సేక్రెడ్ హార్ట్ ఎయిడెడ్ పాఠశాల మూసివేతపై రోడెక్కిన విద్యార్థులు, తల్లిదండ్రులు
ప్రజాశక్తి - ఎంవిపి కాలనీ
విశాఖ నగరం, జ్ఞానాపురంలోని ఎంతో ప్రతిష్టాత్మక సేక్రాడ్ హార్ట్స్ ఎయిడెడ్ బాలికోన్నత పాఠశాల (సెయింట్ పీటర్స్ పాఠశాల) మూసివేతపై విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.
ఎంతో మంది పేద విద్యార్థినులకు విద్యనందిస్తున్న ఈ పాఠశాల మూసివేతతో తమ పిల్లల భవిష్యత్ ఏమిటంటూ వారంతా ఉదయం నుంచి 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జ్ఞానాపురం మెయిన్ రోడ్డుపై రాస్తారోకో చేపట్టి రహదారిని దిగ్బంధించారు. ఆడపిల్లల చదువంటే ఇంత అలుసా? అంటూ విద్యార్థినుల తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వ విధానంపై నిరసన వ్యక్తమైంది.
122 ఏళ్ల చరిత్ర..
కాన్వెంట్ జంక్షన్‌లో ఉన్న సేక్రెడ్ హార్ట్స్ బాలికల పాఠశాలకు 122 ఏళ్ల చరిత్ర ఉంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ స్కూళ్ల విషయంలో తీసుకున్న నిర్ణయం పిల్లలకు శరాఘాతంగా మారింది. ఈ స్కూలును మూసివేస్తున్నారన్న సమాచారం తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. విశాఖ జిల్లాలో 89 ఎయిడెడ్ పాఠశాలలుండగా, వీటిలో 62 పాఠశాలలకు ప్రభుత్వం ఎయిడ్‌ను నిలిపేసి అందులో పనిచేస్తున్న 246 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 31లోపు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. ఇదే సమయంలో 62 పాఠశాలల్లోని 9600 మంది విద్యార్థుల చదువుకు సంబంధించిన బాధ్యతను ప్రభుత్వం విస్మరించినట్టయింది. ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారడంతో అన్ని చోట్లా తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. పిల్లల చదువులపై ఎయిడెడ్ యాజమాన్యం, విద్యాశాఖ ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో జ్ఞానాపురంలోని సేక్రెడ్ హార్ట్స్ గర్ల్స్ హైస్కూల్‌లో చదువుతున్న విద్యార్థినుల తల్లిదండ్రులు సుమారు 1500 మంది సోమవారం స్కూలు ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కాన్వెంట్ జంక్షన్, ఈ స్కూలు ఏరియాలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. 122 ఏళ్ళ చరిత్ర కలిగి 2100 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాల ముసివేడం అన్యాయం అని స్థానికులు పేర్కొన్నారు. స్థానిక దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ను అడ్డగించి తమ నిరసనను కొనసాగించారు. స్కూలును యథావిధిగా నడపాలని పట్టుబట్టారు. ఆయన జోక్యం చేసుకుని రాష్ట్ర విద్యాశాఖ అధికారులను సంప్రదించి ఈ ఏడాది వరకూ పిల్లలను స్కూలులో కొనసాగించేలా హామీ తీసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనను విరమించారు. మంగళవారం నుంచి పాఠశాల కొనసాగుతుందని పాఠశాల ప్రిన్సిపల్ రత్నాకర్‌రావు తెలిపారు. అయితే ఈ హామీ తాత్కాలికమే కావడంతో విద్యార్థుల భవిష్యత్ ఏమిటన్నది తల్లిదండ్రుల్లో ఆందోళన కొనసాగుతోంది.
0 Comments:
Post a Comment