నేటి నుంచే బడి అంతా గజిబిజి
విలీనం'తో హైస్కూళ్లకు ప్రాథమిక విద్యార్థులు
సరిపడా లేని గదులతో ఇబ్బందులు
బ్యాచ్‌ల వారీగా చిన్నారుల విభజన
కరోనా నేపథ్యంలో అంతా అలజడి
ఉపాధ్యాయుల కేటాయింపుపై లేని స్పష్టత
నాడు-నేడు రెండో దశా నేడే ప్రారంభ0
నేటి నుంచే విద్యాకానుక 'కిట్స్' పంపిణీ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో పాఠశాలల విలీన నిర్ణయం అయోమయంగా మారింది. సోమవారం నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ విలీన ప్రతిపాదనలను అమలు చేస్తుండడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవని ఉపాధ్యాయులు అంటున్నారు.
ప్రాథమిక పాఠశాలల్ని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం, మొత్తంగా ఆరంచెల విద్యావిధానానికి తెరతీయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో విలీన ప్రక్రియను చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఒక్కో ఉన్నతపాఠశాలలో ఒకటి, రెండు ప్రాథమిక పాఠశాలలను విలీనం చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటివరకు ఒకటి నుంచి ఐదు వరకు తరగతులుండగా.. ఒకటి, రెండు క్లాసులు అక్కడే ఉంచి.. మూడు, నాలుగు, ఐదు తరగతుల్ని మాత్రం ఉన్నత పాఠశాలలకు తరలించాలని నిర్దేశించారు. అయితే, ఉన్నత పాఠశాలల్లో కొత్తగా వస్తున్న ఈ తరగతులకు అవసరమైన క్లాస్రూంలు లేవు. దీంతో సరిపోయిన చోట ప్రారంభించాలని, తరగతి గదులు లేనిచోట ప్రాథమిక పాఠశాలల్లోనే క్లాసులు నడిపించాలని తాత్కాలికంగా నిర్ణయించారు. మొత్తంగా ప్రాథమిక పాఠశాలల్లోని విద్యార్థులు.. ఎప్పటిలా తమ పాఠశాలకే వెళ్లాలా? లేకుంటే దగ్గరిలోని ఉన్నతపాఠశాలల్లో తరగతుల్ని కలిపేస్తే అక్కడికెళ్లాలా? అన్న అయోమయంలో ఉన్నారు. ఈ సందిగ్ధత కొనసాగుతున్న క్రమంలోనే బడులు తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఏ విద్యార్థి ఎక్కడికెళ్లాలి? వారికి ఏ టీచర్ పాఠాలు చెప్పాలన్న స్పష్టత ఇవ్వకుండానే పాఠశాలలు ప్రారంభిస్తుండడం గమనార్హం. మరోవైపు పాఠశాలల్ని ఏ సమయం నుంచి ఏ సమయం వరకు నిర్వహించాలన్న ఉత్తర్వులను ఇవ్వలేదు. దీంతో పాత సమయాలనే అనుసరించాలని పాఠశాల స్థాయిల్లో నిర్ణయించుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్ని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 వరకు, ఉన్నత పాఠశాలలైతే సాయంత్రం ఐదుగంటల వరకు.. నిర్వహించాలని భావిస్తున్నారు.
నాడు-నేడు, విద్యాకానుక
సోమవారం నుంచి తరగతుల ప్రారంభంతో పాటు.. నాడు-నేడు రెండో దశ పనులను ప్రారంభించనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ కూడా చేపట్టనున్నారు. ఒక్కో బ్యాచ్‌లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు లేకుండా విభజించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఆ మేరకు హెడ్మాస్టర్లు ఏర్పాట్లు చేశారు. ఒక తరగతిలో ఎక్కువ మంది విద్యార్థులుంటే వారిని బ్యాచ్‌లుగా విభజిస్తున్నారు. కొన్నిచోట్ల ఒకరోజు కొన్ని తరగతులకు, మరో రోజు కొన్ని తరగతులకు క్లాస్‌లు జరిగేలా నిర్ణయించారు. కొన్ని పాఠశాలల్లో అబ్బాయిలకు ఒకరోజు, అమ్మాయిలకు ఒకరోజు తరగతులు నిర్వహించనున్నారు. థర్మల్ స్కానర్లతో ఉష్ణోగ్రతలు చెక్ చేసి పాఠశాలల్లోకి అనుమతించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొవిడ్ పాజిటివిటీ రేటు 10ు కంటే తక్కువున్న ప్రాంతాల్లోని పాఠశాలలను ప్రారంభించాలని ఆదేశాలుండడంతో.. రాష్ట్రంలో అన్ని పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. విద్యార్థులందరూ మాస్క్ పెట్టుకుని రావాలని ఆదేశించారు. స్కూల్ అసెంబ్లీ, ఆటలు నిర్వహించకూడదని నిర్ణయించారు. విద్యార్థులకు కొత్తగా ముద్రించిన పుస్తకాలు అందించనున్నారు. జగనన్న విద్యాకానుక కిట్లు, బ్యాగ్‌లను కూడా దశలవారీగా పంపిణీ చేయనున్నారు.
0 Comments:
Post a Comment