,ఇంట్లో ఉండే వస్తువులకు ప్రకృతి విపత్తుల వల్ల కలిగే నష్టాలను పూడ్చుకోవడానికి హోమ్ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది. దొంగతనానికి గురికావడం వల్ల ఇంట్లో వస్తువులు పోయినప్పుడు కూడా దీని నుంచి లబ్ధి పొందవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మంచి హోమ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే వస్తువులపైనే కాకుండా, బ్యాంకు లాకర్లలో దాచిన విలువైన వస్తువులు, ఆభరణాలకు కూడా దీని ద్వారా ఇన్సూరెన్స్ హామీ ఉంటుంది. వినియోగదారులు తమ అవసరాలను బట్టి హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవాలి. కస్టమర్లు అత్యుత్తమ హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవడానికి కొన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.
1. అవసరాన్ని గుర్తించాలి
అవసరాన్ని బట్టి వినియోగదారులు హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ఎంచుకోవాలి. ఆస్తులకు నష్టం వాటిల్లకుండా, మంటలు, తుఫానులు, పిడుగులు, ఇతర అల్లర్ల వల్ల కలిగే నష్టాల నుంచి ఆర్థిక భద్రత కల్పించే ప్రత్యేక హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీలు తీసుకోవచ్చు. ఇంట్లో ఉండే ఇతర విలువైన వస్తువుల కోసం యాడ్ ఆన్ ఇన్సూరెన్స్ కవరేజీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంటితో పాటు వస్తువులన్నింటికీ కలిపి ఇన్సూరెన్స్ హామీ ఇచ్చే ప్యాకేజీ పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మెకానికల్, ఎలక్ట్రికల్ డ్యామేజీ, దోపిడీ వల్ల కలిగే నష్టాలను పూడ్చుకోవచ్చు. ఇంట్లో ఉంచే వస్తువులతో పాటు, బయట దాచుకునే వాటికీ ప్రత్యేకంగా యాడ్ ఆన్ పాలసీలు తీసుకోవచ్చు.
2. భారం కాకూడదు
కస్టమర్లు చెల్లించగలిగే ప్రీమియం ఆధారంగా ప్యాకేజీలను ఎంచుకోవాలి. ఇలాంటి పాలసీలు అదనపు బారంగా మారకుండా ఉండాలంటే, క్లెయిమ్ తీసుకునేటప్పుడే ప్రీమియం గురించి ఆలోచించాలి. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ప్రీమియం చెల్లించగలిగే పాలసీలనే ఎంచుకోవాలి.
3. మార్కెట్ విలువను బట్టి ఇన్సూరెన్స్
మార్కెట్ విలువ ఆధారంగా బీమా చేసే మొత్తాన్ని ఎంచుకోవాలి. సాధారణంగా హోమ్ ఇన్సూరెన్స్ సమ్ అస్యూర్డ్ వ్యాల్యూ అనేది, ఊహించని ప్రమాదాలవల్ల ఏర్పడే నష్టాలను పూడ్చుకునేలా ఉండాలి. ఈ విలువ ఆదారంగానే ప్రమాదాల్లో కోల్పోయిన ఆస్తులను రీప్లేస్ చేస్తారు. రీప్లేస్ మెంట్ చేసిన తరువాత బీమా కంపెనీలు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తాయి.
4. డిస్కౌంట్లు చూడాలి
కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు భారీ డిస్కౌంట్లను అందిస్తాయి. హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునే ముందు వీటిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకోవాలి. హోమ్ ఇన్సూరెన్స్‌ను అందించే కంపెనీ నుంచి ఇతర పాలసీలు కూడా తీసుకుంటే... చెల్లించాల్సిన ప్రీమియాన్ని సంస్థలు తగ్గించే అవకాశం ఉంది.
5. రెన్యువల్ చేయాలి
హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీని ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా రీ-ఎవాల్యుయేషన్ చేయాలి. ద్రవ్యోల్బణం, ఇతర ఆర్థిక ప్రభావాల కారణంగా ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చే ఇళ్లు, వస్తువుల విలువ పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న విలువ ఆధారంగా హోమ్ ఇన్సూరెన్స్ కవరేజీలో మార్పులు చేసుకోవాలి.
0 Comments:
Post a Comment