Updated : 21/05/2021 11:16
Old News....
AP High Court: పరిషత్ ఎన్నికలపై సంచలన తీర్పు
అమరావతి: ఏపీ పరిషత్ ఎన్నిలపై హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నోటిఫికేషన్ లేదని ఆక్షేపించింది. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలన్న ఆదేశాలను పాటించలేదని.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ఏడాది ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చి అదే నెల 7న పరిషత్ ఎన్నికలు నిర్వహించారు. పోలింగ్‌కు 4 వారాల ముందు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించలేదంటూ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సహా జనసేన, భాజపా నేతలు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తొలుత విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ఎన్నికలను వాయిదా వేయాలని ఆదేశించారు. సింగిల్ జడ్జి ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తిచేశామని.. కచ్చితంగా 4 వారాల పరిమితి లేదని ప్రభుత్వం తరఫున న్యాయవాది డివిజన్ బెంచ్ ముందు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ఎన్నికల పోలింగ్‌కు అనుమతించిన డివిజన్ బెంచ్.. ఓట్ల లెక్కింపు చేయొద్దని ఆదేశించింది. ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం ఇరు పక్షాల తరఫున పలు మార్లు హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో విచారణను పూర్తిచేసిన ఉన్నత న్యాయస్థానం తాజాగా ఎన్నికలు రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. కొత్తగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
0 Comments:
Post a Comment