జగన్ సర్కారుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో షాకిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మహిళా పోలీసుల నియామకాలల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న వాదనతో కోర్టు ఏకీభవించింది.
లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో అత్యంత కీలకమైన పోలీసు శాఖలోకి ఇతర మార్గాల ద్వారా నియామకాలు జరపడాన్ని తప్పుపట్టింది. దాదాపు 15 వేల మంది సిబ్బంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ వివాదంపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సిద్ధమన్న కోర్టు.. ప్రొసీజర్ ప్రకారం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. పూర్తి వివరాలివి..
మహిళలపై నేరాలను నియంత్రించడం, బాదితురాలకు సత్వర సహాయం అందించాలనే ఉద్దేశంతో జగన్ సర్కారు.. 'మహిళా సంరక్షణ కార్యదర్శులు' పేరుతో కొత్త వ్యవస్థను తీసుకురావడం తెలిసిందే. రెవెన్యూ శాఖ పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు స్థాయిల్లో సుమారు 15 వేల మందిని మహిళా సంరక్షణ కార్యదర్శులుగా నియమించారు. పేరుకు రెవెన్యూ శాఖలో సంరక్షణ కార్యదర్శులే అయినప్పటికీ, వారికి పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లకు ఉండే అధికారాలు అప్పగించారు. అంతేకాదు, సదరు మహిళా సంరక్షులు అందరినీ మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ఈ ఏడాది జూన్ 23న ప్రభుత్వం జీవో నంబర్ 59ని జారీ చేసింది. సదరు జీవో వివాదాస్పదంగా ఉదంటూ విశాఖపట్నానికి చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం నాడు కీలక వాదనలు జరిగాయి..
గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా సంరక్షకులుగా పనిచేస్తోన్న సిబ్బందిని ఏకంగా పోలీస్ శాఖలో మహిళా పోలీసులుగా నియమించడం చెల్లుబాటు కాదని, పోలీసుల విధులకు రెవెన్యూ కార్యదర్శులను వాడటం తగదని పిటిషనర్ తరఫు లాయర్ బాలాజీ వాదనలు వినిపించారు. పోలీస్ శాఖలో నియామకాలన్నీ '1859 ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్' ప్రకారం జరుగుతాయని, మహిళా సంరక్షకులను పోలీసులుగా గుర్తించే ప్రక్రియ ఆ చట్టానికి విరుద్ధమని, సివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు కూడా ఇది విరుద్దంగా ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
పిటిషనర్ తరఫు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. మహిళా పోలీసుల నియామకాల వివాదంపై కౌంటర్ దాఖలు చేయాలంటూ చీఫ్ సెక్రటరీ, డీజీపీ, హోమ్ సెక్రటరీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, ఏపీపీఎస్సీ చైర్మన్లకు నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులు వెంటనే కౌంటర్లు దాఖలు చేయాలని, వాటిని పరిశీలించిన తర్వాత మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. మహిళా పోలీసుల నియామకాలకు సంబంధించిన జీవో 59పై ఇవాళ కోర్టులో చోటుచేసుకున్న దృశ్యాలు సీరియస్ గా ఉండటంతో ఆ జీవో కొనసాగుతుందా? రద్దవుతుందా? అనే చర్చ పెద్దదైంది.
0 Comments:
Post a Comment