Girls in Military Schools: సైనిక్ స్కూళ్లలో బాలికలకూ అడ్మిషన్స్.. కేంద్రం చరిత్రాత్మక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం (Central Government) చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
సైనిక్ స్కూళ్లు, కాలేజీలు, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)ల్లో బాలికలకు ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం రక్షణ మంత్రిత్వ శాఖ భారత సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజీ, ఐదు రాష్ట్రీయ మిలటరీ స్కూల్స్‌లో బాలికల ప్రవేశాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొంది. సైనిక్ స్కూళ్ల (Sainik Schools)లో బాలికల ప్రేవేశాలు వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానుండగా.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(NDA)ల్లో మాత్రం ఈ ఏడాది నుంచే అమల్లోకి రానుంది. కేంద్రం ఇప్పటికే ఈ ప్రక్రియను కూడా ప్రారంభించింది.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) విడుదల చేసిన తాజా ఎన్డీఏ నోటిఫికేషన్లో మహిళలకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల స్వీకరణ అక్టోబర్ 8తో ముగియనుంది. ఇప్పటి వరకు సైనిక స్కూళ్లు, కళాశాలలు, ఎన్డీఏ, ఆర్ఐఎమ్సీ, ఆర్ఎమ్ఎస్ వంటి ప్రతిష్టాత్మక మిలటరీ సంస్థల్లో కేవలం పురుషులకు మాత్రం ప్రవేశాలు ఉండేవి. కానీ తమకు కూడా అవకాశం కల్పించాలంటూ కొంత మంది మహిళలు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుప్రీం వారి అభ్యర్థన పట్ల సానుకూలంగా తీర్పునిచ్చింది. సైనిక్ స్కూళ్లు, మిలటరీ అకాడమీల్లో మహిళలకు అవకాశం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కోరింది. దీంతో ఎంతో కాలంగా మిలటరీ అకాడమీల్లో స్థానం కోసం పోరాటం చేస్తున్న మహిళా లోకం పోరాటం ఫలించింది.
* అఫిడవిట్‌లోని కీలక అంశాలు
ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సైనిక పాఠశాలలు, కళాశాలల్లో బాలికలు సైతం చదువుకోవడానికి అర్హులే. బాలికల అడ్మిషన్ ప్రక్రియ వచ్చే ఏడాది లేదా తదుపరి విద్యా సెషన్ నుంచి ప్రారంభమవుతుంది. ఈ విద్యా సంవత్సరానికైతే, కేవలం అబ్బాయిలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. వచ్చే ఏడాది నుంచి ఇది అమల్లోకి వస్తుంది.
రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కాలేజ్‌లో 6 నెలలకు ఓసారి ప్రవేశాలు ఉంటాయి. ఫస్ట్ ఫేజ్‌లో 5 మంది అమ్మాయిలకు, సెకండ్ ఫేజ్‌లో 10 మంది అమ్మాయిలకు ప్రవేశాలు కల్పిస్తారు. దీంతో, దేశవ్యాప్తంగా ఉన్న 5 ఆర్ఐఎంసీ సంస్థల్లో మొత్తం సీట్ల సంఖ్య 300 నుంచి 350 సీట్లకు పెరగనుంది. 2027 నాటికి ఆర్ఐఎమ్సీల్లో 250 మంది బాలురు, 100 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తారు.
0 Comments:
Post a Comment