నాపై విద్యాశాఖ కక్ష కట్టింది
చినవీరభద్రుడిపై ఫిర్యాదుచేశానని వేధింపులు
ఇంటర్ విద్యా కమిషనర్‌కు ఉపాధ్యాయుని లేఖ
అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యాశాఖ తనపై కక్ష కట్టిందని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నేత తేనె సాయిబాబ ఆందోళన వ్యక్తంచేశారు. పాఠశాల విద్యా డైరెక్టర్ వాడ్రేవు చిన వీరభద్రుడి అక్రమాలు, వేధింపులపై ఫిర్యాదు చేశాననే కారణంగా వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న తనపై పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కర్నూలుజిల్లా డీఈవో అభియోగాలు నమోదు చేశారన్నారు. చిన వీరభద్రుడిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఇంటర్ విద్యా కమిషనర్ వి.రామకృష్ణను విచారణాధికారిగా నియమించిన విషయం తెలిసిందే.
సాయిబాబ గురువారం విజయవాడ ఇంటర్ బోర్డు కార్యాలయంలో రామకృష్ణను కలిసి లేఖ అందజేశారు. ''చిన వీరభద్రుడి అక్రమాలకు సంబంధించి ఈ నెల 8న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేశాను. దీంతో విద్యాశాఖ కక్ష కట్టింది. విద్యాశాఖ అధికారులతో కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఐఏఎస్ అధికారితో విచారణ జరిపిస్తేనే నాకు న్యాయం జరుగుతుంది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు.
0 Comments:
Post a Comment