చదువుకు రుణం తీసుకోవడం, ఉన్నత చదువుల కొరకు విదేశాలు వెళ్లి విద్యను అభ్యసించడం దానికయ్యే అధిక ఖర్చులను తట్టుకోవడానికి విద్యా రుణాలు తీసుకోవడం ఇపుడు చాలా కుటుంబాలలో సాధారణం అయిపోయింది. చాలా భారతీయ బ్యాంకులు ఈ రుణాలందిస్తున్నాయి. పేరున్న విద్యాలయాలలో సీటు ఖరారయితే గ్యారెంటీ లేకుండానే విద్యార్ధినే హామిగా తీసుకుని రుణాలిచ్చే బ్యాంకులు భారత్లో ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) విదేశీ విశ్వవిద్యాలయాలలో కోర్సుల కోసం జాయిన్ అయ్యే విద్యార్ధులకు రూ. 1.50 కోట్ల వరకు కూడా విద్యా రుణాన్ని ఇవ్వడానికి సిద్దపడుతుంది. ఈ పథకం కింద కవర్ చేయబడిన దేశాలలో యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, యూరప్, జపాన్, సింగపూర్, హాంకాంగ్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. `ఎస్బీఐ` విదేశీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో పూర్తి సమయం రెగ్యులర్ కోర్సులను అభ్యసించాలనుకునే విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా విదేశీ విద్యా రుణాన్ని ప్రకటించింది. ఎస్బీఐ `గ్లోబల్ ఎడ్-వాంటేజ్` లోన్ ద్వారా తమ కెరీర్ లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి విదేశాలలో కోర్సులు అభ్యసించాలనుకునే విద్యార్ధులకు సహాయం చేయడానికి రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.
రూ. 7.50 లక్షల నుండి రూ. 1.50 కోట్ల వరకు రుణాన్ని విద్యార్ధులు పొందవచ్చు. మహిళా విద్యార్ధి ధరఖాస్తుదారులకు 0.50% రాయితీతో రుణంపై 8.65% వడ్డీ వర్తిస్తుంది. రెగ్యులర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా సర్టిఫికేట్, డాక్టరేట్ కోర్సులను ఎంచుకునే విద్యార్ధులు ఈ విద్యా రుణానికి అర్హులు. రుణాలు తీసుకున్నవారు కోర్సు పూర్తయిన 6 నెలల తర్వాత తిరిగి రుణ చెల్లింపులు చేయవచ్చు. తిరిగి చెల్లించే కాలం గరిష్టంగా 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ప్రయాణ ఖర్చులు, లైబ్రరీ, ల్యాబ్ ఫీజులు, పుస్తకాలు, కోర్సుకి చెందిన పరికరాలు, యూనిఫాం, కంప్యూటర్ ఫీజులు, ప్రాజెక్ట్ వర్క్, స్టడీ టూర్ల వంటి అదనపు అవసరాలకు మొత్తం ట్యూషన్ ఫీజులో 20% మించకుండా ఉండాలి. డిపాజిట్, బిల్డింగ్ ఫండ్, రీఫండ్ చేయదగిన డిపాజిట్ వంటి ఇతర ఖర్చులు.. ట్యూషన్ ఫీజులో 10% మించకుండా ఉంటే విద్యారుణం కింద అవీ కూడా కవర్ చేయబడతాయి.
విద్యార్ధుల ఐ-20/వీసా కంటే ముందు అతనికి రుణం మంజూరు చేయబడుతుంది. సెక్షన్ 80 (ఈ) కింద పన్ను మినహాయింపుకు అర్హులు.
ధరఖాస్తు ప్రక్రియకు అవసరమయ్యే పత్రాలుః 10వ తరగతి, 12వ తరగతి మార్క్ షీట్, గ్రాడ్యుయేషన్ పూర్తయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్, ప్రవేశ పరీక్ష ఫలితం, అడ్మిషన్ లెటర్/ఆఫర్ లెటర్, యూనివర్సిటి నుండి అడ్మిషన్ రుజువుగా కోర్సు కోసం ఖర్చుల షెడ్యూల్, స్కాలర్షిప్, ఫ్రీ-షిప్ మొదలైనవి అందించే లెటర్ కాపీలు ఇవ్వాలి.
దరఖాస్తుదారుడు గత 6 నెలల బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్, స్థిరాస్తికి సంబంధించి సేల్ డీడ్, విద్యార్ధి/తల్లిదండ్రులు/సహ-రుణగ్రహీత/ హామిదారుల యొక్క శాశ్వత ఖాతా (పాన్), ఆధార్ కాపీలు ఇవ్వాలి. గుర్తింపు చిరునామా కింద పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ / ఓటరు గుర్తింపు కార్డు వంటి అధికారికంగా చెల్లుబాటు అయ్యే పత్రాలు అందించాల్సి ఉంది.
0 Comments:
Post a Comment