'విద్యా కానుక' టెండర్‌పై సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు రద్దు
మళ్లీ తిరిగి విచారణ జరపాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ
🌻సాక్షి, అమరావతి: విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద స్కూల్ బ్యాగ్స్ సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చిలో జారీ చేసిన టెండర్‌ను రద్దు చేసి తిరిగి తాజాగా టెండర్‌ను ఆహ్వానించాలం టూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం గురువారం రద్దు చేసింది. అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యవహారంపై తిరిగి విచారణ జరపాలని సింగిల్ జడ్జిని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. స్కూల్ బ్యాగ్స్ సరఫరా నిమిత్తం జారీ చేసిన టెండర్‌ను సవాలు చేస్తూ అట్లా ప్లాస్టిక్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి టెండర్‌ను రద్దు చేసి తిరిగి టెండర్ ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేయగా దీనిపై గురువారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసింది. ఈ వ్యాజ్యం తేలేంత వరకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీని ఆపాలన్న అట్ల ప్లాస్టిక్స్ తరపు న్యాయవాది అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.
0 Comments:
Post a Comment