11,827 మందికి పింఛన్ల నిలిపివేత
జిల్లాలో పింఛన్లకు భారీగా కోత పడింది.
ప్రతి నెలా మొదటి తారీఖున పింఛను సొమ్ము కోసం ఎదురుచూసే పండుటాకులకు నిరాశ ఎదురైంది. జిల్లాలో సెప్టెంబరు నెల 11,827 మందికి నిరాశే ఎదురైంది. ఇక వీరికి ప్రతినెలా ప్రభుత్వం అందించే వైఎస్సార్ పింఛను కానుక అందే అవకాశం లేదు. వీరిలో ఎక్కువ మంది పండుటాకులే. వృద్ధులు, ఇతర జిల్లాలకు చెందిన వారికి ఈనెల పింఛను నిలిపివేశారు. గత నెలలో పింఛను అందుకోని వారికి ఈ నెల నిలిచిపోయాయి. అయితే ఎందుకు నిలిపివేశారు..? ఎప్పుడు ఇస్తారు..? అనేవాటికి అధికారుల వద్ద సమాధానం లేదు. కొంత మంది తమకు రేపు, ఎల్లుండి పంపిణీ చేస్తారని చెబుతున్నారు. గత నెలలో మంజూరు చేసిన పింఛన్లకు ప్రస్తుత నెల మంజూరు చేసిన పింఛన్లకు వ్యత్యాసం ఉంది. 11,827 మందికి మొండి చెయ్యి చూపారు. వీరికి రూ.7.12 కోట్ల వరకు అందాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతంలో 8449 మందికి పింఛన్లు నిలిచిపోగా, అర్బన్ ప్రాంతంలో 3378 మందికి ఆగిపోయాయి. ఆగస్టులో రూ.122.39 కోట్లు జిల్లాకు మంజూరు కాగా.. సెప్టెంబరులో రూ.115.28కోట్లే విడుదలయ్యాయి. తొలిరోజు 88.45 శాతం పంపిణీ చేశారు. రూ.102.03కోట్లు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు.
అంతా గప్‌చుప్..!
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ (వైఎస్సార్ పింఛను కానుక) జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గ్రామ వార్డు వాలంటీర్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల తక్కువగా పింఛన్లు రావడంతో అధికారులు అంతా గప్‌చుప్‌గా ఉన్నారు. కారణాలు కానీ వివరాలు కానీ వెల్లడించడం లేదు. గత నెల వివరాలు వెబ్సైట్ నుంచి తొలగించారు. ఏ కారణంతో తొలగించారో చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. దీనికి ప్రాతిపదిక కూడా తెలియడం లేదు. అధికార వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం కొంత మంది వేలిముద్రలు పడడం లేదు. ఇలాంటి వారికి ఐరిస్ ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. కానీ గత నెల పంపిణీ చేయలేదు. ఇలాంటి పింఛన్లు నిలుపుదల చేశారు. అదేవిధంగా జిల్లా పోర్టబిలిటీ ద్వారా ఇతర జిల్లాల పింఛన్లు కూడా పంపిణీ చేసేవారు. ఆధార్ కార్డు ఒక జిల్లాలో ఉండి.. మరో ప్రాంతంలో నివసిస్తున్న వారికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసి పంపిణీ చేసేవారు. ప్రస్తుతం ఆధార్ కార్డులో ఇతర జిల్లా వివరాలు ఉంటే... చిరునామా ఇతర జిల్లా ఉంటే.. ఆ పింఛన్లు నిలుపుదల చేశారు. ఇలా నిలుపుదల చేసినవే ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న సచివాలయ ఉద్యోగుల బియ్యం కార్డులకు కత్తెర వేసిన విషయం తెలిసిందే. ఆ కార్డులలో సభ్యులుగా ఉన్న వృద్ధుల పింఛన్లు నిలుపుదల చేయాలని నిర్ణయించారు. కానీ సెప్టెంబరు నెలకు సంబంధించి మంజూరు అయ్యాయి. వచ్చే నెల వీటికి కోత విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. సాప్ట్వేర్ అభివృద్ధి చేసిన తర్వాత వీటిని నిలుపుదల చేస్తారని చెబుతున్నారు. కొత్తవి రాకపోగా.. ఉన్నవాటిని కత్తిరించడంపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతపై అధికారులు వ్యాఖ్యానించేందుకు, వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు.
0 Comments:
Post a Comment