సమయానికి అమ్మఒడి అందేనా?
జూన్‌లో ఇస్తామంటున్న ప్రభుత్వం
అంతవరకు యాజమాన్యాలు ఆగడం అనుమానమే
తల్లిదండ్రులపై భారం పడే అవకాశం
ఈనాడు, అమరావతి: అమ్మఒడి కింద ప్రభుత్వం అందిస్తున్న సాయం ఈ విద్యా సంవత్సరంలో సమయానికి అందుతుందా?
ఏప్రిల్‌లోనే విద్యాసంవత్సరం ముగుస్తున్నా.. ఆలోపు సాయం అందే అవకాశం లేనట్లేనని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వద్ద సోమవారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సందర్భంగా వెలువడ్డ నిర్ణయం ఈ చర్చకు దారితీసింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో విద్యార్థుల హాజరును బట్టి వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు ప్రారంభం కాగానే అమ్మఒడి సాయం జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 75% హాజరు ఉన్నవారికే ఈ సాయం అందుతుంది. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం 2022 జనవరిలో సొమ్ము చెల్లించాలి. 2019 నుంచి అమ్మఒడి కింద ప్రతి పేద కుటుంబంలో చదువుకుంటున్న పిల్లల తల్లులకు రూ.15వేల చొప్పున సాయం అందిస్తున్నారు. దీనికి ముందునుంచే హాజరు నిబంధన ఉన్నా, గత రెండేళ్లూ దాన్ని అమలు చేయలేదు. 2021 జనవరిలో కరోనా కారణంగా హాజరు తగినంత లేకపోయినా ఆ చర్చ లేకుండానే చెల్లించారు. ఇప్పుడు హాజరుతో అనుసంధానం అని చెప్పి చెల్లింపులను 2022 జూన్‌కు వాయిదా వేశారు. ఈ సాయం పొందేవారిలో కొందరు పిల్లలు ప్రయివేటు స్కూళ్లలో చదువుకుంటున్నారు. చాలా ప్రయివేటు స్కూళ్లు అమ్మఒడి నిధులు జమయ్యే జనవరిలోనే ఫీజులు కట్టించుకుంటున్నాయి. ప్రస్తుతం 2022 జూన్ వరకు వాయిదా వేయడంతో యాజమాన్యాలు అంతవరకు వేచిచూసే ఆస్కారం లేదు. ఆ మేరకు కుటుంబాలపై ఫీజుల భారం పడే అవకాశం ఉంది. ప్రస్తుత సంవత్సరం వరకు గతంలోలాగే జనవరిలో చెల్లించాలని, ఈ విద్యాసంవత్సరంలో హాజరు ఆధారంగా 2022-23 విద్యా సంవత్సరానికి చెల్లింపులు చేయొచ్చని తల్లిదండ్రులు సూచిస్తున్నారు.
మళ్లీ అధికారంలోకి వస్తాం.. ఇస్తాం: మంత్రి సురేష్
పిల్లలు బడి మానేయడాన్ని (డ్రాపవుట్) తగ్గించడం కోసమే అమ్మఒడి పథకం ప్రారంభించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. హాజరు శాతం ఆధారంగా.. పాఠశాలలు తిరిగి ప్రారంభించగానే వచ్చే ఏడాది జూన్‌లో ఈ సాయం అందిస్తామని చెప్పారు. 2024 జూన్‌లోనూ తమ ప్రభుత్వమే అమ్మఒడి చెల్లింపులు చేస్తుందని, తాము మళ్లీ అధికారంలోకి వచ్చి వాటిని ఇస్తామని ధీమా వ్యక్తంచేశారు.
0 Comments:
Post a Comment