చాలా కాలం తరువాత తెరుచుకున్న సర్కారీ బడులలో ఉపాధ్యాయులపై అనేక రకాల బోధనేతర పనులను రుద్దుతోంది విద్యా శాఖ. ప్రధానంగా బోధన మీద కేంద్రీకరించడానికి ఇది పెద్ద ఆటంకంగా మారడం ఆందోళనకరం.
ఉపాధ్యాయ వృత్తి అంటే కేవలం ఒక ఉద్యోగం కాదు. ఒక పెద్ద బాధ్యత. జాతి భవిష్యత్తును తీర్చి దిద్దే మహత్తర కర్తవ్యం ఉపాధ్యాయులపై ఉంటుంది. కొత్త తరాల మేథో వికాసం వారి చేతుల్లోనే జరుగుతుంది. తరగతి పాఠ్యాంశాలే కాదు, విద్యార్థులలో నైతిక ధృతి స్థిరపడటానికి ఉపాధ్యాయుల బోధనలు బాటలు వేస్తాయి. కరోనా మహా విపత్తుతో అస్తవ్యస్థమైన జనజీవనం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. మూడవ విపత్తు పొంచి ఉందన్న హెచ్చరికలు వున్నప్పటికీ రాష్ట్రంలో బడులనూ తెరుస్తున్నారు. దాదాపు ఏడాదిపైగా ఇళ్లలోనే ఉండిపోయిన విద్యార్థులు పరిమితంగానైనా పాఠశాలలకు వస్తున్నారు. కరోనా కాటుతో పెద్దలే కకావికలమైన ప్రస్తుత సమయంలో విద్యార్థుల మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమేమీ కాదు. ఈ సమయంలో కావాల్సింది వారికి సాంత్వన కల్పించడం, ధైర్యం చెబుతూనే పాఠ్యాంశాల లోకి మనసును మళ్లించడం. క్రమేణా బడిలో సాధారణ వాతావరణాన్ని సృష్టించగలగడం! అప్పుడే పాఠశాలలు తెరిచిన లక్ష్యం నెరవేరుతుంది. ఈ దిశలో కృషి జరగాలన్నా, విద్యార్థుల్లోనూ వారి తల్లిదండ్రుల్లోనూ భయం పోవాలన్నా ఉపాధ్యాయుల చొరవ చాలా కీలకం. ఆ చొరవ చూపేలా వారి మానసిక ధృతిని పెంచాల్సిన బాధ్యత, వారికి నైతికంగా అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఈ అసలు పని వదిలేసి కొసరు పనికే ప్రాధాన్యత ఇచ్చేలా సర్కారు విధానాలు మారడం దురదృష్టకరం.
బడి ప్రారంభం కాగానే విద్యార్థులకు ఏ పాఠం చెప్పాలన్నా దానిపై ఉపాధ్యాయుల దృష్టి కేంద్రీకృతమవుతుందనుకుంటే పొరపాటే! ఉపాధ్యాయుల హాజరును బయోమెట్రిక్‌తో ముడిపెడుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల సిగల్ సమస్యలున్న సంగతి తెలిసిందే. నిర్దేశించిన సమయంలో బయోమెట్రిక్ నమోదు చేయకపోతే ఆబ్సెంట్ పడిపోతుంది. తమ హాజరే వేసుకోలేని ఉపాధ్యాయులు మిగిలిన అంశాలపై ఏం దృష్టి సారిస్తారు? ఈ గండం గడిస్తే విద్యార్థుల హాజరు తీయడం, దానిని సంబంధిత యాప్‌లో నమోదు చేయడం మరో ఎత్తు! ఈ ప్రక్రియ కూడా బడి ప్రారంభమైన అరగంటలో ముగియాలి. ఆ తరువాత విద్యార్థులు వచ్చినా హాజరు వేయడం కుదరదు. దీంతో తల్లిదండ్రులతో పేచీ, అరగంటలో పూర్తి చేయకపోతే పై నుండి చివాట్లు! ఆ తరువాతైనా పాఠాలు చెప్పే అవకాశం ఉందా అంటే అదీ లేదు. మరుగుదొడ్లను తనిఖీ చేయాలి. వాటి ఫోటోలు తీసి యాప్‌లో పంపాలి. ఆ తరువాత మధ్యాహ్న భోజనం ఎలా వండుతున్నారు? శుభ్రంగా, శుచిగా చేస్తున్నారా లేదా ఫోటోలు తీయాలి. పిల్లలు భోజనం చేస్తున్నప్పుడు, తిన్న స్థలంలో శుభ్రం చేసిన తరువాత ఫోటోలు తీయాలి. ఈ ఫోటోలన్నీ సంబంధిత యాప్‌లో పంపాలి. ఒక్కో దానికి ఒక్కో యాప్! ఆ యాప్‌లో కూడా ఒక్కో ఫోటోను ఇద్దరు, ముగ్గురు అధికారులకు పంపాలి! ఇవి రోజూ తప్పనిసరిగా చేయాల్సిన పనులు. ఏ ఒక్క రోజు చేయకపోయినా విచారణలు..మెమోలు! ప్రస్తుతం అడ్మిషన్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. వీటి వివరాలను కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థులకు ఆధార్‌కార్డ్ లేకపోతే అప్లోడ్ కాదు. అప్లోడ్ చేయకపోతే అడ్మిషన్ జరగదు! టీచర్లు ఏం చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇస్తున్న జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీకి కూడా ఇటువంటి సమస్యలే! ఇలా అనేక అంశాలను ఆన్లైన్, ఇంటర్నెట్తో ప్రభుత్వం ముడిపెట్టింది. ఇవి కాకుండా నాడు-నేడు పనుల పర్యవేక్షణ! ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అనేక పాఠశాలల్లో ఈ కొసరు పనులతోనే ఉపాధ్యాయులకు సరిపోతోంది. ఇక, అసలు పనైన బోధనకు సమయం ఎక్కడ?
నిజానికి విద్యా రంగం లోకి ప్రపంచబ్యాంకు నిధులు రావడంతోనే ఉపాధ్యాయులపై ఈ అదనపు భారం పడటం ప్రారంభమైంది. ప్రపంచ బ్యాంకుకు పంపాల్సిన అనేక నివేదికల రూపకల్పనకు టీచర్లను ఉపయోగించుకున్నారు. క్రమేణా ఆ కొసరు పనులే సర్వస్వంగా, తప్పనిసరిగా చేయాల్సినవిగా మారాయి. విద్యా వ్యవస్థపై ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి. బోధనేతర పనులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. కొసరు భారాన్ని ఉపాధ్యాయులపై తగ్గిస్తేనే బడి భావి పౌరుల వికాసానికి వేదికగా మారుతుంది.
0 Comments:
Post a Comment