కంట్రోల్ .... కంట్రోల్
ఉద్యోగ నేతల్ని అదుపులో పెడుతున్న సర్కారు?..
ప్రెస్‌మీట్‌లో ఉండగానే సజ్జల నుంచి ఫోన్
ఏపీఎన్జీవో అధ్యక్షుడికి గట్టిగా సూచనలు..
మీడియా మైకుల్లో రికార్డయిన సంభాషణ
విజయవాడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు ఉద్యోగ సంఘాల పోరాటాలపై స్పందిస్తాయి. లేదా... స్నేహపూర్వకంగా ఉంటూ వాటి డిమాండ్లను నెరవేరుస్తాయి. కానీ... ఇప్పుడు చేయాల్సినవి పూర్తిస్థాయిలో చేయకుండా, ఉద్యోగ సంఘాలను బాగా కంట్రోల్ చేస్తున్న వైనం వీడియో కెమెరాల సాక్షిగా బయటపడింది. తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి గురువారం విజయవాడలో ఉద్యోగ సంఘాల నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వారు మైకుల ముందు ఉండగానే... పైనుంచి ఫోన్ వచ్చింది. ఏపీఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు సార్ సార్... నమస్తే సార్ అంటూ అవతలి వ్యక్తితో వినయంగా మాట్లాడారు. అటువైపు నుంచి ఎలాంటి ఆదేశాలు/సూచనలు వచ్చాయో తెలియదు కానీ, సార్... కంట్రోల్... ఉంటాం సార్! కంట్రోల్‌లోనే ఉంటాం సార్ అని బండి శ్రీనివాసరావు బదులిచ్చారు.
ఆ తర్వాత... అదేమీ ఉండదు సార్! గవర్నమెంట్‌కు యాంటీగా ఏమీ ఉండదు సార్ అని కూడా హామీ ఇచ్చారు. పైనుంచి ఫోన్ చేసిన వ్యక్తి... మరో ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు గురించి అడిగినట్లు ఉంది! సార్.. సార్... పక్కనే ఉన్నారు సార్ అని బండి శ్రీనివాసరావు ఫోన్‌ను బొప్పరాజుకు ఇచ్చారు. ఎవరు అని ఆయన అడగడంతో... సజ్జల సార్... సజ్జల సార్ అని బదులిచ్చారు. వెరసి... కంట్రోల్ ఫోన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నుంచి వచ్చినట్లు స్పష్టమైపోయింది. అవతలి మాటలు వినిపించనప్పటికీ... ఉద్యోగ నేతల స్పందనను బట్టి చూస్తే, సజ్జల వారితో కఠినంగా మాట్లాడినట్లు ఇట్టే అర్థమవుతుంది.
అప్పుడూ అంతే...
ఉద్యోగ సంఘాల నేతలను బెదిరించడం వైసీపీ సర్కారుకు కొత్తేమీ కాదు. కొన్నాళ్ల కిందట ఆర్టీసీలో పనిచేస్తున్న పీటీడీ ఉద్యోగ సంఘాలన్నీ సంఘటితమై విజయవాడలో సమావేశమయ్యాయి. ఆ సమావేశం తర్వాత సజ్జల రామకృష్ణా రెడ్డి వారిని తన దగ్గరకు పిలిపించుకుని గట్టిగా సూచనలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరుసటి రోజే ఐక్య వేదిక కాస్తా చెదిరిపోయింది. సంఘాలు విడిపోయాయి.
కింది వీడియో చూడగలరు...
0 Comments:
Post a Comment