ఆదోని(అగ్రికల్చర్), ఆగస్టు 26: అవును.. ఆ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు లేవు. విద్యార్థుల తాకిడికి తట్టుకోలేక ఉపాధ్యాయులు బోర్డు పెట్టేశారు.
అయినా విద్యార్థులు ఆ పాఠశాలకు క్యూ కడుతూనే ఉన్నారు. ఆదోనిలోని నెహ్రూ మెమోరియల్ పాఠశాల ఘనత ఇది. ఆ పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు 1,820 మంది విద్యార్థులు ఉన్నారు. 2021-22 విద్యా సంవత్సరానికి 450 మందిని చేర్చుకున్నారు. ఒక్కో తరగతి గదిలో 120 నుంచి 150 మంది కూర్చుంటున్నారు. 80 మందికి సరిపడా గది కావడంతో అదనంగా మరో 40-50 మంది చేరడం వల్ల స్థలం సరిపోక అవస్థలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం హయాం నుంచే ఈ పాఠశాలలో చేరికలు భారీగా ప్రారంభమయ్యాయి. 2018-19 విద్యాసంవత్సరంలో నో అడ్మిషన్ బోర్డు ఏర్పాటు చేశారు. నాడే ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ కింద గదులను నిర్మించింది. రెండేళ్లుగా కొవిడ్ వల్ల పాఠశాలలు అతంత మాత్రమే కొనసాగాయి. ఈసారి పాఠశాల పునఃప్రారంభం కావడంతో చేరికలు పెరిగాయి. తాజాగా ప్రభుత్వం నాడు-నేడు కింద వసతులు సమకూర్చింది.
ఉపాధ్యాయుల బోధన వల్లే..
పాఠశాలకు మంచి గుర్తింపు ఉంది. ఉపాధ్యాయులు వినూత్నమైన బోధనతో విద్యార్థులను ఆకట్టుకుంటున్నారు. తద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నాం. అడ్మిషన్లు పూర్తయినా రికమండేషన్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నారు. తరగతి గదులు చాలడం లేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. కార్పొరేట్‌కు దీటుగా బోధన చేస్తున్నాం. ఎక్కువగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల నుంచి అడ్మిషన్ల కోసం మా పాఠశాలకు వస్తున్నారు.
- అలీమ్సిద్ధికి, ప్రధానోపాధ్యాయుడు
0 Comments:
Post a Comment