దిల్లీ: దేశరాజధాని దిల్లీలోని అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటిష్ కాలం నాటి సొరంగం ఒకటి బయటపడింది. అసెంబ్లీ భవనం నుంచి సుమారు 6 కి.మీ. దూరంలో ఉన్న ఎర్రకోటకు చేరుకునేలా ఈ సొరంగాన్ని నిర్మించినట్లు తెలుస్తోందని దిల్లీ శాసనసభ స్పీకర్ రామ్నివాస్ గోయల్ చెప్పారు.
ఈ సొరంగం ఇక్కడ ఉన్నట్లు చాలా ఏళ్లుగా వినిపిస్తోందన్నారు. దీంతోపాటు అసెంబ్లీ ప్రాంగణంలో బ్రిటిష్ వారు స్వాతంత్య్ర సమరయోధులను ఉరితీయడానికి వాడిన గది కూడా ఉందని గోయల్ తెలిపారు. పాడుపడిన ఆ గదిని నవీకరించి వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవానికి పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశ రాజధానిని 1912లో కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చాక ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా వినియోగించారని, ఆ తర్వాత 1926లో దాన్ని కోర్టుగా మార్చారన్నారు. బ్రిటిష్ పాలకులు తిరుగుబాటుదారులను ఎర్రకోట నుంచి రహస్యంగా ఈ కోర్టుకు తీసుకురావడానికి సొరంగాన్ని వినియోగించేవారని చెప్పారు. ప్రస్తుతం సొరంగం పూడుకుపోయి ముఖద్వారమే కనిపిస్తోందని, అయితే దాన్ని మళ్లీ తవ్వి పునర్నిర్మించే ఉద్దేశం లేదని అన్నారు. దాని ఉపరితలంపైన మెట్రో రైలు మార్గాలతో పాటు మరెన్నో నిర్మాణాలు చేపట్టడమే అందుకు కారణమన్నారు.
1993లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ టన్నెల్ గురించి విన్నాను. ఇది ఎర్రకోట వరకు ఉంటుందని చెప్పేవారు. బ్రిటిష్ వారు స్వాతంత్ర్య సమరయోధుల తరలింపు కోసం ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించేవారని చెప్పుకునేవారు. 1912లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చిన తర్వాత ఈ భవనాన్ని సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉపయోగించేది. ఆ తర్వాత 1926లో దీన్ని కోర్టుకు మార్చారు. అప్పుడు స్వాతంత్ర్య సమరయోధులను కోర్టుకు తీసుకొచ్చేందుకు ఈ మార్గాన్ని ఉపయోగించేవారు. దీని చరిత్రను తెలుసుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కచ్చితమైన సమాచారం లభించలేదు'' అని స్పీకర్ గోయల్ వెల్లడించారు.
ఈ సొరంగం ప్రవేశమార్గం గురువారం బయటపడిందని ఆయన తెలిపారు. ప్రస్తుతానికి తాము ఈ సొరంగ మార్గాన్ని తవ్వాలనుకోవడం లేదన్నారు. మెట్రో ప్రాజెక్టులు, డ్రైనేజీ వ్యవస్థలతో ఈ సొరంగంలో చాలా భాగం ఇప్పటికే ధ్వంసమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. అయితే స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప చరిత్ర కలిగిన ఈ టన్నెల్‌ను పర్యాటక ప్రాంతంగా మారుస్తామని అన్నారు.
0 Comments:
Post a Comment