Search This Blog

Sunday, 4 July 2021

Special Article - "క్లాసులు ఆన్ - చదువులు లైన్" *** వార్త సండే మేగజైన్ నందు కవర్ స్టోరీగా కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువుల గురించి వాసిలి సురేష్ ఉపాధ్యాయులు నెల్లూరు వారు రాసిన ఆర్టికల్..

 "క్లాసులు ఆన్ - చదువులు లైన్" 

*** 

వార్త సండే మేగజైన్ నందు కవర్ స్టోరీగా కరోనా నేపథ్యంలో విద్యార్థుల చదువుల గురించి వాసిలి సురేష్ ఉపాధ్యాయులు నెల్లూరు వారు  రాసిన ఆర్టికల్..స్కూళ్లు తెరవడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వాలు:

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వివిధ జాతీయ, రాష్ట్ర స్థాయి బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. కొన్ని ప్రవేశ పరీక్షలు, ఉద్యోగ పరీక్షల నిర్వహణ వాయిదా పడింది.ఈ నేపథ్యంలో తిరిగి బడులు ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై వీలైనంత ఎక్కువ మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ పూర్తయిన తర్వాతనే బడులు తెరవడం మంచిది. అంతేకాకుండా మూడో దశ వ్యాప్తిలో చిన్నారులపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న వార్తల నేపథ్యంలో మరింత ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి కాబట్టి బడులు  తెరిచే సమయం ఆసన్నమైంది. కరోనా కారణంగా గందరగోళంగా సాగిన విద్యా వ్యవస్థను చక్కదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో జులై ఒకటో తేదీ నుంచి స్కూళ్లను తెరవాలని నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా, అవి విద్యార్థులకు ఎంత మేర అర్థమయ్యాయో తెలియని పరిస్థితిలో నేరుగా స్కూళ్లను తెరిస్తేనే విద్యార్థులకు మంచిదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే అన్నీ కేటగిరీల విద్యాసంస్థలను రీఓపెన్ చెయ్యాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అన్ని కేటగిరీల విద్యాసంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో, జూలై ఒకటి నుంచి ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. వచ్చే నెల వరకు కరోనా తగ్గుముఖం పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోండగా, కేసులు తగ్గి పరిస్థితులు అనుకూలంగా మారేలోపు స్కూళ్లు, కాలేజీలు అందుకు పున:ప్రారంభానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు. ఈ మేరకు స్కూళ్లను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు చెబుతున్నారు. తెలంగాణలో పాఠశాలలు, విద్యా సంస్థల ప్రారంభానికి సంబంధించి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జూన్ 25 నుంచి ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్కూళ్లకు హాజరవుంటున్నారు. జులై ఒకటి నుంచి విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ప్రారంభించారు.  జులై ఒకటి నుంచి పాఠశాలల ప్రారంభం అంశంపై హైకోర్టులో విచారణ జరగగా, విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష బోధనతోపాటుగా ఆన్లైన్ క్లాసులు ఉంటాయని, విద్యార్థులు ఆన్లైన్ తరగతులుకు గాని లేదా ప్రత్యక్ష తరగతులకు హాజరు కావచ్చునని ప్రభుత్వం తెలిపింది. స్కూళ్లలో భౌతిక దూరం పాటించడం కష్టమని కోర్టు భావిస్తూ దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆన్లైన్ తరగతులకు మాత్రమే పరిమితం చేసింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను స్కూళ్లు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జూలై ఒకటి నుంచి స్కూళ్లకు ఉపాధ్యాయులు హాజరవుతున్నారు. విద్యార్థులకు ప్రత్యామ్నాయ విద్యా ప్రణాళిక రూపొందించారు.విద్యార్థులకి ఆన్లైన్ ద్వారా, దూరదర్శన్ సప్తగిరి ద్వారా, వర్క్ షీట్స్ ద్వారా బోధన చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి తగ్గడంతో విదేశాల్లోనూ పాఠశాలలు తెరిచేశారు. కానీ, ఒక్కసారిగా మళ్లీ విజృంభించేసరికి మూసేశారు. మన విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అలాంటి పరిస్థితులు రాకూడదు. ఈ మహమ్మారి వల్ల హాని ఉండబోదన్న భరోసా లభించినంత వరకు పాఠశాలలు తెరవకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఎయిమ్స్‌ ఇటీవల జరిపిన సర్వేలో 18 ఏళ్లు కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలోనూ కరోనా వైరస్‌ యాంటీబాడీలు ఉత్పత్తి అవుతున్నాయని తేలింది. ఒక వేళ మూడోదశ వ్యాప్తి వచ్చినా చిన్నారులపై ఆ ప్రభావం ఉండకపోవచ్చని వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 


ఆన్లైన్ తరగతులు ప్రారంభించిన ప్రైవేట్ స్కూళ్లు:

 జూలై నుంచి విద్యాసంస్థలు తెరవనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు పిల్లల పాఠశాలలకు పంపించేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇప్పటికే థర్డ్‌వేవ్‌ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతుండటంతో తాము పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సిద్ధంగా లేమనే తల్లిదండ్రులు చెబుతున్నారు. దీన్ని పరిగణలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు జూన్ మొదటి వారం నుంచే ఆన్లైన్ తరగతులు ప్రారంభించి ఈ విద్యా సంవత్సరానికి సంభందించిన అడ్మిషన్లు, ఫీజుల చెల్లింపు మొదలయిన ప్రక్రియను మొదలు పెట్టాయి. కరోనా థర్డ్ వేవ్ వస్తుందనే భయంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆన్లైన్ తరగతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ఏడాది ఒక్క నెల రోజుల మినహా పూర్తి విద్యా సంవత్సరం ఆన్లైన్ లోనే జరిగింది. రానున్న రోజుల్లో ఇదేవిధంగా పిల్లలు ఆన్లైన్ తరగతులకు పరిమితమైతే అనేక సమస్యలు వస్తాయి. లాక్డౌన్ ఎత్తివేసినా భౌతిక తరగతులు సరికాదని, పూర్తి ఫీజుల వసూలు సరికాదని, సగం ఫీజులకే ఆన్లైన్ లో క్లాసులు నిర్వహించాలని తల్లిదండ్రుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న కార‌ణంగా గ‌తేడాది నుంచి స్కూళ్ల‌న్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాధార‌ణ స్కూలు త‌ర‌గ‌తుల‌తో పోలిస్తే ఈ ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వ‌హ‌ణ త‌ల్లిదండ్రుల‌కు భారంగా మారింది. కానీ స్కూళ్ల‌కు మాత్రం వరంలా మారింది. ఎందుకుంటే నిర్వహణ ఖ‌ర్చు త‌గ్గించింది. అయినా కూడా ఫీజులు విష‌యంలో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు వెన‌క్కి త‌గ్గ‌డంలేదు. ఈ అంశాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన సుప్రీంకోర్టు కేవ‌లం ఆన్‌లైన్ క్లాసులే అయితే క‌చ్చితంగా ఫీజులు త‌గ్గించాల్సిందే అని స్ప‌ష్టం చేసింది. ఆన్‌లైన్ క్లాస్‌ల కార‌ణంగా స్కూలు నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులు త‌గ్గాయి కాబ‌ట్టి ఆ ప్ర‌యోజ‌నాన్ని త‌ల్లిదండ్రుల‌కు బ‌దిలీ చేయాల‌ని అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పష్టం చేసింది. కోవిడ్ కార‌ణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందుల‌ను స్కూలు యాజ‌మాన్యాలు అర్థం చేసుకోవాల‌ని, ఆమేరకు వారికి ఉప‌శ‌మ‌నం క‌లిగించాల‌ని ఆదేశించింది. విద్యార్థుల‌కు అందించ‌ని వ‌స‌తుల‌కు కూడా ఫీజులు వ‌సూలు చేయ‌డం లాభార్జ‌నే అవుతుంద‌ని, అది మానుకోవాల‌ని హిత‌వు ప‌లికింది. ఇక గ‌తేడాది లాక్‌డౌన్ కార‌ణంగా చాలా కాలం స్కూళ్లు తెర‌వలేదు. దీని కార‌ణంగా పెట్రోల్‌, డీజిల్‌, క‌రెంటు, నిర్వ‌హ‌ణ ఖ‌ర్చు, నీటి ఛార్జీలు, స్టేష‌న‌రీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధ‌ర్మాస‌నం గతంలో ఆదేశాలు జారీ చేసింది. సుప్రీమ్ కోర్టు ఆదేశాలు అమలు చేసి సామాన్యులపై స్కూల్ ఫీజుల భారం తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. 2021-22 విద్యాసంవత్సరంలో గతేడాది తరహాలోనే ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలనీ, జీవోనెంబర్ 46 అమలు చేస్తామని,  అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. ఈ విద్యాసంవత్సరంలో 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు ప్రభుత్వం చెబుతోంది. ప్రయివేటు స్కూళ్లలో ఈ విద్యాసంవత్సరం ట్యూషన్ ఫీజులే వసూలు చేయాలని ఆదేశాలివ్వాలని, బకాయి ఉన్న ఫీజులను వాయిదా పద్దతిలో చెల్లించేందుకు, సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్రంలో అమలు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఫీజుల కోసం తల్లిదండ్రులను యాజమాన్యాలు పీడించకుండా నియంత్రించాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది.


స్కూళ్ళు తెరవాల్సిన అవసరం :

దేశంలో రోజువారి కొత్త కేసుల సంఖ్య 60 వేల పరిధికి తగ్గింది. కరోనా సెకండ్ వేవ్ నందు కర్ఫ్యూ, లాక్డౌన్లను రాష్ట్రాల వారీగా అమలు చేయడంతో ఇప్పుడు ఒక్కో రాష్ట్రం వీటిని ఉపసంహరించుకుంటున్నాయి. అయినప్పటికీ జాతీయ స్థాయిలో విద్యావిధానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఓ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేకపోతోంది. దాదాపు ఏడాదిన్నరగా దేశంలోని విద్యార్థులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. నగరాలకు చెందిన కొందరు విద్యార్ధులకు మాత్రం ఆన్లైన్ పాఠాలబోధన కొనసాగింది. కానీ కోట్ల సంఖ్యలో పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్ధులు బడులకు, విద్యాభ్యాసానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. దేశంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ఒక్కో రంగం తిరిగి తెరుచుకుంటోంది. పరిశ్రమలు, వ్యాపారాలు తిరిగి ప్రారంభమయ్యాయి. రోజువారి కార్యకలాపాల జోరు పెరుగుతున్నది. అయినప్పటికీ విద్యాసంస్థల ప్రారంభంపై ప్రభుత్వాలు నిర్ణయాన్ని ప్రకటించలేక పోతున్నాయి. ఇప్పటికే కొన్ని కేంద్ర విద్యాసంస్థలు పరీక్షల్ని వాయిదా వేశాయి. మరి కొన్ని రద్దు చేశాయి. రాష్ట్రాల స్థాయిలో పరీక్షలకు సంబంధించి ఒక్కో విధానం అమలౌతోంది. దాదాపు రెండేళ్ళ విద్యాభ్యాసాన్ని కోల్పోయిన విద్యార్థులు ఈ లోటును తిరిగి ఎలా భర్తీ చేసుకుంటారా అన్న ఆందోళన ఇప్పుడు అందరిలో నెలకొంది. అత్యంత కీలకమైన వయసులో రెండేళ్ళ పాటు విద్యాభ్యాసం కోల్పోయిన విద్యార్థుల్లో సహజంగానే సృజనాత్మకత దెబ్బతింటోంది. ఇప్పుడు విద్య అంతర్జాతీయీకరణ అయింది. గతంలోలా విద్యార్థులు ఓ దేశానికే పరిమితం కావడం లేదు. ప్రపంచస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పోటీ పడుతున్నారు. ఇందుకోసం ఇతర దేశాల విద్యార్థులతో పోటీ పడటం తప్పనిసరి. రెండు విద్యాసంవత్సరాల్ని వరుసగా కోల్పోయిన విద్యార్థులు ఇలాంటి పోటీల్లో నెగ్గుకురావడం ఆషామాషీ వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అన్నిరంగాలు పునఃప్రారంభమైనప్పటికీ విద్యారంగాన్ని మూడోవేవ్ వస్తుంది లేదా నాలుగో వేవ్ సంక్రమిస్తుందంటూ అనవసర భయాలతో జాప్యం చేయడం సరికాదని వీరు సూచిస్తున్నారు. ఇతర దేశాలన్నీ విద్యాసంస్థల్ని తెరిచాయి. విద్యాబోధన తిరిగి మొదలెట్టాయి. వారికి పోటీగా భారతీయ విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంది. దేశవ్యాప్తంగా రెండో తరంగం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వెనువెంటనే విద్యారంగాన్ని పునఃప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో ప్రస్తుత విద్యార్థి తరం నిర్వీర్యమౌతుంది. భవిష్యత్ జాతి దయనీయంగా మారుతుంది. ఎదురయ్యే ప్రమాదాల్ని, సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోలేదు. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా నిర్వీర్యమయ్యే జాతి దేశ భవిష్యత్తును నిర్మించలేదని  విశ్లేషిస్తున్నారు.


 స్కూళ్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పాఠశాల యాజమాన్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: 

విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకొనుటకు శానిటైజేషన్ సామగ్రిని సమకూర్చడం, పాఠశాల పరిసరాలు పరిశుభ్రముగా ఉండేలా చూసుకోవడం,  శానిటైజేషన్ చేయడం లాంటివి నిర్వహించడం,  పాఠశాలను విద్యార్థులకు ప్రత్యామ్నాయ రోజులలో నిర్వహించడం, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కోవిడ్-19 గురించి అహగాహన కల్గించడం చేయాలి. పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. పాఠశాల పరిసరాల్లో ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా చూసుకోవాలి. పాఠశాల నందు ఆహ్లాదకరమైన తరగతి గది రూపకల్పన చేయాలి.  విద్యార్థులు తరగతి గదిలో మరియు తరగతి వెలుపల భౌతిక దూరం పాటించేలా చూడాలి.  విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ శానిటైజేషన్ చేసుకోవాలి. తరచుగా చేతులు సుబ్బుతో కడుగుకోవాలి. ముఖానికి మాస్క్ తప్పని సరిగా ధరిస్తూ తరగతి గదిలోకి ప్రవేశించాలి. విద్యార్థులు స్థిరముగా ఉండగలగాలి. ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం సంతరించుకున్న నేపథ్యంలో విద్యార్థులు సైబర్ రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతను విధిగా పాటించాలి. విద్యార్థులు ఉపయోగించే పెన్నులు, పెన్సిళ్లు,  పుస్తకాలు లాంటివి ఎవరి వస్తువులు వారే వాడుకోవాలి. విద్యార్థులు తమ మానసిక ఆరోగ్యం కొరకు యోగ మరియు మెడిటేషన్ సాధన చేయాలి. అయితే విద్యార్థులు శానిటైజర్, హ్యాండ్ వాష్ లాంటివి ఇంటి నుంచి తెచ్చుకొని వినియోగించడం కష్టతరం. కాబట్టి శానిటైజర్, హ్యాండ్ వాష్ లాంటి సౌకర్యాలు ప్రభుత్వమే విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయాలి. ప్రతి స్కూలు, కాలేజీని శుభ్రపరిచి శానిటేషన్ చేయించాలి. స్కూల్స్, కాలేజీలు ప్రతి రోజు శానిటేషన్ చేయాలి. టాయిలెట్లు, వాటర్ ట్యాంక్స్, డ్రింకింగ్ వాటర్ ప్రాంతాలు కచ్చితంగా శానిటేషన్ చేయాలి. స్కూల్ ఫర్నిచర్‌ని, స్టేషనరీ, స్టోరేజ్ ప్రాంతాలను, కిచెన్‌లను, ల్యాబ్‌లను శుభ్రపరచాలి. వైద్య శాఖ సూచించిన మేరకు ప్రతి విద్యార్థి ఆరు అడుగుల  దూరంలో కూర్చునే విధంగా మార్కింగ్ చేయాలి. తల్లిదండ్రుల నుంచి లిఖిత పూర్వకంగా హామీ తీసుకున్న విద్యార్థులను మాత్రమే క్లాసులకు అనుమతించాలి. విద్యార్ధులతో పాటు సిబ్బంది కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. విద్యార్ధులకు జ్వరం, జలుబు, దగ్గు లాంటివి ఉండే పాఠశాలకు అనుమతించకూడదు. మధ్యాహ్న భోజనం అందుబాటులో ఉంచాలి. తరగతి గదిలో 20 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా చూసుకోవాలి. 


ఆందోళనలో తల్లిదండ్రులు :

భారతదేశంలో కరోనా కేసులు తగ్గడంతో చాలా రాష్ట్రాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనా నిబంధనలతో పాఠశాలలు నిర్వహించాలని, తరగతి గదిలో బౌతిక దూరం పాటిస్తూ  తరగతులు నిర్వహించడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.  కరోనా థర్డ్ వేవ్ తో పిల్లలకే ప్రధానంగా ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో పాఠశాలలు తెరవడం అటు తల్లిదండ్రులకు , విద్యార్థులకు ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పుడు అందరికీ పాఠశాలల భయం పట్టుకున్నది. అన్నీ తెలిసి, కరోనా మహమ్మారి గురించి పూర్తిగా అవగాహన ఉన్న పెద్ద వారే మాస్కులు ధరించడం, భౌతిక దూరం నిబంధనలు పాటించడం చేయడం లేదు. ఫలితంగానే కరోనా మహమ్మారి వ్యాప్తి రెండవ దశలో విస్తృతంగా జరిగింది. అలాంటిది తెలిసీ తెలియని చిన్న పిల్లలు, మాస్కులు పెట్టుకొని, భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్ళకు వెళ్లి చదువుకోవాలంటే చాలా కష్టంతో కూడుకున్న విషయం. స్కూళ్లలో విద్యార్థులు, బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, నిర్వహణా సిబ్బంది   పనిచేస్తూ ఉంటారు. విద్యార్థులు పక్క విద్యార్థులతో అసలే మాట్లాడకుండా ఉండరు. ఇలాంటి క్రమంలో ప్రతి రోజూ స్కూల్ అయిపోయే వరకూ వారు సోషల్ డిస్టెన్స్ పాటించేలా, మాస్కులు ధరించేలా చూడడం టీచర్లకు పెద్ద టాస్క్ అవుతుంది. అటు పాఠాలు చెప్పడమే కాకుండా ఇటు కరోనా నిబంధనలు పాటించడం ఇబ్బందికరంగా మారుతుంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రులు కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి భయపడిపోయారు. సెకండ్ వేవ్ లో విపరీతంగా మరణాలు సంభవించడంతో బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఎక్కువ కుటుంబాల్లో కరోనా కల్లోలం సృష్టించింది. ఇలాంటి సమయంలో స్కూళ్ళు తెరవడం వారికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. పిల్లలను బడికి ఎలా పంపాలి అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. పంపకుంటే చదువులో వెనకబడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న ఆన్లైన్ తరగతులనే మరికొంత కాలం కొనసాగిస్తే బాగుంటుందని చెబుతున్నారు. స్కూళ్లు తెరవాలని ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయం తీసుకున్నాయని తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకపక్క కరోనా థర్డ్ వేవ్ తో చిన్నారులకు ముప్పు పొంచి ఉందని చెప్తూనే, మరో పక్క స్కూళ్ళు తెరవడం ఏంటని ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే సమయంలో చాలామంది వైద్యనిపుణులు, ఆఖరికి నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. పాల్ కూడా ఇప్పుడు స్కూళ్ళు తెరవడం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడమేనని పేర్కొన్నారు. పిల్లలకు పూర్తి రక్షణ కల్పించిన తర్వాతనే స్కూళ్ళు తెరిచే నిర్ణయం తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా పరిస్థితులను అంచనా వేయకుండా పాఠశాలను తెరవడం మంచి నిర్ణయం కాదన్నారు. పిల్లలకు కూడా వ్యాక్సిన్ అందించి రక్షణ కల్పించిన తర్వాతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని ఆయన సూచించారు. గతంలో స్కూళ్ళు తెరవడం వల్ల కరోనా మహమ్మారి విజృంభించిన ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేశారు. కోవిడ్ విషయంలో అప్రమత్తత అవసరమని, ఇంకా ముప్పు తొలగిపోలేదని, థర్డ్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయంలో తీసుకునే నిర్ణయాలు తీవ్ర నష్టాన్ని చేకూరుస్తాయని హెచ్చరిస్తున్నారు. 


పరీక్షల నిర్వహణ కష్టతరం - ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి : కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా పదవ తరగతి, ఇంటర్ బోర్డు పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వాలు సుముఖంగా లేక పరీక్షలను రద్దు చేశాయి. విద్యార్థుల ప్రాణాలే ముఖ్యమని భావిస్తున్న తరుణంలో పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, ప్రాణాలు కాపాడటం దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహించకుండా పాస్ చేయడం మంచిదయినప్పటికి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడంలో వైఫల్యం అవుతుంది. ఇందువల్ల కష్టపడి చదివే విద్యార్థులను, చదవని విద్యార్థులను ఒకే విధంగా చూడటం వల్ల భవిష్యత్తులో ఉద్యోగాల ఎంపికలో, విద్యా కోర్సులు అడ్మిషన్ల ప్రక్రియలో ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై నెలలో పరీక్షలు నిర్వహించాలని ప్రయత్నంచగా, ఈ నేపధ్యంలో ప్రతి పిల్లవాడు ప్రాణానికి ప్రభుత్వమే జవాబుదారి అని, పరీక్షల నిర్వహణ వల్ల కరోనా సోకి ఏ ఒక్క విద్యార్థి ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసింది. విద్యా సంవత్సరం చివర్లో నిర్వహించే పరీక్షల బట్టి ఫలితాలు ఇచ్చే విధానానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఏర్పడింది. ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు తరగతులతోపాటుగా సంవత్సరం పొడవునా అంతర్గత పరీక్షలు నిర్వహించడం, వాటిని ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ నందు పొందుపరచడం చేస్తే కరోనా లాంటి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్న తరుణంలో వాటి ఆధారంగా కోర్సు ఫలితాలు వెల్లడించేందుకు వీలవుతుంది. కాబట్టి ఇటువంటి ప్రత్యామ్నయ మార్గాలు, పద్ధతుల మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలి.


కరోనా సెకండ్ వేవ్ పిల్లలపై చూపిన ప్రభావం :

కరోనా రెండో వేవ్‌లో పిల్లలూ గణనీయమైన సంఖ్యలోనే దీని బారిన పడ్డారు. ఇక మూడో వేవ్‌లో వైరస్‌ ప్రభావం పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందని వైద్యనిపుణులంతా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే  కరోనా వల్ల ఏడాది కాలంగా పిల్లలు ఎంతో కోల్పోయారు. చాలా మంది పిల్లలు కరోనా దెబ్బకు తమ తల్లిదండ్రులను పోగొట్టుకున్నారు. అనాథలై అలమటిస్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ఉపాధి కోల్పోవడం వల్ల వారి పిల్లలు ఆకలిదప్పులతో ఇబ్బంది పడుతున్నారు. పిల్లలకు సరైన పోషకాహారం అందటం లేదు. పట్టణాలు, నగరాలలో పిల్లలు ఇంటికే పరిమితమై బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. కేవలం ఆన్లైన్ క్లాసులకు పరిమతం అయిపోయి ఆటపాటలు, వ్యాయామం, క్రీడలు లేక శారీరక, మానసిక ఆరోగ్యం సమస్యలు ఎదురవుతున్నాయి. రెండు విద్యాసంవత్సరాలను కోల్పోతున్నారు. తోటిపిల్లలతో ఆటల్లేవు. ఆనందంతో గెంతులేయాల్సిన వయసులో ఇంటికి, టీవీలకు, ఫోన్లకు పరిమితమై బాల్యాన్ని కోల్పోతున్నారు. మానసిక సమస్యల బారిన పడుతున్నారు.  సెకెండ్ వేవ్ లో పిల్లలు కూడా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు. పిల్లల్లో వచ్చే లక్షణాల్ని చాలామంది గుర్తించలేకపోతున్నారు. దీంతో చాలమంది చిన్నారుల పరిస్థితి విషమంగా తయారవుతోంది. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌లో చిన్నారులు కూడా ఈ మహమ్మారి బారినపడటం ఆందోళన పెంచుతోంది. 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై ఎక్కువగా కరోనా దాడి చేస్తోంది. 

చిన్నారుల్లో సాధారణంగా కనిపించే కరోనా లక్షణాలు: గ్యాస్ట్రిక్‌ సమస్యలు, ఆకలి మందగించడం, వాంతులు, విరోచనాలు, ఒళ్లంతా దద్దుర్లు, జ్వరం, పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడం. 2 నెలల నుంచి 16 ఏళ్ల వయసున్న పిల్లల్లో కరోనా లక్షణాలు ఏ స్థాయిలో ఎలా ఉంటాయనే అంశంపై కేంద్రం సూచనలు చేసింది. ఆ లక్షణాల ఆధారంగా పిల్లల్లో కరోనా ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చని సూచించింది. అంతేకాకుండా చిన్నారులకు స్టెరాయిడ్ చికిత్స అందించవచ్చా లేదా అనే అంశంపై కూడా స్పష్టత ఇచ్చింది. గొంతులో నొప్పి, అతిగా ముక్కుకారడం, దగ్గు లాంటి లక్షణాల్ని స్వల్ప శ్రేణి కరోనాగా పరిగణించాలని కేంద్రం సూచించింది. ప్రాధమిక స్థాయి కరోనా లక్షణాల్లో శ్వాస తీసుకోవడం సాధారణంగానే ఉంటుందని స్పష్టంచేసింది. ఇలాంటి పిల్లల్ని హాస్పిటల్స్ నందు జాయిన్ చేయాల్సిన అవసరం లేదని, హోమ్ ఐసొలేషన్ లోనే ఉంచి నయం చేయొచ్చని తెలిపింది. సమతులాహారంతో పాటు పారాసిట్మాల్ డ్రాప్స్ లేదా టానిక్ ఉపయోగించొచ్చని సూచించింది. సాధారణంగానే పెద్దల క‌న్నా చిన్న పిల్లలకే వ్యాధులు, ఇన్ఫెక్షన్లు ఎక్కువ‌గా వస్తాయనే విష‌యం అంద‌రికీ తెలిసిందే. వారు నిత్యం దుమ్ము, ధూళిలో ఆడుతుంటారు. మరోవైపు శుభ్రత త‌క్కువ‌గా పాటిస్తారు. స్కూల్‌లోనూ ఇత‌ర పిల్లలతో క‌ల‌సి తిరుగుతారు క‌నుక వారికి వ్యాధులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ఇక కరోనా సమయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తల్లితండ్రుల ద్వారానో, బంధువులు, చుట్టూ పక్కల వారి వలనో కరోనా సంక్రమించే ప్రమాదం ఉంది. అయితే పిల్లలు అనారోగ్య సమస్యల బారిన ప‌డ‌కుండా ఉండాలంటే వారిలో శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచాలి. దీంతో ఇన్‌ఫెక్షన్లు నుంచి కూడా త‌ప్పించుకోవ‌చ్చు. 16 ఏళ్ల లోపు వయస్సున్నవారు కరోనా బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడం ఒక్కటే మార్గం. సరైన పోషక పదార్ధాలున్న ఆహారం ఇవ్వడం ద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెంచవచ్చు.


కరోనా థర్డ్ వేవ్ పిల్లలకు ఉన్న ముప్పు:

దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎప్పుడు రావచ్చు? వస్తే ఇది సెకండ్ వేవ్ కంటే శక్తివంతంగా ఉంటుందా? చిన్న పిల్లలే ఎక్కువగా బాధితులు అవుతారా? ఇప్పుడు ఈ అంశాలపైనే మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుందని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరించడంతో దీన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఐసీయూ  బెడ్స్‌ సంఖ్యను పెంచుకోవడం, సిబ్బంది నియామకం, మందులు సిద్ధం చేసుకోవడంపై దృష్టిసారించాయి. థర్డ్ వేవ్ వస్తే ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.  నేపథ్యంలో థర్డ్ వేవ్‌కు సంబంధించి లోకల్‌ సర్కిల్స్ సోషల్ మీడియా వేదికపై నిర్వహించిన సర్వే నివేదిక సంచలన విషయాలు వెల్లడించింది. ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్ రావొచ్చని ఆ సర్వే తేల్చింది. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను పూర్తిగా ఎత్తేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఆంక్షలు పూర్తిగా ఎత్తేసిన వెంటనే మాల్స్, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయి. రెండు మాసాలుగా లాక్‌డౌన్‌లో తమ ఇళ్లకే పరిమితమైన జనం మరో నెల, రెండు నెలల్లో జనసమూహం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది థర్డ్ వేవ్‌కు దారితీసే అవకాశముందని లోకల్ సర్కిల్స్ అంచనావేసింది. మరో రెండు మాసాల్లో రెస్టారెంట్లలో భోజనం చేసేందుకు వెళ్తామని సర్వేలో పాల్గొన్న వారిలో 31శాతం మంది తెలిపారు. 53 శాతం మంది ఇప్పట్లో రెస్టారెంట్లకు వెళ్లే యోచన తమకు లేదని వెల్లడించారు. అలాగే షాపింగ్ కోసం మాల్స్‌కు వెళ్తామని 29 శాతం మంది తమ మనోగతాన్ని చెప్పారు. 90 శాతం మంది తమ బంధుమిత్రుల ఇళ్లను సందర్శించడం లేదా వాళ్లను తమ ఇంటికి పిలవబోతున్నట్లు తెలిపారు. అలాగే జులై మాసం నుంచి తమ ఇళ్లలో పనివాళ్లను మళ్లీ పెట్టుకోవాలని యోచిస్తున్నారు. తద్వారా ఒకట్రెండు మాసాల్లోనే జన సమూహాలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తమ సర్వేలో తేలినట్లు లోకల్ సర్కిల్స్ వెల్లడించింది. ఈ కారణాలతో ఊహించిన దానికంటే ముందే దేశంలో థర్డ్ వేవ్‌ వచ్చే అవకాశముందని హెచ్చరించింది. దేశంలోని 314 జిల్లాలకు చెందిన 34 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరిలో 66శాతం మంది పురుషులు, 34 శాతం మంది మహిళలు ఉన్నారు. దేశంలో కరోనా కేసుల ఉధృతి తగ్గుముఖం పడుతున్నా, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని, జనం గుమికూడే సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని సూచిస్తున్నారు. అలాగే మాస్క్‌లు, చేతులు కడుక్కోవడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలి.

భారతదేశంలో 12 ఏళ్లలోపు పిల్లలు 16.5 కోట్ల మంది ఉన్నారు. మూడో వేవ్‌లో పిల్లలకే ఎక్కువ ముప్పు ఎక్కువని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడో వేవ్ నందు మన దేశంలోని మొత్తం పిల్లల్లో 20 శాతం మందికి మందికి కరోనా వైరస్‌ సోకినా వారికి సరైన వైద్య సహాయం అందించేందుకు ఎటువంటి వసతులు, సౌకర్యాలు అవసరమవుతాయన్న దాని గురించి ఆలోచించాలి. ఒకవేళ అతి కొద్ది మందికి తీవ్రమైన ప్రభావం చూపినట్లయితే వారికి వైద్యం అందించేందుకు 1.65 లక్షల పీడియాట్రిక్‌ ఐసీయూ బెడ్లు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మనదేశంలో పెద్దల కోసం ఉన్న ఐసీయూ బెడ్లు 90 వేలు లోపు మాత్రమే. పిల్లల కోసం ఉన్నవి 2000 కన్నా తక్కువే. ఈ పరిస్థితుల్లో పిల్లలకు చికిత్స చేయడం కూడా కష్టతరమవుతుంది. సరైన వైద్యం అందించేందుకు అవసరమయినంత మంది పీడియాట్రీషియన్లు కూడా మన దేశంలో అందుబాటులో లేరని గమనించాలి. అయితే మొదటి ముందస్తు చర్యగా  పిల్లలున్న తల్లిదండ్రులందరికీ వ్యాక్సిన్ వేయడం వల్ల పిల్లలకు కరోనా వల్ల కలిగే ముప్పు కొంతమేర తగ్గించవచ్చు. 

మన దేశంలో మొదటి వేవ్‌లో 4 శాతం పిల్లలకు వైరస్‌ సోకితే, రెండో వేవ్‌లో ఆ సంఖ్య 10 నుంచి 15 శాతంగా ఉంది. దాదాపు 33 కోట్ల జనాభా ఉన్న అమెరికాలో ఇప్పటిదాకా దాదాపు 37 లక్షల మంది చిన్నారులు కొవిడ్‌ బారిన పడ్డారు. అమెరికాతో పోలిస్తే మూడు రెట్లకు పైగా అధిక జనాభా ఉన్న మనదేశంలో పిల్లలు కరోనా బారిన పడే ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుందనే ఆందోళన ఉంది.  ఆ అంచనా ప్రకారం వైరస్‌ బాధిత చిన్నారుల సంఖ్య కోటి దాటితే, ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న మౌలిక సదుపాయాలు ఏ మాత్రం సరిపోవు. ఫలితంగా మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ముప్పును సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రస్తుతం సిద్ధమవ్వాలని పలువురు వైద్యనిపుణులు సూచిస్తున్నారు. పీడియాట్రిక్‌ వెంటిలేటర్ల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దేశంలో పీడియాట్రిక్‌ వెంటిలేటర్లు తయారు చేసే సంస్థలు తక్కువ సంఖ్యలో ఉన్నాయి. వాటి ఉత్పత్తిని భారీగా పెంచితేగానీ, రానున్న ముప్పును ఎదుర్కోలేని పరిస్థితి ఉంది. లేకుంటే సెకండ్ వేవ్ నందు ఆస్పత్రుల వద్ద కనిపించిన  హృదయవిదారక దృశ్యాల వంటివే మున్ముందుకూడా కనిపించే ముప్పు ఉంది. ఈ నేపథ్యంలోనే ‘బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖకు, భారత వైద్య పరిశోధన మండలికి ఒక లేఖ రాసింది. ఆ లేఖలో కీలక సూచనలు చేసింది. మూడో ప్రభంజనాన్ని ఎదుర్కొనేందుకు దేశంలో ‘పీడియాట్రిక్‌ ఇన్‌ఫ్రా’ అంటే కరోనా బారిన పడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలను జూలైనాటికల్లా పెంచుకోవాలని, వేవ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆ లేఖలో సూచించింది. ‘‘నవజాత శిశువుల్లో కరోనా కేసులను ఎదుర్కోవడానికి ‘నియోనాటల్‌/చిల్డ్రన్‌ ఎమర్జెన్సీ ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీస్‌ (నెట్స్‌)’ను అత్యవసరంగా పునర్వ్యవస్థీకరించుకోవాల్సి ఉంది. పిల్లలు, నవజాత శిశువలను తరలించడానికి కావాల్సిన అత్యవసర రవాణా సేవలు/ అంబులెన్సులకు సంబంధించి తప్పనిసరి ఆదేశాలు జారీ చేయండి’’ అని కేంద్రానికి తెలిపింది. పిల్లలకు.. ప్రత్యేకించి, నవజాత శిశువులను తరలించే అంబులెన్సుల్లో వెంటిలేటర్లు, ఇంక్యుబేటర్ల వంటి నిర్ణీత ఉపకరణాలు ఉండాలని, కానీ దేశంలో అలాంటి సౌకర్యాలున్న అంబులెన్స్‌లు దాదాపు లేవని ఆందోళన వెలిబుచ్చింది. కాబట్టి, రానున్న ముప్పును ఎదుర్కోవడానికి తక్షణం రంగంలోకి దిగాలని, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఇతర రంగాల సాయంతో వాటిని వీలైనంత వేగంగా ఉత్పత్తి చేయాలని సూచించింది. జిల్లాల్లోని మౌలిక వసతులపై కరోనా బారిన పడిన చిన్నారులకు చికిత్స చేయడానికి సంబంధించి జిల్లాలస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు, వసతుల గురించి సమాచారం పంపించాల్సిందిగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ఏ జిల్లాలో ఎన్ని సిక్‌ న్యూబోర్న్‌ యూనిట్స్‌,  పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు, నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు ఉన్నాయి. వాటిలో పిల్లల కోసం ఎన్ని పడకలు, ఇంక్యుబేటర్లు ఉన్నాయి, తీవ్ర సమస్యలతో వచ్చేవారికి ప్రత్యేకంగా కేటాయించిన పడకలెన్ని, పిల్లల వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ స్టాఫ్‌, ఇతరత్రా సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఈ వివరాలన్నీ సమర్పించాల్సిందిగా కోరింది. ఇక పిల్లల్లో కరోనా చికిత్సకు సంబంధించిన వివరాలు, మార్గదర్శకాల గురించి తమకు వివరాలు పంపాలని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవకు రాసిన లేఖలో పేర్కొంది. పిల్లలకు ఎక్కువ ప్రమాదంగా భావిస్తున్న థర్డ్‌వేవ్‌ను ఎలా ఎదుర్కోవాలనేదానిపై ఎన్సీపీసీఆర్‌ ఇప్పటికే ఒక ఆలోచనతో ఉంది. ఆ సంస్థ చేసిన సూచనలను పట్టించుకుని, మార్గదర్శకాలను అమలు చేస్తే పిల్లలను కాపాడుకోవచ్చు. ఆ బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే. అయితే ఇందులో మరో ముప్పు ఏంటంటే ఇప్పుడు పెద్దవారికి కరోనా వస్తే అత్యవసర వినియోగ అనుమతి కింద రెమ్‌డెసివిర్‌, ఫాబిఫ్లూ లాంటి యాంటీ వైరల్‌ మందులు, కొన్ని రకాల ఇమ్యూనో మాడ్యులేటర్లు, బ్లాక్‌ ఫంగస్‌ వంటి సమస్యలొస్తే యాంటీ ఫంగల్‌ ఏజెంట్లు ఇస్తున్నాం. పిల్లలపై ఆయా ఔషధాలను ప్రయోగాత్మకంగా, విచ్చలవిడిగా వాడలేం. సమస్య అంత దాకా రాకూడదనుకుంటే అందుకు ఏకైక పరిష్కారం పిల్లలకు టీకాలు వేయడమే. థర్డ్‌ వేవ్‌లో పిల్లలకు ఎక్కువగా ముప్పు ఉండొచ్చంటూ వైద్య నిపుణులు అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పిల్లలను కాపాడుకొనే దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. 


ఇప్పట్లో పిల్లలకు వ్యాక్సినేషన్ సాధ్యమయ్యేనా?

పద్దెనిమిదేళ్లు దాటినవారికే టీకాలు సరిగ్గా దొరకని ప్రస్తుత పరిస్థితుల్లో 18 ఏళ్లలోపువారందరికీ వ్యాక్సినేషన్‌ అంటే చాలా కష్టమే. అమెరికాలో 12ఏళ్లు దాటినవారికి ఫైజర్‌ టీకా వేసేందుకు ఎఫ్‌డీఏ ఇటీవలే అనుమతిచ్చింది. ఎఫ్‌డీఏ అనుమతి ఇచ్చాక 12-15 ఏళ్ల వయసున్న 6 లక్షల మంది బాలలకు ఫైజర్‌ టీకాలు వేశారు. మనదేశం విషయానికొస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్నదే రెండు టీకాలు కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌. ఇంకా విస్తృత స్థాయిలో అందరికీ అందుబాటులోకి రాలేదు. ఉన్న వీటిలో దేని వద్దా పిల్లలపై ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారం ఇప్పటికి లేదు. భారత్‌ బయోటెక్‌ సంస్థ 2 నుంచి 18ఏళ్ల వారిలో ఫేజ్‌ 3 ట్రయల్స్‌కు డీజీసీఐ అనుమతి పొంది పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆస్ట్రాజెనెకా కూడా 6 నుంచి 17ఏళ్ల వారిపై ట్రయల్స్‌ నిర్వహిస్తోందిగానీ, దానికి సంబంధించిన సమాచారమేదీ వెల్లడి కాలేదు. జైడస్‌ క్యాడిలా సంస్థకు చెందిన వ్యాక్సిన్‌ ఈ ఏడాదిలో అందుబాటులోకి రావడం అసాధ్యమని అంటున్నారు. ఫైజర్‌ టీకా మనదేశంలో ఇంకా పెద్దవాళ్లకే అందుబాటులోకి రాలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని చిన్నపిల్లలున్న 45 సంవత్సరముల లోపు తల్లులకు వ్యాక్సిన్ వేస్తున్నారు.   అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లో పదేళ్లలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు టీకా ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తోంది. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో తల్లిదండ్రులకు వ్యాకినేషన్ ప్రక్రియను చేపట్టాలి. తద్వారా కొంతమేరకు అయినా కోవిడ్ బారిన పిల్లలు పడకుండా కాపాడుకోవచ్చు.

- వాసిలి సురేష్

9494615360

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top