మహా పాదయాత్రకు షరతులతో అనుమతి
రక్షణ కల్పించాలనిడీజీపీకి హైకోర్టు ఆదేశం
బహిరంగ సమావేశాలు నిర్వహించవద్దని అమరావతి పరిరక్షణ సమితికి సూచన
ఈనాడు, అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి నవంబరు 1న గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల వరకు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో నిర్వహించ తలపెట్టిన మహా పాదయాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
ఈ యాత్రలో ఎలాంటి బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదు. పాదయాత్రలో పాల్గొనే వారు ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలు చేయకూడదు. డీజేలు వినియోగించడానికి వీల్లేదు. హ్యాండ్ మైక్ వాడుకోవచ్చు. కొవిడ్ నిబంధనలను పాటించాలి. శాంతియుతంగా యాత్ర నిర్వహించాలి...' అని స్పష్టం చేసింది. పాదయాత్ర సాగే నాలుగు జిల్లాల్లో రక్షణ కల్పించడం కష్టమని ఆయా ఎస్పీలు చెప్పడాన్ని ఆక్షేపించింది. మహా పాదయాత్రలో పాల్గొనే వారికి తగినంత మంది పోలీసులతో రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించింది. అనుమతి నిరాకరిస్తూ డీజీపీ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. ఈ ఉత్తర్వులు జారీ చేసేటప్పుడు డీజీపీ.. పిటిషనర్ సమితికి ఉన్న ప్రాథమిక హక్కులను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంది. ఈనెల 30వ తేదీ సాయంత్రం 5గంటలలోగా ఈ పాదయాత్రకు అనుమతివ్వాలని డీజీపీకి స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 17 వరకు 'న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో నిర్వహించనున్న మహా పాదయాత్రకు ఘర్షణలు, విద్వేషాలు తలెత్తుతాయన్న కారణంతో డీజీపీ అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ 'అమరావతి పరిరక్షణ సమితి' అధ్యక్షుడు ఎ.శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతిరావు శుక్రవారం అత్యవసరంగా హైకోర్టులో వ్యాజ్యం వేశారు. దీనిపై ఇరు పక్షాలు వాదనలను వినిపించాయి. 'డీజీపీ అనుమతి నిరాకరించడానికి సహేతుకమైన కారణం లేదు. ప్రజల మద్దతు కూడగట్టడం, సమస్యలను వారికి తెలియజేయడం యాత్ర ఉద్దేశం. ఏ రాజకీయ పార్టీకి దీనితో సంబంధం లేదు. 200 మందితో పాదయాత్ర ఉంటుంది. ఇప్పటికే రూట్ మ్యాప్ పోలీసులకు ఇచ్చాం...' అని పిటిషనర్ సమితి తరఫున న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. 'మూడు రాజధానులకు అనుకూలంగా ఉండేవారు ఆటంకం కల్పించే అవకాశం ఉంది. పిటిషనర్ సమితి సభ్యులపై 69 కేసులున్నాయి. కార్లు, బస్సుల్లో దేవుడి దర్శనానికి వెళ్లాలి. దర్శనానికి టికెట్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది...' అని డీజీపీ తరఫు అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
ప్రాథమిక హక్కులో భాగం
ఈ వాదనలను తోసిపుచ్చిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్.... 'సమస్యల పట్ల శాంతియుతంగా నిరసన, ప్రదర్శన, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించడం ప్రాథమిక హక్కులో భాగం. అధికరణ 19(1)(ఏ)(బీ)(డీ) ప్రకారం దేశ పౌరులకు భావవ్యక్తీకరణ, వాక్కు స్వాతంత్య్రం, శాంతియుతంగా సమావేశం నిర్వహించుకోవడం, స్వేచ్ఛగా సంచరించేందుకు హక్కు ఉంది. సుప్రీంకోర్టు ఇదే విషయాన్ని పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. పిటిషనర్ సమితి ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై గొంతెత్తాలనే ఉద్దేశంతో ఉంది. వారు చేస్తున్న ఉద్యమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించే హక్కు వారికి ఉంటుంది. ఆ హక్కు రాజ్యాంగం ప్రసాదించింది. శాంతియుత ర్యాలీని నిలువరించలేం. న్యాయస్థానంలో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో అనుమతి నిరాకరించడానికి వీల్లేదు. పాదయాత్ర సందర్భంగా ఎదురయ్యే ఇబ్బందులపై జిల్లా ఎస్పీలు ఇచ్చిన వివరాల ఆధారంగా పిటిషనర్ సమితి ప్రాథమిక హక్కులను నిరాకరించడం సరికాదు. అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయాన్ని వ్యతిరేకించేవారు ఉన్నప్పటికీ.. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత పోలీసులదే. రాజధాని అమరావతి ప్రాంతానికి చెందిన వారు ప్రభుత్వ నిర్ణయంపై 670 రోజులుగా ఉద్యమిస్తున్నారు. అందులో భాగంగా 47 రోజుల మహాపాదయాత్ర నిర్వహించాలని తలపెట్టారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం, సమస్యలను వారికి తెలియజేసుకునే హక్కు పిటిషనర్ సమితికి ఉంది...' అని పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment