గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అనంతరం వారిని శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
మరో మూడు నెలల్లో వీరాంత రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో రెండు దశలలో పరీక్షలను నిర్వహించి ప్రొబేషన్ ఖరారు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నాయకత్వ లక్షణాలు, సాబర్డినేట్ సర్వీస్ నిబంధనలు, డిజిటల్ సేవలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పై మొదటి దశలో 35 మార్కులతో పరీక్ష, ఆ తర్వాత ప్రభుత్వ పథకాలు, శాఖ పరమైన అంశాలతో 65 మార్కులకు మరో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో ఫెయిల్ అయిన వారికి మరోసారి పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలను ఆన్ లైన్ ద్వారా ఏపీపీఎస్సీ నిర్వహించనుంది.
పరీక్ష తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం 1.34 లక్షల మంది సచివాలయాల్లో పనిచేస్తున్నారు.
డిజిటల్ లిటరసీకి సంబంధించిన పలు వీడియోలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లతో కూడిన మెటీరియల్‌ను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. ఉద్యోగులు వారి తీరిక సమయాల్లో తమకు కేటాయించిన ప్రత్యేక పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆ శిక్షణలో పాల్గొనేలా వీలు కల్పించారు. మొత్తం 1.22 లక్షల మంది కొత్తగా నియమితులైన ఉద్యోగులు సచివాలయాల్లో పనిచేస్తుండగా.. అందులో 7 వేల మంది తొలిరోజు లాగిన్ అయి శిక్షణలో పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు.
శిక్షణ మెటీరియల్ ఈ నెల 31 వరకు అందుబాటులో ఉంటుందని, ఆలోగా ఎప్పుడైన పాల్గొనే వీలు ఉంటుందని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ ఉద్యోగుల సర్వీసు రూల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌కు సంబంధించిన శిక్షణ మెటీరియల్ అందుబాటులోకి వస్తుందని అధికారులు వెల్లడించారు. శిక్షణ అనంతరం ఆయా అంశాలపై ఉద్యోగుల ప్రావీణ్యతను పరీక్షించేందుకు రాతపరీక్ష నిర్వహిస్తామన్నారు.
0 Comments:
Post a Comment