బడిలో కొవిడ్ అలజడి
యాజలిలో నలుగురు విద్యార్థులకు పాజిటివ్
తరగతి గదిని శానిటైజ్ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు
బాపట్ల, కర్లపాలెం, న్యూస్‌టుడే అసలే కరోనా మహమ్మారి భయంతో పాఠశాలకు వచ్చే వారు సగం మందే ఉంటున్నారు.
నాలుగు నెలల తరువాత బడులు తెరచుకోగా, జిల్లాలో కర్లపాలెం మండలం యాజలిలో నలుగురు విద్యార్థులకు కొవిడ్ సోకింది. కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలుకావడం లేదు. విద్యాశాఖ ఇప్పటికైనా అప్రమత్తమై గట్టి చర్యలు తీసుకుని బడులు సురక్షితమన్నా విశ్వాసాన్ని తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కల్పించాల్సిన అవసరం ఉంది.
ఈనెల 16 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సెక్షన్‌కు 20 మంది విద్యార్థులను మాత్రమే కూర్చొబెట్టాలని మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. స్థానిక గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాల ద్వారా బడులను శానిటైజ్ చేయించారు. ప్రభుత్వ పాఠశాలలను వ్యాక్సినేషన్ కేంద్రాలుగా వినియోగిస్తుండటం, తరగతి గదుల కొరతతో కొవిడ్ మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయడం లేదు. విద్యార్థుల మధ్య సామాజిక దూరం ఉండటం లేదు. మొదటి రోజు మాత్రమే పాఠశాలకు వచ్చిన విద్యార్థులందరికీ థర్మామీటర్‌తో పరీక్ష చేసి తరగతి గదుల్లోకి పంపించారు. తర్వాత రోజు నుంచి తూతూమంత్రంగా పరీక్ష చేసి పంపుతున్నారు.
హాజరు యాభై శాతమే..
కరోనా భయంతో పూర్తిస్థాయిలో పిల్లలను బడులకు తల్లిదండ్రులు పంపించడం లేదు. ఎక్కువ పాఠశాలలకు 50 శాతం మంది మాత్రమే హాజరవుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో అన్ని సౌకర్యాలు బాగా ఉన్న బడులకు 60 శాతం వరకు పిల్లలు వస్తున్నారు. తరగతి గదుల కొరత ఉన్న పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులకు రోజు మార్చి రోజు బోధన చేయాలని ఉన్నతాధికారులు సూచించారు. విద్యార్థులు సామాజిక దూరం పాటించకుండా బాగా దగ్గరగా కూర్చుంటున్నారు. పాఠశాలల పరిసరాలను పూర్తిగా పరిశుభ్రం చేయలేదు. విరామ సమయంలో మాస్క్‌లు తొలగించి తిరుగుతున్నారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ఇప్పటి వరకు 48 శాతం మంది మాత్రమే రెండు డోసుల టీకా వేయించుకున్నారు.
తల్లిదండ్రుల్లో ఆందోళన
బడులు తెరిచిన నేపథ్యంలో విద్యార్థులకు వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కర్లపాలెం మండలం యాజలి జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థులు 84 మందికి, ఎనిమిదో తరగతి విద్యార్థులకు 14 మందికి బుధవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేశారు. ముగ్గురు ఏడో తరగతి విద్యార్థులు, ఎనిమిదో తరగతికి చెందిన ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. ఒకే పాఠశాలలో నలుగురు విద్యార్థులకు కొవిడ్ రావడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల్లో కలకలం రేగింది. విద్యార్థులను హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బడిలో 60 మంది విద్యార్థులకు గురువారం కరోనా పరీక్షలు చేశారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులతో కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి ఐసోలేషన్‌లో ఉంచారు. బడుల్లో కొవిడ్ నిబంధనలు పక్కాగా అమలయ్యేలా చూసి విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పించాల్సి ఉంది.
మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటిస్తాం
కరోనా బారినపడిన నలుగురికి వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చికిత్స అందిస్తున్నాం. పాజిటివ్ వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, కాంటాక్ట్‌లో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేయించాం. పాఠశాలల్లో కొవిడ్ మార్గదర్శకాలు తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తాం. పాఠశాలల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గట్టి చర్యలు చేపడతాం. విద్యార్థులకు కరోనా పరీక్షలు నిరంతరం నిర్వహిస్తాం.
- శ్రీనివాసరావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి
0 Comments:
Post a Comment