Dearness Allowance amount to calculate Gratuity, Leave Encashment of Central Government pensioners changed!
గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ లెక్కింపుపై కేంద్రం తాజా ఉత్తర్వులు
• కరోనా సమయంలో ఆపేసిన డీఏలతో కలిపి లెక్కిస్తూ చెల్లింపు
• రాష్ర్టంలోనూ అలాగే చెల్లించాలని ఏపీ జేఏసీ నేతలు బండి శ్రీనివాసరావు, హృదయరాజు డిమాండ్
సెప్టెంబరు 11: ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించే ఉత్తర్వులు జారీ చేసిందని ఏపి జేఏసి ప్రధానకార్యదర్శి జి.హృదయ రాజు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రభుత్వ ఆదాయం పడిపోవడంతో దేశ ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పలు ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం అందరికి తెలిసిందే. ఆంక్షల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను స్తంభింపచేసిన సంగతి తెలిసిందే. జనవరి 1, 2020 నుంచి జూన్ 30, 2021 వరకు కేంద్ర ప్రభుత్వం డీఏ వాయిదాలు విడుదల చేయలేదు.
జనవరి 1, 2020 నుంచి నాలుగు శాతం, జులై1 2020 నుంచి మూడు శాతం, జనవరి1 2021 నుంచి నాలుగు శాతం చొప్పున పెంచవల్సిన అదనపు కరువు భత్యం వాయిదాలను షెడ్యూలు ప్రకారం ఇవ్వకుండా ఏడాదిన్నర పాటు నిలిపివేసి, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో జనవరి1, 2020 నుంచి జూన్ 30, 2021 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ చెల్లింపులో పెరిగిన డీఏ వర్తించలేదు. ఈ విషయంపై పునరాలోచన చేయాలని చేసిన డిమాండ్ పై కేంద్రం సానుకూలంగా స్పందించింది. జనవరి1, 2020 - జూన్ 30, 2021 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన వారికి ఇటీవల విడుదల చేసిన డీఏలను కలిపి గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ మొత్తాలను లెక్కగట్టి చెల్లించాలని పేర్కొంటూ తాజా ఆదేశాల్లో స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులను పరిగణనలోకి అదే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్, సెక్రెటరీ జనరల్ లు బండి శ్రీనివాస రావు, జి.హృదయ రాజు లు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం జనవరి 2020 - జూన్ 2021 మధ్య కాలంలో పెంచాల్సిన మూడు డీఏ వాయిదాలను ఇంకా మంజూరు చేయలేదు. జనవరి 1, 2020 నుంచి 3.64 శాతం, జులై 1, 2020 నుంచి 2.73 శాతం, జనవరి 1, 2021 నుంచి 3.64 శాతం అదనపు డీఏ మొత్తాలను రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇవ్వాల్సి ఉంది. పెరగనున్న ఈ డీఏ వాయిదాలను కూడా కలిపి గ్రాట్యుటీ, లీవ్ ఎన్ కాష్మెంట్ లెక్కిస్తే రాష్ట్రంలో ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు న్యాయం చేకూరుతుందని ఏపీ జేఏసీ పేర్కొంది.
0 Comments:
Post a Comment