IT Rules: యూజర్ల రక్షణ కోసమే కొత్త రూల్స్!
కేంద్ర నూతన ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్
దిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఐటీ నిబంధనలు యూజర్ల సాధికారత, రక్షణ కోసమేనని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో సామాజిక మాధ్యమ సంస్థలు సురక్షిత, బాధ్యతాయుతమైన వాతావరణంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు ఈ కొత్త నిబంధనలు దోహదం చేస్తాయన్నారు. ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఐటీ చట్టం అమలవుతున్న తీరుపై కేంద్ర మంతి అశ్విని వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు.
'దేశంలో నూతన ఐటీ చట్టం అమలు, అభ్యంతరకర పోస్టులను తొలగించడంతో పాటు నెలవారీ నివేదికలను అందించడంపై సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌తో కలిసి సమీక్ష జరిపాను.
ఈ మార్గదర్శకాలు యూజర్లను మరింత శక్తిమంత చేయడంతో పాటు వారికి పూర్తి రక్షణ కల్పిస్తాయి. మరోవైపు దేశంలో బాధ్యతాయుతమైన వాతావరణంలో సామాజిక మాధ్యమ సంస్థలు పనిచేయడంలో ఇవి ఎంతగానో దోహదపడుతాయి' అని కేంద్ర ఐటీ శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ 'కూ' యాప్‌లో పేర్కొన్నారు.
భారత్‌లో ఈఏడాది మే 25నుంచి నూతన ఐటీ చట్టం నిబంధనలు అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 50లక్షల యూజర్లు కలిగిన ప్రముఖ సామాజిక మాధ్యమ సంస్థలు ముగ్గురు అధికారులను (ఆర్జీఓ, చీఫ్ కంప్లయన్స్ఆఫీసర్, నోడల్ అధికారి) నియమించుకోవాలి. వారందరూ భారత్‌లోనే నివసిస్తున్నవారై ఉండాలి. కాగా, 1.75 కోట్ల మేర వినియోగదారులున్న ట్విటర్ నిబంధనలు పాటించని కారణంగా గత నెల మధ్యవర్తిత్వ హోదాను కోల్పోయింది. దీంతో పలువురు యూజర్లు చేసిన అభ్యంతరకర పోస్టులకుగానూ ట్విటర్‌పై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. చివరకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలకు దిగివచ్చిన ట్విటర్ భారత్‌లో 'రెసిడెంట్ గ్రీవెన్స్ అధికారి'(RGO)ని నియమించింది. భారత్‌కు చెందిన వినయ్ ప్రకాశ్‌కు ఆ బాధ్యతలు అప్పజెప్పినట్లు వెబ్సైట్లో పేర్కొంది
0 Comments:
Post a Comment