హైకోర్టు కూల్- 2024లోనే ఇక ముహుర్తం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న కీలక నిర్ణయం ఒకటి ఇప్పుడు హైకోర్టులో పెండింగ్ లో ఉంది.
దీనిపై విచారణ పూర్తయితే కానీ రాష్ట్ర భవిష్యత్తుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎలాగో హైకోర్టులో పెండింగ్ లో ఉంది కాబట్టి దీనిపై ఎక్కువగా మాట్లాడేందుకు అటు అధికార వైసీపీ కానీ, ఇటు విపక్ష టీడీపీ కానీ ఎక్కువగా ఇష్టపడటం లేదు. దీంతో ఈ వ్యవహారం ఇక 2024 ఎన్నికల అజెండాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీని కథా కమామిషు ఏంటో ఓసారి చూసేద్దాం...
అమరావతి ప్రస్ధానం
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు అమరావతి రాజధానిని తెరపైకి తెచ్చారు. అప్పట్లో దానికి వైసీపీ అధినేత హోదాలో జగన్ కూడా సమర్ధించారు. అయితే రాజధాని శంఖుస్ధాపనకు కానీ, దీనిపై నిర్వహించిన సమావేశాలకు కానీ హాజరుకాలేదు. దీంతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూడా జగన్ ను ఎక్కువగా ఇబ్బంది పెట్టదల్చుకోలేదు. చివరికి టీడీపీ ప్రభుత్వం చివరి రోజుల్లోనూ ఎన్నికల్లో అమరావతి రాజధాని అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వైసీపీ అధినేత జగన్ సమర్ధించారు. తాను రాజధానిలోనే ఇల్లు కట్టుకున్నానని, ఇక్కడే ఉంటానని నమ్మ బలికారు. దీంతో జనం రాజధాని అమరావతి కడుతున్న చంద్రబాబును కాదని వైసీపీకే ఓటేశారు.
జగన్ రాగానే సీన్ రివర్స్
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏపీ రాజధాని సీన్ రివర్స్ అయింది. కుక్కను చంపాలంటే ముందుగా దాన్ని పిచ్చికుక్క ముద్ర వేయాలన్న సామెతను అక్షరాలా అమల్లో పెడుతూ వైసీపీ సర్కార్ అమరావతి ఉసురుతీయడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో కృష్ణా నది వరదలకు అమరావతి మునిగిపోతుందని, భారీ భవనాలను తట్టుకునే సామర్ధ్యం అమరావతిలో నేలకు లేదని కొత్త వాదనల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఆ తర్వాత గత టీడీపీ ప్రభుత్వం అమరావతిలో పాల్పడిన అక్రమాలపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. ఇవన్నీ జరుగుతుండగానే ఓ మంచి ముహుర్తం చూసుకుని అసలు విషయాన్ని బయటపెట్టేశారు జగన్.
తెరపైకి మూడు రాజధానులు
ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగకపోతే భవిష్యత్తులో అమరావతి మరో హైదరాబాద్ లా మారుతుందనే అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ సర్కార్.. మూడు రాజధానుల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సీఎం జగన్ 2019 డిసెంబర్లో అలా అసెంబ్లీలో ప్రకటన చేశారో లేదో జీఎస్ రావు కమిటీతో పాటు బోస్టన్ గ్రూప్ వచ్చి అలా మూడు రాజధానులకు అనుకూలంగా నివేదికలు ఇచ్చేశాయి. దీంతో మెరుపువేగంతో అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లుల్ని ఆమోదించారు. మండలిలో చుక్కెదురైనా మరో ఆరునెలల్లో మళ్లీ అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ వద్దకు పంపేశారు. ఆయన కూడా ఆమోదించడంతో ఇక రాజధానుల ఏర్పాటు ఖాయమని అంతా భావించారు. అప్పుడే బ్రేక్ పడింది.
హైకోర్టులో సుదీర్ఘ విచారణ
మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రైతులతో పాటు రాజకీయ పార్టీలు కూడా పిటిషన్లు వేయడంతో హైకోర్టులో దీనిపై విచారణ మొదలైంది. విచారణ ఓ దశకు చేరుకున్న తర్వాత ఛీఫ్ జస్టిస్ బదిలీతో మళ్లీ పరిస్ధితి మొదటికొచ్చింది. చివరికి తాజాగ విచారణ ప్రారంభమైనా తిరిగి నవంబర్ కు వాయిదా పడిపోయింది. ఈ లోపు కేంద్రం రాజధానులపై వైసీపీ సర్కార్ దే ఫైనల్ నిర్ణయమని చెప్పేసింది. కానీ రాష్ట్రంలో వైసీపీ మినహా మరే ఇతర రాజకీయ పార్టీ కూడా మూడు రాజధానుల్ని సమర్దించకపోవడం, ప్రజల్లో నెలకొన్న భయాలు వంటి కారణాలతో అమరావతి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది.
హైకోర్టు కూల్-జగన్. చంద్రబాబు అంతకంటే కూల్
హైకోర్టులో కీలక మైన మూడు రాజధానుల విచారణ నత్తనడకన సాగుతోంది. చిన్నా చితకా కారణాలతో విచారణను పిటిషనర్లు, ప్రతివాదులు వాయిదాలు కోరుతుండటంతో ఈ విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్ధితి. దీంతో సహజంగానే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన దీనిపై మాట్లాడటం మానేశాయి. ఎలాగో హైకోర్టులో ఉన్న వ్యవహారమే కావడంతో తాము ఏం చెప్పినా ఉపయోగం లేదనే నిర్ణయానికి ఆయా పార్టీలు వచ్చేశాయి. దీంతో రోజులు గడుస్తున్నా అమరావతి గురించి మాట్లాడేందుకు పార్టీలు ఆసక్తి చూపడం లేదు. దీంతో అమరావతి ఉద్యమం మాత్రమే మొక్కుబడిగా సాగిపోతోంది.
అమరావతిపై వైసీపీ ప్లాన్ ఇదే
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించి, గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్న వైసీపీ.. హైకోర్టులో విచారణ కాస్త ఆలస్యమైనా, చివరికి తమకు అనుకూలంగానే తీర్పు వస్తుందని ఆశాభావంగా ఉంది. అందుకే మొదట్లో విచారణ త్వరగా పూర్తికావాలని భావించినా ఇప్పుడు మాత్రం ఎప్పుడు విచారణ జరిగినా తుది ఫలితం మాత్రం తనకు అనుకూలంగానే ఉంటుందని ఆశిస్తోంది. కోర్టుల్ని ఒప్పించి మరీ రాజధానిని తరలిస్తామని మున్సిపల్ మంత్రి బొత్స ఇప్పటికే పలుమార్లు చెప్పేశారు. సీఎం జగన్ ఆలోచన కూడా ఇదే కావడంతో రాజధానులపై వైసీపీకి ఎలాంటి ఆందోళనా లేదు.
అందరి చూపూ 2024పైనే ?
అమరావతితో పాటు మూడు రాజధానుల వ్యవహారం తేలేందుకు కనీసం మరో రెండేళ్లు పడుతుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్న ఈ కేసుల విచారణ నవంబర్ లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కనీసం ఆరేడు నెలలైనా కొనసాగడం ఖాయం. హైకోర్టులో తేలినా ఆ తర్వాత రిట్ పిటిషన్లు, సుప్రీంకోర్టులో అప్పీళ్లు ఖాయం. అవి కూడా పూర్తి చేసుకుని తుది తీర్పు వస్తే తప్ప మూడు రాజధానుల భవిష్యత్తు తేలినట్లు కాదు. దీంతో ఈ వ్యవహారం తేలే సరికి 2024 రావడం ఖాయమనే ఆలోచనే సర్వత్రా వినిపిస్తోంది. వైసీపీ, టీడీపీ ఇద్దరూ కూడా ఇప్పట్లో ఈ విచారణ పూర్తయి తీర్పు వచ్చినా రాజకీయంగా తమకు ఎలాంటి లాభనష్టాలు ఉండబోవని భావిస్తున్నాయి. అందుకే 2024లో రాజధానుల వ్యవహారమే అజెండాగా ఎన్నికలకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారు.
0 Comments:
Post a Comment