11,775 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం -నేడో రేపో ఆర్థికశాఖ ఉత్తర్వులు..!!
ఏపీలో కొత్తగా ఉద్యోగాల భర్తీకి సీఎం జగన్ ఆమోద ముద్ర వేసారు. దీనికి సంబంధించి ఆర్దిక శాఖ సైతం ఈ రోజు లేదా రేపు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది.
ఆ వెంటనే నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్ర చరిత్రలో తొలి సారిగా వైద్య ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్ మెంట్ కు వీలుగా సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్..ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు....జిల్లా- ఏరియా టీచింగ్ హాస్పిటల్స్ లో సిబ్బంది నియమాకం కోసం ఈ ఆమోదం తెలిపారు.
భారీ స్థాయిలో ఆరోగ్య శాఖ సిబ్బంది నియామకం
ప్రస్తుతం కొత్తగా పీహెచ్ సీల నిర్మాణం సాగుతున్నందున మరో 3,176 పోస్టులను కూడా తరువాత భర్తీ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించేందుకు డాక్టర్లతో పాటు నర్సులు, పారామెడికల్ సిబ్బంది సహా ఇతర ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఏటా వేతనాల రూపంలో రూ.2,753.79 కోట్లు చెల్లిస్తుండగా కొత్తగా భర్తీ చేసే పోస్టులకు ఏటా అదనంగా రూ.726.34 కోట్ల వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు.
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు
కోవిడ్ సమయంలో మెరుగైన వైద్య సేవలందించేందుకు గతంలోనే 9,700 రెగ్యులర్ పోస్టులను భర్తీ చేశారు. ఇప్పుడు అంతకు మించి పోస్టుల భర్తీ చేపడుతున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు ఒకరు చొప్పున దాదాపు 15,000 మంది ఏఎన్ఎంలు, 7 వేల మందికిపైగా మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రభుత్వం గతంలోనే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు నిరంతరం ఏఎన్ఎంలు అందుబాటులో ఉంటూ 12 రకాల వైద్య సేవలు అందిస్తారు.
అన్ని వైద్య సేవలు ఒకటే చోట అందేలా
14 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. 65 రకాల మందులను సమకూర్చడంతోపాటు 57 రకాల బేసిక్ మెడికల్ ఎక్విప్ మెంట్ ను అందుబాటులో ఉంచుతారు. టెలీ మెడిసిన్ సదుపాలయాలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ మండలంలో రెండు పీహెచ్ సీలతో పాటుగా ఒక్కో పీహెచ్ సీ ల్లో ఇద్దరు డాక్టర్లు చొప్పున సేవలందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రభుత్వం జారీ చేసే నోటిఫికేషన్లలో నియామక అర్హతల పైన స్పష్టత ఇవ్వనుంది. నవంబర్ చివర్లోగా పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
0 Comments:
Post a Comment