🔳కనీస వేతన కనికట్టు
పదిహేనవ భారత కార్మిక మహాసభ సిఫార్సులు, 1992 సుప్రీంకోర్టు తీర్పులను ప్రామాణికాలుగా తీసుకుని కనీస వేతనాలు నిర్ణయించబడతాయన్న అంశాన్ని వేతనాల కోడ్ ముసాయిదా రూల్స్‌లో మొదటిసారిగా చేర్చారు. దీనివల్ల కనీస వేతనం భారీగా పెరుగుతుందనే భ్రమలు కల్పిస్తున్నారు. ఊర్లలో సోది చెప్పే ఆమె ''ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. జరిగేది చెబుతాను, జరగబోయేది చెబుతాన''ంటుంది. కానీ సంఘ పరివారం, దాని అనుకూల మీడియా మాత్రం లేని దానిని ఉన్నట్టు చెప్పడంలో దిట్ట.
2019 ఆగస్టు 21న 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దినపత్రిక కనీస వేతనాలపై ఒక కథనాన్ని వండి వార్చింది. ఆగస్టు నెల మొదట్లో లోక్‌సభలో మానవ వనరుల శాఖామంత్రి జితేంద్ర సింగ్ ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానం ఇస్తూ కనీస వేతనాన్ని రూ. 18 వేల నుండి రూ. 24 వేలకు పెంచామని, ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే కార్మికులు ఈ వేతనం పొందేలా మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారనేది ఆ పత్రిక కథనం. దీన్నే సంఘపరివార సోషల్ మీడియా రెండు నెలల క్రితం వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారానికి పెట్టింది. ఈ పాటికే రూ. 18 వేలు ఎక్కడ ఉందో, అది రూ. 24 వేలకు అప్పుడే ఎలా పెరిగిందో ఎవరికీ తెలియదు.
జరుగుతున్నది ఇదీ
కనీస వేతనాల చట్టం వచ్చిన 1948వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకుంటే, ఇక ఏం జరగబోతోందో తేలిగ్గా తెలుసుకోవచ్చు. కార్మికుల పట్ల బిజెపి ప్రభుత్వం కపట ప్రేమను చూపిస్తోంది. అది నిజంగా కార్మికుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లయితే కోడ్ రూల్స్‌లో కనీస వేతన నిర్ణయానికి ప్రతిపాదించిన ప్రామాణికాలను, జాతీయ కనీస వేతన నిర్ణయానికి కూడా ప్రతిపాదించి ఉండేది. ఏ ప్రాతిపదిక లేని జాతీయ కనీస వేతనం కంటే తక్కువగా కనీస వేతనాలు ఉండకూడదని చెప్పేది కాదు. జాతీయ కనీస వేతనంపై మోడీ ప్రభుత్వం వేసిన నిపుణుల కమిటీ జులై 2018 నాటికి రోజుకు రూ. 375 సిఫార్సు చేస్తే మోడీ ప్రభుత్వం రూ. 178 గానే నిర్ణయించింది. ఇప్పటి వరకు చట్టం బయట ఉన్న జాతీయ కనీస వేతనాన్ని చట్టంలో చేర్చేది కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలను తక్కువగా నిర్ణయిస్తున్నాయి కాబట్టి జాతీయ కనీస వేతనాన్ని తాము చట్టంలో చేర్చామని, జాతీయ కనీస వేతనం కంటే కనీస వేతనాలు తక్కువగా నిర్ణయించకూడదని చెప్పేది కాదు. ఇంత గొప్ప బిజెపి ప్రభుత్వం రూ. 24 వేలకు కనీస వేతనాన్ని పెంచుతుందని ఎలా నమ్మాలి?
పాలక వర్గాలకు ప్రాతినిధ్యం వహించే కాంగ్రెస్, బిజెపి, టిడిపి, వైసిపి తదితర ప్రభుత్వాలు ఏవైనా సరే కార్మికులకు అన్యాయం చేస్తున్నాయి. 1948లో కనీస వేతనాల చట్టం వచ్చిన కొత్తలో కనీస వేతన నిర్ణయానికి ప్రాతిపదిక లేదు. కానీ 1957లో భారత కార్మిక మహాసభ సిఫార్సులు, 1992లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వాటిని చట్టంలో చేర్చకపోయినా, వాటి ప్రామాణికాల ప్రకారం కనీస వేతనం నిర్ణయించాల్సిన నైతిక బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అలా చేయకుండా ఆ ప్రామాణికాల ప్రకారం వేతనాలు చెల్లించే సామర్ధ్యం యాజమాన్యాలకు లేదని చెప్పి, తమకు ఇష్టమైన రీతిలో కనీస వేతనాలను పెట్టుబడిదారులకు అనుకూలంగా చాలా తక్కువ స్థాయిలో రకరకాలుగా నిర్ణయిస్తూ వస్తున్నాయి. కేరళ వామపక్ష ప్రభుత్వం, దాని తర్వాత కొంత మెరుగ్గా ఢిల్లీ ఆప్ ప్రభుత్వం మాత్రమే కార్మికుల పక్షాన నిలబడ్డాయని చెప్పాలి.
ఈ రోజుకీ కేంద్ర లేబర్ కమిషనర్ నిర్ణయించే కనీస వేతనం తాజాగా వచ్చే విడిఏ తో కలిపి కనీస స్థాయిలో రూ. 11,206 మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. స్పిన్నింగ్ మిల్లులు, గార్మెంట్స్, పవర్‌లూమ్స్, సున్నపురాతి గనులు తదితర పని ప్రాంతాలలో ఈ రోజుకీ కనీస స్థాయిలో రూ. 7 వేలు దాటలేదు. రాష్ట్రంలో వేతనాల సవరణ కాల పరిమితి తీరి 10 సంవత్సరాలైనా ఇంత వరకు వేతన సవరణ చేయలేదు. కనీస వేతనాల సలహా బోర్డు కూడా వేయలేదు. 2014 లోనే మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటికీ 1957 భారత కార్మిక మహాసభ సిఫార్సులు, సుప్రీంకోర్టు తీర్పులను కనీస వేతన నిర్ణయానికి అమలు చేసే ప్రయత్నం చేయలేదు. అటువంటి ప్రభుత్వం ఇప్పుడేదో కొత్తగా కనీస వేతనాలను భారీగా పెంచుతుందంటే ఎలా నమ్మాలి?
వేతనాల కోడ్ రూల్స్ లోని ప్రామాణికాల ప్రకారం కనీస వేతనాలను నిర్ణయిస్తే అవి అధమ స్థాయిలో (నైపుణ్యం లేని పనులకు) కార్మిక సంఘాలు ప్రస్తుతం కోరుతున్నట్లుగా కనీసం రూ. 21 వేలు ఉండాలి. కొద్దిపాటి నైపుణ్యం, అధిక నైపుణ్యం ఉన్న కార్మికులకు మరింత ఎక్కువ ఉండాలి. ఆ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేస్తాయా? ఏం జరగబోతోంది?
కార్మికునికి ఇచ్చే కనీస వేతనం - అతని శ్రమ శక్తి పునరుత్పత్తికి, అతని స్థానాన్ని నింపేందుకుగాను భవిష్యత్ కార్మికుల తయారీకి అయ్యే ఖర్చుతో సమానమని 150 సంవత్సరాల క్రితమే కారల్‌మార్క్స్ తన 'పెట్టుబడి' గ్రంథంలో చెప్పారు. వివిధ దేశాల అభివృద్ధిని బట్టి, జీవన వ్యయాన్ని బట్టి ఈ కనీస వేతనం మారుతుందన్నారు. అయితే ఈ సూత్రం కార్మికులకు వ్యక్తిగతంగా వర్తించదు. మొత్తం కార్మిక వర్గానికి వచ్చే వేతనాల ఎగుడుదిగుళ్ల సరాసరి ఈ కనీస వేతనంతో సమానమవుతుందని మార్క్స్ సూత్రీకరించారు.
1957 కార్మిక మహాసభ సిఫార్సులు, 1992 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వచ్చే కనీస వేతనం మార్క్స్ చెప్పిన కనీస వేతనం మాదిరిగానే ఉంది. ఈ కనీస వేతనం మొత్తం కార్మిక వర్గానికి వచ్చే వేతనాల సరాసరితో సమానం. ఈ కనీస వేతనం కంటే దిగువ స్థాయిలో వేతనం పొందే కార్మికులు కోట్లాదిగా వుంటారు. వీరికంటే ఎగువ స్థాయిలో ఎవరున్నారు? సంఘటితంగా ఉండి అధిక బేరసారాల శక్తిని కలిగిన కార్మిక, ఉద్యోగ వర్గాలు కనీస వేతనం కంటే ఎక్కువ పొందుతున్నాయి. వీరికి తోడుగా అత్యధిక వేతనాలు పొందే అధికారగణం ఉంది.
ప్రభుత్వ రంగ సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు, చైర్మన్లు కూడా ఉద్యోగులే. అదే ప్రైవేట్ రంగ కంపెనీల్లో చైర్మన్లు, యం.డి లుగా ఆయా కంపెనీల ప్రమోటర్లు (యజమానులు) ఉంటారు. నాలుగు సంవత్సరాల క్రితమే 2016-17లో తిరుపతి శివారులో ఉన్న ఒక కంపెనీ యం.డి (యజమాని) వేతనంగా తీసుకుంది. రూ. 38 కోట్లు. ఇది ఆ కంపెనీ మధ్య స్థాయి ఉద్యోగి వేతనం కంటే 2082 రెట్లు ఎక్కువ. ప్రైవేట్ కంపెనీల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనాలు కూడా సంవత్సరానికి రూ. కోట్లలో ఉంటాయి. ఎగువ, దిగువన ఉన్న ఈ వేతనాల సరాసరే శ్రమ శక్తికి ఇచ్చే కనీస వేతనం.
ఇక జరగబోయేది...
వేతనాల కోడ్ రూల్స్ లోని ప్రామాణికాల ప్రకారం కనీస వేతనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించే అవకాశం లేదు. కనీస వేతనాల సలహా బోర్డులు కూడా అంతకు ముందు కంటే గొప్పగా ఏమీ పని చేయలేవు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలా నిర్ణయించినా అవి చట్టాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. గత అనుభవాలను బట్టే ఈ నిర్ధారణకు రావచ్చు. దేశంలో సంఘటితంగా వున్న కార్మిక శక్తి 10 శాతం లోపే. కార్మిక చట్టాలు వారికే వర్తిస్తున్నాయి. లేదా అమలవుతున్నాయి. సంఘటితం కాని అత్యధిక కార్మికులకు అవి అమలు కావని ఆచరణలో తేలింది. కార్మికులంతా సంఘటితం కాకపోవటానికి పెట్టుబడిదారీ వ్యవస్థ అణచివేత ప్రధాన కారణంకాగా కార్మిక సంఘాల బలహీనత కూడా తోడయింది.
కనీస వేతనాల పెంపుదల కోసం, వాటి అమలు కోసం కార్మికులు సంఘటితమై పోరాడాలి. అంతేగాక, శ్రమశక్తిని అమ్ముకుని పెట్టుబడిదారులకు వేతన బానిసత్వం చేసే వ్యవస్థ పోవాలని కోరుకోవాలి. ఆర్థిక కోర్కెల మీద పోరాడుతూ కీలకమైన ఈ అంశాన్ని విస్మరిస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది.
పి. అజయ్ కుమార్ - పి. అజయ కుమార్ / వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు /
0 Comments:
Post a Comment