ఏకీకృతంతో స్థానిక విద్యార్థులకు నష్టం
మెడికల్ ప్రవేశాలపై నిపుణుల కమిటీ అభ్యంతరం
2024 వరకు ఈ పద్ధతిలో అసాధ్యం
నేడు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక!
🌻ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వైద్య విద్యలోని ఎంబిబిఎస్, పిజి కోర్సుల్లో ప్రవేశాలకు కేంద్రం నిర్వహించే ఏకీకృత కౌన్సెలింగ్పై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అభ్యంతరం తెలిపింది. కేంద్రం అమలు చేయనున్న పద్ధతికి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అనుకూలంగా ఉండవని, కొత్త విధానం వల్ల ఇక్కడ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నిపుణుల కమిటీ తేల్చింది. ప్రవేశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు తలెత్తితే ఢిల్లీ చుట్టూ తిరగాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. వైద్యవిద్యలో ప్రవేశాలకు కేంద్రమే కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఇటీవల రాష్ట్రాలతో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. దీని సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఐదుగురు సభ్యుల కమిటీ పది రోజులు అధ్యయనం చేసింది. కొత్త పద్దతి వల్ల నష్టం ఉందని స్పష్టం చేసింది. ఈ నివేదికను శుక్రవారం ప్రభుత్వానికి అందించనుంది.
🌻రాష్ట్రంలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రతి మెడికల్ కళాశాలలోనూ 85 శాతం సీట్లను స్థానికులకు, 15 శాతం సీట్లు స్థానికేతరులకు కేటాయిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర కౌన్సెలింగ్లో చేరితే ఈ కోటాకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య బిసి రిజర్వేషన్లలో వ్యత్యాసం ఉంది. మన రాష్ట్రంలో ఒబిసి కోటా లేదు. బిసి కోటా మాత్రమే ఉంది. మన రాష్ట్రంలో బిసి కేటగిరికి 29 శాతం, ఎస్సిలకు 15, ఎస్టిలకు 6, ఇడబ్ల్యుఎస్ కేటగిరికి 10 శాతం రిజర్వేషన్లున్నాయి. వీటితోపాటు స్పెషల్ కేటగిరి కింద మహిళలకు 33 శాతం, వికలాంగులకు 5, సైనికుల పిల్లలకు 1, ఎన్సిసికి 1, క్రీడాకారులకు 0.5, అమరవీరుల కుటుంబాలకు చెందిన పిల్లలకు 0.25 శాతం రిజర్వేషన్లున్నాయి. మెరిట్ ఆఫ్ ఎ రిజర్వడ్ కేటగిరి కూడా రాష్ట్రంలో అమల్లో ఉంది. దీనిపై గతేడాది జిఓ 150 కూడా వచ్చింది. దీని ప్రకారం ఒక రిజర్వుడు కేటగిరికి చెందిన అభ్యర్థి ఒపెన్ కేటగిరికి వెళ్తే ఆ సీటును అదే కేటగిరికి చెందినవారితో భర్తీ చేయాలి. కేంద్ర కౌన్సెలింగ్లోకి వెళ్తే దీనికి కూడా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉందని, ఇవన్నీ అమలు చేయాలంటే కేంద్రం నిర్వహించే కౌన్సెలింగ్లో చేరలేమని కమిటీ స్పష్టం చేసింది. పైగా కేంద్ర కౌన్సెలింగ్లోకి వెళ్లిన తరువాత ఏదైనా సమస్య వస్తే విద్యార్థులు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తోందని, అందుకే 2024 వరకూ కేంద్ర కౌన్సెలింగ్లో చేరలేమని కమిటీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించేందుకు కమిటీ సిద్ధమైంది.
0 Comments:
Post a Comment