ఈనాడు-అమరావతి: పాఠశాలల్లో బయోమెట్రిక్ యంత్రాలు, యాప్‌లు పనిచేయకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
విద్యార్థుల హాజరు, కొత్త చేరికలు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ ఇలా ప్రతి అంశం ఆన్లైన్ అయ్యాయి. ప్రతి పాఠశాలలో ఇవి ఎలా ఉన్నాయో పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు యాప్‌లో అనుసంధానం చేయాలి. వీటి అప్లోడ్ కోసం గతంలో పాఠశాలలకు ఐరిస్, బయోమెట్రిక్ డివైస్‌లు పంపిణీ చేశారు. వాటి నిర్వహణ కొరవడి ప్రస్తుతం అవేం పనిచేయటం లేదు. ఐరిస్ యంత్రం సజావుగా పనిచేయాలంటే దానిలో సాఫ్ట్వేర్ లైసెన్స్‌ను నిర్దేశిత కాలానికి పునరుద్ధరించుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ల్లోనే సాప్ట్వేర్ లైసెన్సు గడువు ముగిసింది. ఇప్పటికీ పునరుద్ధరించలేదు. వేలిముద్రల యంత్రాలిదీ అదే పరిస్థితి. ప్రస్తుతం రోజువారీ స్కూళ్ల కార్యకలాపాలను డైరెక్టరేట్‌కు తెలియజేయలేని పరిస్థితిలో హెచ్ఎంలు కొట్టుమిట్టాడుతున్నారు.
ఉపకరణాలకు యాప్‌తో ముడి
ఇప్పటికే సర్కారు పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసం పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తులు, బెల్టు, షూ, బ్యాగ్ వంటివి సమకూర్చుకుని వాటిని విద్యార్థులకు అందజేయటానికి జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్ష యంత్రాంగం చర్యలు తీసుకుంది. ప్రతి విద్యార్థికి కిట్ అందజేసిన వెంటనే వారి తల్లిదండ్రుల వివరాలతో సహా యాప్‌లో నమోదు చేయాలి. యాప్‌లో నమోదు చేయాలంటే జేవీకే సామగ్రి మొత్తం వివరాలు ఉండాలి. వాటిల్లో ఏది లేకున్నా యాప్ తీసుకోదు. జిల్లాలో 3651 పాఠశాలల్లో 4.11 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, రాతపుస్తకాలు, ఇతర సామగ్రి ఇప్పటికే కొంతమేరకు జిల్లాకు చేరింది. పుస్తకాలు ఉన్నా విద్యార్థులకు పంపిణీ చేయలేకపోతున్నామని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. మాన్యువల్‌గా అందజేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. జేవీకే సామగ్రి మొత్తం జిల్లాకు చేరి వాటిని యాప్‌లో అప్లోడ్ చేసుకుని విద్యార్థులకు ఎప్పటికి పంపిణీ చేస్తారో తెలియకుండా ఉంది. జేవీకే కిట్లను విద్యార్థులకు అందజేసినట్లు వారి తల్లిదండ్రుల నుంచి వేలిముద్ర లేదా కనురెప్పల చిత్రీకరణ చేసుకోవాలి. అందుకు డివైస్‌లను సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే మరమ్మతులకు గురైన బయోమెట్రిక్ యంత్రాలను మరమ్మతు చేయించి వాటిని అందుబాటులోకి తేవాలని ఉపాధ్యాయులు కోరుతున్నా స్పందించటం లేదు.
తలెత్తుతున్న సమస్యలివి...
విద్యార్థుల రోజువారీ హాజరు నమోదు చేయటానికి స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ఉంది. కరోనాతో పరీక్షలు లేకుండానే ఆయా తరగతులకు ప్రమోట్ చేయాలని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పటి వరకు తరగతుల బదలాయింపు జరగకపోవటంతో హాజరు నమోదును స్టూడెంట్ యాప్ అనుమతించటం లేదు.
గోరుముద్ద ఇన్స్పెక్షన్ ఫారంలో కోడిగుడ్డు, చిక్కీలు అప్లోడ్ చేయాలి. కానీ వాటిని ఇంతవరకు సరఫరా చేయలేదు. ఈ కారణంగా వాటిని విద్యార్థులకు అందించే అవకాశం లేదు.
నూతన ప్రవేశాలు నమోదు చేయటానికి విద్యార్థి బ్లడ్‌గ్రూపు తప్పనిసరి చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లల బ్లడ్‌గ్రూపులను తెలుసుకోవటానికి టెస్టు చేయించటం లేదు. బ్లడ్‌గ్రూప్ లేకుండా నూతన ప్రవేశాల యాప్ పనిచేయదు.
ఛైల్డు ఇన్ఫోలో ఇతర పాఠశాలల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవటానికి డ్రాఫౌట్ టూ యాక్టివ్ ఆప్షన్ ఇవ్వాలి. మన పాఠశాల నుంచి ఇతర పాఠశాలలకు వెళ్లిన విద్యార్థులను డ్రాపౌట్ చేయటానికి యాక్టివ్ టూ డ్రాఫౌట్ ఆప్షన్ ఇవ్వాలి. ఈ రెండూ లేని కారణంగా ఛైల్డు ఇన్ఫో సైట్ పనిచేయటం లేదు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఈ సమస్యలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రధానోపాధ్యాయులు తెలిపారు. వారి నుంచి వచ్చిన పీడ్బ్యాక్ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు..
0 Comments:
Post a Comment