ఏపీ ప్రజలకు బిగ్ రిలీఫ్-విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల నిలిపివేత : చెల్లించినవి వెనక్కు ఇస్తారా..!!
ఏపీలో విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల వ్యవహారం ప్రభుత్వం పైన విమర్శలకు కారణమైంది. ఈ ఛార్జీల పేరుతో పెద్ద మొత్తంలో బిల్లులు వసూళ్లు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాయి.
ఇదే సమయంలో సామాన్యుల నుంచి ఈ ఛార్జీల విషయంలో అసహనం వ్యక్తం అయింది. అయితే, తాజాగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ట్రూ అప్ ఛార్జీల బాదుడు ను తిరిగి సమీక్షించాలని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయించింది. దీంతో..ఈ ఛార్జీల వసూళ్లను నిలిపివేయాలని ఆదేశించింది.
గత ఆదేశాల నిలిపివేత
గతంలో ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. దీని పైన రాజకీయంగా కంటే..న్యాయ పరంగా తలెత్తిన వివాదం ఈ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. ఛార్జీల పెంపు కు మందుగా సాధారణంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి పాటించిన నియమాలు..విధి విధానాలు పాటించకుండానే నిర్ణయం తీసుకుందంటూ హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. దీని కారణంగా రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తమ నిర్ణయం వెనక్కు తీసుకుందని చెబుతున్నారు. తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఆ తరువాత దీని పైన తుది ఆదేశాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది.
హైకోర్టులో పిటీషన్లతో తిరిగి సమీక్ష
వినియోగదారుల నుంచి రూ.3,666 కోట్లు వసూలు చేసుకోవడానికి అనుమతిస్తూ ఆగస్టు నెలలో ఈఆర్‌సీ ఆదేశాలిచ్చింది. సెప్టెంబరు నుంచి వీటి వసూలు మొదలైంది. 2014-15 నుంచి 2018-19 మధ్య కాలంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు అయిన అదనపు ఖర్చుల కింద వీటిని వసూలు చేస్తున్నారు. హైకోర్టులో దీని పైన కొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. ట్రూ అప్ ఛార్జీలు వసూలు చేయాలంటే ముందుగా పత్రికల్లో దిన పత్రికల్లో వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీని పైన ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి.
వసూళ్లు చేసిన ఛార్జీల మాటేంటి
కానీ, ఈ ఛార్జీల విషయంలో ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే నిర్ణయం తీసుకున్నట్లు పిటీషన్ లో పేర్కొన్నారు. దీంతో..రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి తమ నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. అదనపు చార్జీలు విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంటే అభ్యంతరం లేదని ఏజీ బదులివ్వడంతో ఆ ఆదేశాలను ఉపసంహరించుకున్నట్లుగా ప్రకటించింది. అయితే, ఈ ఆదేశాలు జారీ అయిన తేదీ నుంచి రద్దు చేసారా..లేక, తాజాగా అమల్లోకి వస్తాయా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
ప్రజాభిప్రాయ సేకరణ తరువాత తుది నిర్ణయం
కాగా.. ట్రూ అప్ చార్జీలపై ఈ నెల 19న ప్రజాభిప్రాయ సేకరణ జరపనున్నట్లు ఈఆర్‌సీ మరో ఉత్తర్వులో పేర్కొంది. ఆ తరువాత నే ఈ ఛార్జీల పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరి...ఇప్పటి వరకు వసూలు చేసిన ఛార్జీల విషయంలోనూ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. దీనిని ప్రస్తుతానికి ఆపేయటంతో తిరిగి ప్రజాభిప్రాయ సేకరణ.. తుది నిర్ణయం తరువాత కోర్టు ఇచ్చే మార్గదర్శకాలకు అనుగుణంగా వసూళ్లు చేసిన మొత్తాన్ని సర్దుబాటు చేయటమా..లేక, అనుమతి లభిస్తే తిరిగి కంటిన్యూ చేయటమా అనే దాని పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, రాజకీయంగా మాత్రం ఇది ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా రాజకీయంగా మాత్రం రిలీఫ్ ఇచ్చే అంశంగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
0 Comments:
Post a Comment