నిధులు మురగబెట్టేశారు..!
కొన్ని పాఠశాలల్లో నాలుగేళ్ల నుంచి వెచ్చించలేదు
అప్రమత్తమైన సమగ్రశిక్ష అధికారులు
ఈనాడు, అమరావతి
పాఠశాలల్లో సాధారణ పనుల నిర్వహణకు నిధులు లేక ఇబ్బందులు పడుతున్నామని కొందరు ప్రధానోపాధ్యాయులు గగ్గోలు పెడుతున్నారు. మరికొన్ని పాఠశాలల్లో అందుకు విరుద్ధంగా పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇస్తున్న స్కూల్ కాంపొజిట్ గ్రాంటు నిధులను ఖర్చు పెట్టకుండా మురగబెట్టడం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలకు విడుదల చేసిన గ్రాంట్లపై జిల్లా కేంద్రం గుంటూరు పరీక్షా భవన్, సమగ్రశిక్ష కార్యాలయాల్లో ఇటీవల ఆడిట్ జరిగింది. 1770 పాఠశాలలకు 1530 పాఠశాలలే ఆడిట్ చేయించినట్లు ధ్రువీకరణ పత్రాలు అందజేశాయి. మిగిలిన పాఠశాలలు ఎందుకు ఆడిట్ చేయించుకోలేదని ఆరా తీసిన సమగ్రశిక్ష అధికారులకు విస్తుపోయే విషయాలు వారి దృష్టికి వచ్చినట్లు తెలిసింది. కొందరు హెచ్ఎంలు త్వరలో పదవీ విరమణ చేయబోతున్నామని, మరికొందరు నిధుల వినియోగంపై సరైన అవగాహన లేక, ఆడిట్ అభ్యంతరాలు వస్తే వాటికి సమాధానమివ్వాల్సి ఉంటుందనే భయంతో ఖర్చుపెట్టలేదని వారి దృష్టికి వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయా పాఠశాలలు ఆ గ్రాంట్లను ఎందుకు వినియోగించలేదో క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర వివరాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. జిల్లా విద్యాశాఖ అధికారికి నిధులు వెచ్చించని పాఠశాలల వివరాలు పంపుతామని అధికారులు చెప్పారు.
ఇచ్చే నిధులు సరిపోవంటున్న హెచ్ఎంలు: పాఠశాల కరెంటు బిల్లులు, వాటర్ బిల్లులు, బ్లాక్‌బోర్డులు, వాటి వినియోగానికి అవసరమైన చాక్‌పీస్‌లు, మరుగుదొడ్ల శుభ్రతకు ఆయాలకు చెల్లింపులు, చిన్న చిన్న మరమ్మతులు సహా అనేక ఖర్చులు ఉంటాయి. వాటన్నింటిని స్కూల్ గ్రాంటు నిధుల నుంచే వెచ్చిస్తారు. అలాంటిది ఈ పాఠశాలలు ఆ నిధులు ఖర్చుపెట్టకుండా వాటిని ఎలా అధిగమించాయో అర్థం కావడం లేదని ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ప్రస్తుతం ఇస్తున్న కాంపొజిట్ గ్రాంటు నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని చెప్పారు. కొన్ని పాఠశాలల్లో నిధులు ఖర్చుపెట్టకుండా ఉంచడం వెనుక కారణాలు ఏమిటో ప్రాథమికంగా తెలుసుకున్నామని జిల్లా సమగ్ర శిక్ష పథక సంచాలకులు ఎం.వెంకటప్పయ్య తెలిపారు. ఆడిట్ చేయించని పాఠశాలల వివరాలను సేకరించి వీటన్నింటిని ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
0 Comments:
Post a Comment