రూటు మార్చుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఐటీ కంపెనీలకు కొత్త కష్టం..!
ఐటీ కంపెనీలకు వలసల సెగ
ఐదేళ్లలోనే అత్యధికం.. డిజిటల్ టెకీలకు భలే గిరాకీ
కంపెనీ మారితే 50శాతం వరకూ వేతన పెంపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ కంపెనీలు గత కొద్ది సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంతగా ఉద్యోగుల వలసల (అట్రిషన్) సమస్యను ఎదుర్కొంటున్నాయి.
కొవిడ్ అనంతరం అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీల వినియోగం, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్.. ఐటీ ఉద్యోగుల వలసలకు ప్రధాన కారణంగా ఉంది. అంతేకాదు. క్లౌడ్, ఐఓటీ, కృత్రిమ మేధ (ఏఐ) వంటి డిజిటల్ టెక్నాలజీల్లో నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు పరిశ్రమలో బాగా గిరాకీ పెరిగింది. వీరిని ఆకర్షించడానికి ఐటీ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీంతోపాటు ప్రత్యేక ఉత్పత్తులు, సేవలపై దృష్టి కేంద్రీకరించిన స్టార్టప్ కంపెనీలు డిజిటల్ టెక్నాలజీల్లో కోర్ నైపుణ్యాలున్న నిపుణులను అధిక వేతనాలు చెల్లించి ఆకర్షిస్తున్నాయి. గత ఆరు నెలల్లో డిజిటల్ నైపుణ్యాలున్న నిపుణులకు గిరాకీ బాగా పెరిగిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొవిడ్ తర్వాత డిజిటల్ టెక్నాలజీల వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా వివిధ రంగాల్లోని కంపెనీలు క్లౌడ్ సేవలపై వ్యయం చేస్తున్నాయి. దీంతో డేటా కేంద్రాల కోసం ఐటీ కంపెనీలు భారీగా క్లౌడ్ టెక్నాలజీల్లో నైపుణ్యాలున్న వారికి అధిక వేతనాలు ఇచ్చి నియమించుకుంటున్నాయని హైదరాబాద్‌కు చెందిన ఐటీ కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
25శాతం మంది వారే..
గత ఏడాది కాలంలో డిజిటల్ టెక్నాలజీ నిపుణులకు గిరాకీ భారీగా పెరిగింది. ఏడాది, ఏడాదిన్నర క్రితం సగటున ఒక్కో సాఫ్ట్‌వేర్ కంపెనీలో డిజిటల్ నిపుణులు 8-10 శాతం ఉండేవారు. ఇప్పుడది 25 శాతానికి పెరిగిందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) ప్రెసిడెంట్ భరణి కే ఆరోల్ అన్నారు. డిజిటల్ నిపుణుల గిరాకీకి లభ్యతకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగింది. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అట్రిషన్ రేటు పెరగడానికి ఇదే కారణమని అన్నారు.
సాధారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఐటీ నిపుణులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్లడం 11-12 శాతం వరకూ ఉంటుంది. అయితే.. ప్రస్తుతం చాలా కంపెనీల్లో ఉద్యోగుల వలసల రేటు 20 శాతం, అంతకు మించి ఉంది. గతంలో ఐటీ నిపుణులు కంపెనీ మారినప్పుడు వేతనం 25-30 శాతం వరకూ పెరిగేది. ఇప్పుడు కంపెనీలు 50 శాతం వరకూ పెంచి నిపుణులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి. కంపెనీలు మారుతున్న ఉద్యోగుల్లో 3-7 ఏళ్ల అనుభవం, 30 ఏళ్ల లోపు వయసు ఉన్న ఉద్యోగులే అధికంగా ఉంటున్నారు. కొన్ని బహుళ జాతి సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వలసల రేటు 40 శాతానికి చేరిందని, 20 ఏళ్లు ఒకే కంపెనీలో పని చేసిన సీనియర్ ఉద్యోగులు సైతం కంపెనీ మారేందుకు మొగ్గు చూపుతున్నారని స్టేట్ స్ట్రీట్ సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ రమేశ్ కాజా తెలిపారు.
స్వల్పకాలమే..
ఐటీ కంపెనీల్లో అధిక అట్రిషన్ రేటు కొద్ది కాలమే ఉంటుందని.. ఆ తర్వాత సాధారణ స్థాయికి వస్తుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అనూహ్యంగా డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాలు అవసరం కావడంతో వలసల రేటు పెరిగిందని అంటున్నారు. వచ్చే మూడు, నాలుగు త్రైమాసికాల్లో సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో అట్రిషన్ రేటు మళ్లీ సాధారణ స్థాయికి వచ్చే వీలుందని టీసీఎస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
0 Comments:
Post a Comment