Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Thursday, 17 June 2021

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

Dt.23/6/2021

Corona: ఉపశమనం ఇచ్చే ‘పాజిటివ్‌’ న్యూస్‌!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. టెస్ట్‌లు పెరుగుతుండగా.. కేసులు, మరణాల్లో తగ్గుదల కనబడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు అధికంగా కొనసాగుతుండటంతో యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ దిగొస్తోంది. మరోవైపు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఊపందుకొంది. గత మూడు రోజులుగా 50లక్షలకు పైగా డోసుల పంపిణీ జరిగింది. థర్డ్‌వేవ్‌ ముప్పు నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. హైదరాబాద్‌ జంటనగరాల్లో ఎంఎంటీఎస్‌ రైళ్ల పరుగులు మొదలయ్యాయి. కరోనా కాలంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం..


* భారత్‌లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగం పుంజుకొంది. వరుసగా మూడో రోజూ 50లక్షలకు పైగా డోసులు పంపిణీ జరిగినట్టు కేంద్రం వెల్లడించింది. ఈ సాయంత్రం 4గంటల వరకు 51లక్షల డోసులు పంపిణీ చేశారు. ఒక్క మధ్యప్రదేశ్‌లోనే ఈరోజు 9 లక్షలకు పైగా డోసులు ఇవ్వడం విశేషం. ఈ నెల 21న దేశ వ్యాప్తంగా 88లక్షల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీతో రికార్డు నమోదు చేయగా.. ఈ నెల 22న 54.2లక్షల డోసులు పంపిణీ జరిగింది.


* తెలంగాణలో పాజిటివిటీ రేటు 1 శాతానికి తగ్గిందని, రోజుకు సగటున 1.17లక్షల పరీక్షలు జరుగుతున్నట్టు ప్రజా ఆరోగ్యశాఖ సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు నివేదించారు. వ్యాక్సినేషన్‌ కూడా చురుగ్గా కొనసాగుతోందని చెప్పారు. ‘‘రాష్ట్రంలో ఇంకా 1.94కోట్ల డోసుల టీకా అందుబాటులో ఉంది. ఈ నెల 29 నాటికి కేంద్రం నుంచి మరో 10.76లక్షల డోసులు రావాల్సి ఉంది. నీలోఫర్‌ సహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా 6వేల పడకలు సిద్ధం చేశాం. పిల్లల వైద్యులతో కమిటీ ఏర్పాటు చేసి సలహాలు తీసుకొంటున్నాం. ఔషధాలు సిద్ధంగా ఉంచాం’’ అని తెలిపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌లో భారీగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ నెల 20న ఒక్కరోజే 13.74లక్షల మందికి వ్యాక్సిన్‌ అందించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 22వరకు రాష్ట్రానికి 41,10,530 వ్యాక్సిన్‌ డోసులు అందగా.. 39,89,671 డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. 


* హైదరాబాద్‌ జంటనగరాల్లో మళ్లీ ఎంఎంటీఎస్‌ రైళ్ల కూత ప్రారంభమైంది. అతితక్కువ ఖర్చుతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఈ రైళ్లు 15 నెలల తర్వాత బుధవారం నుంచి పాక్షికంగా అందుబాటులోకి వచ్చాయి. గతంలో 121 సర్వీసులు తిరగ్గా.. ప్రస్తుతం 10 సర్వీసులే అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లలో ప్రయాణాలకు టిక్కెట్లను యూటీఎస్‌ మొబైల్‌ యాప్‌, ఏటీవీఎంలలో బుకింగ్‌ చేసుకొనేవారికి అదనపు బోనస్‌ను కూడా అందిస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.


* ప్రజలంతా కరోనా టీకాలు వేసుకునేలా ప్రోత్సహించడంతో పాటు ప్రయాణికులను ఆకర్షించేలా దేశీయ అతిపెద్ద బడ్జెట్‌ విమానయాన సంస్థ ఇండిగో సరికొత్త ఆఫర్‌ ప్రకటించింది. ఒకటి లేదా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న కస్టమర్లకు ‘వాక్సీఫేర్‌’ పేరిట ప్రత్యేక డిస్కౌంట్‌లో భాగంగా టికెట్ల బుకింగ్‌ సమయంలో 10 శాతం తగ్గింపును ప్రకటించింది. బుధవారం నుంచే ఇది వర్తింపజేస్తున్నట్టు తెలిపింది. బుకింగ్ సమయంలో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ సమర్పించడంతో పాటు ప్రయాణ సమయంలోనూ కౌంటర్‌ వద్ద చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. 


* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసుల కన్నా రికవరీలు పెరగడంతో క్రియాశీల కేసుల కొండ కరుగుతోంది. మంగళవారం 19లక్షలకు పైగా శాంపిల్స్‌ పరీక్షించగా.. 50,848 పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి. అలాగే, 1358 మరణాలు సంభవించాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 6.43లక్షలకు దిగొచ్చింది. దేశంలో రికవరీ రేటు 96.56%గా ఉండగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 2.67%గా ఉంది.

* తెలంగాణలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు, పరీక్షలకు గరిష్ఠ ధరలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. సాధారణ వార్డులో ఐసోలేషన్‌, పరీక్షలకు రోజుకు రూ.4వేలు, ఐసీయూ గదికి రోజుకు రూ.7500, వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ గది రూ.9వేలు, పీపీఈ కిట్‌ ధర రూ.273 మించరాదని పేర్కొంది. హెచ్‌ సీటీ రూ.1995, డిజిటల్‌ ఎక్స్‌ రే 1300, సాధారణ జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకు కి.మీ.కు రూ.75 (కనీసం రూ.2 వేలు), ఆధునిక జీవనాధార వ్యవస్థ ఉన్న అంబులెన్సుకైతే రూ.125 (కనీసం రూ.3వేలు) చొప్పున నిర్ణయించింది.


* కరోనా సంక్షోభంలో సేవలందిస్తున్న ఆశా వర్కర్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. జులై నుంచి వారి వేతనంపై రూ.1000 ఇంక్రిమెంట్‌తో పాటు స్మార్ట్‌ఫోన్‌, రూ.500 కొవిడ్‌ భత్యం ఇవ్వనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపె వెల్లడించారు. దీంతో 68వేల మందికి పైగా కమ్యూనిటీ ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. మంత్రి చేసిన ప్రకటనతో తమ డిమాండ్లపై వారం రోజుల నిరసనను ఉపసంహరించుకొంటున్నట్టు తెలిపారు. కరోనాతో మృతిచెందిన ఆశా వర్కర్లకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు చెప్పారు. వచ్చే ఏడాది జులైలో మరో రూ.500 ఇంక్రిమెంట్‌ వేయనున్నట్టు మంత్రి హామీ ఇచ్చారు. 


* కరోనా థర్డ్‌ వేవ్‌ మరికొన్ని వారాల్లో రానుందని, పిల్లలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. జులై నాటికి రాష్ట్రంలో 1300 పీడియాట్రిక్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హెచ్‌కే ద్వివేది తెలిపారు. బెంగాల్‌లో కరోనా పాజిటివిటీ రేటు 3.61శాతానికి తగ్గిందన్నారు. ఆక్సిజన్‌ లభ్యతకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


* ముంబయిలో అతిపెద్ద మురికివాడ ధారవిలో ఈ రోజు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని బీఎంసీ వెల్లడించింది. ఇప్పటివరకు ధారవిలో 6875 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం 10 యాక్టివ్‌కేసులు ఉన్నాయి. జూన్‌ నెలలో సున్నా కేసులు నమోదు కావడం ఇది మూడోసారి. గతంలో జూన్‌ 14, 15 తేదీల్లో కూడా సున్నా కేసులు నమోదయ్యాయి.


Dt.21/6/2021

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశాన్ని వణించిన కరోనా సెకండ్‌వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుదల కొనసాగుతోంది. మరోవైపు, వ్యాక్సినేషన్‌లో సరికొత్త రికార్డు సోమవారం నమోదైంది. దిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుదల నమోదైంది. రేపు ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాలకు బస్సు సర్వీసులను కర్ణాటక నడపనుంది. కొవిడ్‌ వేళ ఊరటనిచ్చే కొన్నివార్తలు మీకోసం..


* కరోనా వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. కేంద్ర ప్రభుత్వం సవరించిన కొత్త వ్యాక్సినేషన్‌ పాలసీ నేటినుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో  ఒక్కరోజులోనే భారీగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ జరిగింది. ఈ సాయంత్రం 6.30గంటల సమయానికి దేశవ్యాప్తంగా 75లక్షలకు పైగా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. సోమవారం నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కూడా కేంద్రం ఉచితంగా టీకాలు అందిస్తున్న విషయం తెలిసిందే. 


* తెలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు దిగి వస్తున్నాయి. తెలంగాణలో గడిచిన 24గంటల వ్యవధిలో 1,19,537 శాంపిల్స్‌ పరీక్షించగా 1197 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. తాజాగా 9మంది మృతిచెందగా.. 1709మంది కోలుకున్నారు. ప్రస్తుతం 17,246 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇకపోతే ఏపీలో కొత్త కేసులు 3వేల కన్నాతక్కువే నమోదయ్యాయి. 55,002 శాంపిల్స్‌ పరీక్షించగా.. 2620 మందిలో వైరస్‌ బయటపడింది. తాజాగా 44మంది మృతిచెందగా.. 7504మంది కోలుకున్నారు. ప్రస్తుతం 58,140 క్రియాశీల కేసులు ఉన్నాయి.

* దేశంలో కరోనా కేసుల తగ్గుదల కొనసాగుతోంది. కొత్త కేసులు 88 రోజులు కనిష్ఠస్థాయికి చేరాయి. ఆదివారం 13.88 లక్షల శాంపిల్స్‌ పరీక్షించగా.. 53,256 మందిలో వైరస్‌ ఉన్నట్టు నిర్ధారణ అయింది. మరోవైపు, మరణాలు కూడా కూడా తగ్గుతున్నాయి. కొత్త కేసుల కన్నా రికవరీలే ఎక్కువగా కొనసాగుతున్నాయి.  యాక్టివ్‌ కేసుల గ్రాఫ్‌ కిందకు దిగుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.83శాతంగా ఉండగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.32%గా కొనసాగుతోంది. భారత్‌లో రికవరీ రేటు 96.36%గా ఉంది. 


* రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.98 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా 29.35 కోట్ల డోసులు రాష్ట్రాలకు సమకూర్చగా.. 26.36 కోట్ల డోసులు పంపినీ జరిగిందని తెలిపింది. ప్రస్తుతం 2,98,77,936 డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు తెలిపింది. 


* కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. దేశంలో ఆక్సిజన్‌ కొరతతో అల్లాడుతున్న తరుణంలో తమ సంస్థ తరఫున 15లక్షల లీటర్లకు పైగా ప్రాణవాయువును దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలకు సరఫరా చేసినట్టు వేదాంత గ్రూపు వెల్లడించింది. థర్డ్‌ వేవ్‌ ముప్పు సంకేతాల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ఇప్పటికే పలు చర్యలతో సిద్ధంగా ఉన్నట్టు ఆ గ్రూపు సీఈవో సునిల్‌ దుగ్గల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వేదాంత కేర్స్‌ ఇన్సియేటివ్‌లో భాగంగా తమ కంపెనీ దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో  1410 క్రిటికల్‌ కేర్‌ బెడ్‌లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, 502 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లతో పాటు 10,500 పీపీఈకిట్లను కూడా సమకూర్చిందన్నారు.


* దిల్లీలో కరోనా వైరస్‌ పూర్తిగా అదుపులోకి వచ్చింది. సోమవారం 57,128 శాంపిల్స్‌ పరిక్షించగా.. 89మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలింది. గతేడాది ఏప్రిల్‌ నుంచి ఇదే అత్యల్పం కావడం విశేషం. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 0.16%కి పడిపోయింది. గత 24గంటల వ్యవధిలో 11మంది మరణించారు. రికవరీ రేటు 98.12శాతంగా ఉంది.

* దేశ ప్రజలకు పూర్తి స్థాయిలో డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్లు అందించేందుకు వీలుగా డిసెంబర్‌ నాటికి భారత్‌లో 257 కోట్ల డోసులు ఉంటాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. సోమవారం ఆయన ఆర్‌ఎంఎల్‌ ఆస్పత్రిలో టీకా కేంద్రాన్నిపరిశీలించారు.  కరోనా సమయంలో ఇతర పార్టీల కార్యకర్తలు క్వారంటైన్‌ లేదా ఐసీయూలో ఉంటే భాజపా కార్యకర్తలు మాత్రం తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి క్షేత్రస్థాయిలో పనిచేశారని ప్రశంసించారు. మరోవైపు, కరోనాను వైరస్‌పై పోరులో కీలక అస్త్రమైన టీకా పంపిణీని మరింత వేగవంతం చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. జులై- ఆగస్టు నాటికి వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆయన గుజరాత్‌ వెళ్లారు. 


* లాక్‌డౌన్‌ కారణంగా నిలిపివేసిన అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక మళ్లీ పునరుద్ధరించింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గడంతో తెలుగు రాష్ట్రాలకు బస్సులు నడపనున్నట్టు కేఎస్‌ఆర్టీసీ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం 6గంటల నుంచి బస్సు సర్వీసులు ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. ప్రయాణికులు ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చని, ప్రయాణం సమయంలో ప్రతిఒక్కరూ కొవిడ్‌ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేసింది.


* కరోనా మూడో ముప్పు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. తమ రాష్ట్రంలో వైద్య సదుపాయాలను  మరింత మెరుగుపరుస్తున్నట్టు రాజస్థాన్‌ ఆరోగ్యమంత్రి రఘు శర్మ తెలిపారు.  200లకు పైగా ఐసీయూ పడకలు జేకే లాన్‌ ఆస్పత్రిలో త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రస్తుతం అక్కడ 800 పడకలు ఉన్నట్టు చెప్పారు. 600 పడకలు కొవిడ్‌ రోగులకు రిజర్వు చేయవచ్చని తెలిపారు. అవసరమైతే వీటన్నింటినీ ఐసీయూ పడకలుగా మారుస్తామని తెలిపారు.

Dt.20/6/2021

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు ఎత్తివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకొన్ని ఊరట కలిగించే వార్తలు మీకోసం.


* అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణలో లాక్‌డౌన్‌ ఎత్తివేతతో అంతర్‌ రాష్ట్ర సర్వీసులు యథావిధిగా నడవనున్నాయి. సోమవారం నుంచి ఏపీకి బస్సులు నడపనున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలో లాక్‌డౌన్‌ నిబంధనలకు అనుగుణంగా బస్సు సర్వీసులు నడపాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1,00,001 నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,646 కరోనా కేసులు నమోదయ్యాయి.  50 మంది మరణించినట్లు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 63,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది.


* దేశ రాజధాని దిల్లీలో సోమవారం నుంచి బార్లు, పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ, దిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ(డీడీఎంఏ) ఉత్తర్వులు జారీ చేసింది. 50శాతం సామర్థ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10గంటల వరకూ బార్లు తెరిచి ఉంచవచ్చని తెలిపింది.పబ్లిక్‌ పార్కులు, ఉద్యానవనాలు, గోల్ఫ్‌ క్లబ్‌లు, ఆరు బయట యోగా కార్యక్రమాలకు కూడా డీడీఎంఏ అనుమతి ఇచ్చింది.

* దేశంలో కరోనా ఉద్ధృతి మరింత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు 60 వేల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 18,11,446 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 58,419 కేసులు నమోదయ్యాయి.  81 రోజుల తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.


* కొవిడ్‌-19 బాధితుల్లో వెంటిలేటర్, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ అవసరమయ్యేవారిని ముందుగానే గుర్తించేందుకు భారత్‌లో ఒక కొత్త సాఫ్ట్‌వేర్‌ సిద్ధమైంది. దీనికి ‘కొవిడ్‌ సివ్యారిటీ స్కోర్‌’ అని నామకరణం చేశారు. ఆరోగ్యం విషమించకముందే బాధితులకు సకాలంలో చికిత్స అందించి, ప్రాణాలు కాపాడటానికి ఇది దోహదపడుతుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఒక అల్గోరిథమ్‌ ఉంటుంది. ఇది బాధితుల్లో వ్యాధి లక్షణాలు, సంకేతాలు, కీలక పరామితులు, ఆరోగ్య పరీక్షల ఫలితాలు, ఇతరత్రా అనారోగ్యాలు వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది. వాటిని విశ్లేషించి.. కొవిడ్‌ తీవ్రత స్కోరు (సీఎస్‌ఎస్‌)ను ఇస్తుంది. దీని ఆధారంగా వెంటిలేటర్‌ తోడ్పాటు, ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్, ఇతరత్రా సేవలు అవసరమయ్యే వారిని ముందుగానే గుర్తిస్తుంది.

* కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 9 లక్షల నుంచి 10 లక్షలకుపైగా వ్యాక్సిన్‌ డోసులు వేయాలనే లక్ష్యంతోనే రాష్ట్రంలో మాస్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఇవాళ ఒక్కరోజే సుమారు 12 లక్షల మందికి టీకాలు ఇచ్చినట్లు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.


* కంటికి కనిపించనంత దూరంలో ప్రయాణించే విధానంలో.. డ్రోన్‌ల ద్వారా ఔషధాల సరఫరాను దేశంలో తొలిసారిగా కర్ణాటకలో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. బెంగళూరుకు 80 కి.మీ.ల దూరంలోని చిక్కబళ్లాపుర జిల్లా గౌరిబిదనూర్‌లో ఈనెల 21న అధికారికంగా దీనికి శ్రీకారం చుడుతున్నారు. నారాయణ హెల్త్‌కేర్‌ భాగస్వామ్యంతో బెంగళూరుకు చెందిన డ్రోన్‌ నిర్వహణ కంపెనీ టీఏఎస్‌ దీనికి నేతృత్వం వహిస్తోంది.Dt.19/6/2021

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా మహమ్మారి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు తగ్గుతుండగా.. రికవరీలు పెరుగుతున్నాయి. దీంతో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను క్రమంగా సడలిస్తున్నాయి. తెలంగాణలో పూర్తిగా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్‌ కేసులు 72 రోజుల కనిష్ఠానికి చేరాయి. ఏపీలో రేపు ఒక్కరోజే 10లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించడమే లక్ష్యంగా మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. కరోనా కష్ట సమయంలో ఊరటనిచ్చే కొన్ని వార్తలు మీకోసం.. 


* తెలంగాణలో కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. వైద్యశాఖ అందించిన నివేదికను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టంచేసింది. ఆదివారం నుంచి సంపూర్ణంగా లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని ఈ భేటీలో నిర్ణయించారు. జులై 1నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలు పూర్తి సన్నద్ధతతో ప్రారంభించాలని ఈ మేరకు విద్యాశాఖను కేబినెట్‌ ఆదేశించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినంత మాత్రాన ప్రజలు నిర్లక్ష్యంగా ఉండొద్దని, మాస్క్‌ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేసింది.


* ఏపీలో ఆదివారం ఒక్కరోజే 10లక్షల మందికి టీకా వేయించడమే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉన్న తల్లులతో పాటు 45 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు విదేశాలకు వెళ్లేవారు కూడా తమ సమీపంలోని టీకా కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చని అధికారులు తెలిపారు. 

*  నిజామాబాద్ జిల్లా బికనెల్లి గ్రామ సర్పంచ్ తమ గ్రామాన్ని మాస్క్ ఫ్రీ విలేజ్‌గా ప్రకటించారు. కరోనా మొదటి, రెండో వేవ్‌లో తీసుకున్న పటిష్ట చర్యల వల్లే గ్రామంలో ఎవరికీ కొవిడ్ సోకలేదని సర్పంచ్ నాగకళ తెలిపారు. తమ గ్రామంలో మాస్క్‌లు వాడకుండానే తిరుగుతున్నామని, బయటి గ్రామాలకు వెళ్లేటప్పుడు మాత్రం తప్పకుండా మాస్క్‌లు ధరిస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. 


* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 1647 మరణాలే నమోదు కావడం కాస్త ఊరటనిస్తోంది. అలాగే, యాక్టివ్‌ కేసుల సంఖ్య దాదాపు 74 రోజుల కనిష్ఠానికి (7.6లక్షలు) చేరింది. దేశంలో కొత్తగా 60.7 వేల కేసులు నమోదు కాగా.. రికవరీ రేటు 96.16శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.98%కి దిగగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 3.58శాతంగా ఉంది. 


*  రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఇంకా 2.87 కోట్ల డోసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదనంగా మరో 52.26 లక్షల డోసులను రాష్ట్రాలకు మూడు రోజుల్లో పంపిణీ చేయనున్నట్టు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇకపోతే నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా దాదాపు 33లక్షల డోసుల టీకాను పంపిణీ చేశారు.


* భారీ వ్యాక్సినేషన్‌తోనే కరోనా మహమ్మారిని కట్టడి చేయగలమన్న నిపుణుల సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా అసోంలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ పది రోజుల్లోనే వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశించారు. జులై 1నుంచి కార్యాలయాలన్నీ పూర్తిస్థాయిలో పనిచేసేందుకు వీలుగా ఈ ఆదేశాలు ఇచ్చారు. అలాగే, జూన్‌ 21నుంచి రోజుకు మూడు లక్షల చొప్పున టీకాలను వేయాలన్నారు. నెలలో రాష్ట్రంలోని సగం మందికి వ్యాక్సిన్‌ వేయాలని భావిస్తోంది. అలాగే, ఈ నెలాఖరు నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆదేశించారు. 

*  కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చిన సందర్భంలో ఆక్సిజన్‌ అందక అల్లాడిన రాష్ట్రాలకు ప్రాణవాయువు పంపిణీ చేసేందుకు కేంద్రం ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.అయితే, ఇప్పటివరకు ఈ రైళ్ల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు 18వేల మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎంఓ) సరఫరా చేసినట్టు రైల్వేశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 32,464 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేసినట్టు తెలిపింది. మొత్తం 448 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని 1854 ట్యాంకర్లతో 15 రాష్ట్రాలకు ఆక్సిజన్‌ సకాలంలో అందజేసినట్టు పేర్కొంది. తెలంగాణకు 3300 మెట్రిక్‌ టన్నులు, ఏపీకి 4100 మెట్రిక్‌ టన్నుల చొప్పున పంపిణీ చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 


* తెలంగాణలో కరోనా కేసులు మరింత తగ్గాయి. గడిచిన 24గంటలల్లో 1,23,005 శాంపిల్స్‌ పరీక్షించగా.. 1362 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 10మంది మృతి చెందగా.. 1813మంది కోలుకున్నారు. ప్రస్తుతం 18,568 క్రియాశీల కేసులు ఉన్నాయి.


*  మహారాష్ట్రలోని ఠానే పురపాలక శాఖ అధికారులు హిజ్రాల కోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్టు డాక్టర్‌ సురేశ్‌ ఠాకూర్‌ తెలిపారు. మరోవైపు, త్రిపురలో 10, 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి రతన్‌లాల్‌ నాథ్‌ ప్రకటించారు. పరీక్ష రాయాలనుకొనే విద్యార్థుల కోసం పరిస్థితులు సద్దుమణిగాక నిర్వహిస్తామని తెలిపారు.
Dt.18/6/2021

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి తగ్గుతోంది. ఏపీలో కరోనా కర్ఫ్యూని సడలించారు. థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు నైపుణ్యాభివృద్ధి కోసం చేపట్టిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్స ఔషధాల లభ్యత పెరిగినట్టు కేంద్రం వెల్లడించింది. కరోనా సంక్షోభ సమయంలో ఉపశమనం ఇచ్చే కొన్నివార్తలు మీ కోసం..


* కరోనా వైరస్‌ స్వభావం ఎలాంటి సవాళ్లు విసిరిందో రెండో దశ తెలియజేసిందని, రాబోయే రోజుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల నైపుణ్యాభివృద్ధి కోసం కోసం స్వల్పకాల శిక్షణా కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ప్రధాని కౌశల్‌ వికాస్‌ యోజన 3.0 కింద రూ.276కోట్లతో  చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 26 రాష్ట్రాల్లో 111 శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా శిక్షణ ఇవ్వనున్నారు. కరోనా వైరస్‌ పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. 


* ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో కొవిడ్‌ నిబంధనల నుంచి కొన్ని సడలింపులను ప్రకటించింది. జూన్‌ 21నుంచి 10 రోజుల పాటు ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సడలింపులు ఇచ్చింది. అంటే, రాత్రిపూట కర్ఫ్యూ మాత్రమే కొనసాగనుంది. కొవిడ్‌ పాజిటివిటీ రేటు అధికంగా ఉండటంతో తూర్పుగోదావరి జిల్లాను మినహాయించింది. అక్కడ మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకూ మాత్రమే సడలింపులు ఉంటాయని తెలిపింది. తాజా మినహాయింపుల నేపథ్యంలో సాయంత్రం 5గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. 

కరోనా అనంతరం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న బ్లాక్‌ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫొటోరిసిన్‌-బి, ఇతర ఔషధ నిల్వలు దేశంలో అవసరానికి మించి ఉన్నట్టు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ వెల్లడించారు. ఈ ఔషధం ఉత్పత్తిని భారత్‌ ఐదు రెట్లు పెంచిందని తెలిపారు. ఏప్రిల్‌లో కేవలం 62వేల వయల్స్‌గా ఉన్న ఉత్పత్తి ఈ నెలలో 3.75లక్షలు దాటుతుందని అంచనా వేశారు. దేశీయంగా ఉత్పత్తిని పెంచడంతో పాటు, విదేశాల నుంచి 9.05 లక్షల వయల్స్‌ను మైలాన్‌ సంస్థ ద్వారా కేంద్రం తెప్పిస్తోందన్నారు. దేశంలో ఆంఫోటెరిసిన్‌-బి అందుబాటును పెంచే ఏ ఒక్క అవకాశాన్నీ భారత్‌ వదులుకోలేదని తెలిపారు. ఈ నెల 17వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు మొత్తంగా 7,28,045 వయల్స్‌ కేటాయించినట్టు ఆయన పేర్కొన్నారు 


* దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. 513 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువగానే ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వ్యాక్సినేషన్‌ తర్వాత కరోనా సోకినా ఆస్పత్రిపాలయ్యే ముప్పును 75నుంచి 80శాతం మేర తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆక్సిజన్‌ అవసరాలు 8శాతానికి తగ్గాయని..  మే 10 నుంచి 78.6శాతం మేర క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టినట్టు వివరించారు. అలాగే, మే 7తో పోలిస్తే దాదాపు 85శాతం కొత్త కేసుల్లో తగ్గుదల కనబడిందన్నారు. కొత్త వ్యాక్సినేషన్‌ విధానం ఈ నెల 21 నుంచి అమలవుతుందని చెప్పారు. దేశంలో రికవరీ రేటు 96శాతానికి పైగా ఉంది. 


*  కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి. రాజస్థాన్‌లోని రాజసమాంద్‌ ప్రాంతంలో వేదాంత గ్రూపులో భాగమైన హిందూస్థాన్‌ జింక్‌ ఆధ్వర్యంలో 100 పడకల అత్యాధునిక కొవిడ్‌ కేర్‌ ఫీల్డ్‌ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. మైన్స్‌, చమురు, సహజవాయువుల ఉత్పత్తి సంస్థగా ప్రఖ్యాతిగాంచిన వేదాంత గ్రూపు.. అనిల్‌ అగర్వాల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 8వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జర్మనీ సాంకేతికతతో కూడిన అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసింది. దీంట్లో 20 ఐసీయూ పడకలు కూడా ఉన్నట్టు తెలిపింది. కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కోవడంలో ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. కరోనా వైరస్‌ లక్షల మందిపై ప్రభావం చూపుతోందని, ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి తాము అండగా నిలవాలనే ఉద్దేశంతోనే ఈ ఆస్పత్రి ఏర్పాటు చేసినట్టు తెలిపింది.


* ‘కొవాగ్జిన్‌’ తయారుచేసిన భారత్‌ బయోటెక్‌ సంస్థకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి శుభవార్త అందింది. కొవాగ్జిన్‌ టీకా అత్యవసర వినియోగ లిస్టింగ్‌ యూయూఎల్‌ అనుమతికి పత్రాలు సమర్పణకు అంగీకరించింది. ఈ నెల 23న టీకా డేటా వివరాలు అందజేసేందుకు ఓ సమావేశం ఏర్పాటు చేసింది. ఇది కొవాగ్జిన్‌ టీకాపై పూర్తిస్థాయి సమీక్షా సమావేశం కాదని, వ్యాక్సిన్‌ మొత్తం డేటా సమర్పించేందుకు ఉద్దేశించిన భేటీగా డబ్ల్యూహెచ్‌వో వర్గాలు తెలిపాయి. కొవాగ్జిన్‌ అత్యవసర వినియోగ లిస్టింగ్‌ ఈయూఎల్‌కు డబ్ల్యూహెచ్‌వో నుంచి జులై లేదా సెప్టెంబర్‌లో అనుమతి లభించవచ్చని భారత్‌ బయోటెక్‌ గత నెలలో ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే. 

*  హైదరాబాద్‌ ఆస్పత్రులకు దీటుగా మహబూబ్‌నగర్‌ ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య సేవలందించనున్నట్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేసిన 200 పడకల ఆక్సిజన్‌ వార్డును ఆయన ప్రారంభించారు. కొత్త ఆస్పత్రితో పాటు మరిన్ని సదుపాయాలు సమకూర్చుకొనేందుకు ప్రతిపాదనలు తయారు చేసినట్టు తెలిపారు. తమిళనాడు, కేరళ తరహాలో ఆస్పత్రుల ఏర్పాటుకు కృషిచేస్తున్నట్టు చెప్పారు. 


* ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా దేశంలోని ప్రతిఒక్కరికీ టీకా అందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారనీ.. ఉద్దేశపూర్వకంగా ప్రజల్ని భయపెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్‌లోని దుర్గాభాయి దేశ్‌ముఖ్‌ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. కరోనాను కట్టడిచేయాలంటే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలన్నారు. 15 రోజుల్లోనే దేశంలో ఆక్సిజన్‌ కొరతను పరిష్కరించామన్నారు. తెలంగాణలో 46 ఆస్పత్రులకు కేంద్రం 1400 వెంటిలేటర్లు ఇచ్చినట్టు ఆయన వెల్లడించారు.

*  ప్రాణాంతక కరోనాతో పాటు ఇతర ప్రమాదకర వైరస్‌ రకాలను సమర్థంగా నిరోధించే మాత్రల (పిల్స్‌) తయారీకి అమెరికా సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.23,745కోట్లు కేటాయించనున్నట్టు ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. ప్రమాదకర వైరస్‌ లక్షణాలు కనిపించిన వెంటనే వినియోగించుకొనేలా ఈ మాత్రలు ఉపయోగపడతాయన్నారు. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తాయని తెలిపారు.


Dt.17/6/2021


 ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తోన్న కరోనా వైరస్‌పై పోరాటంలో పలు సంస్థలు ప్రభుత్వాలకు సహకారం అందిస్తున్నాయి. తాజాగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. ఏపీలో వ్యాక్సిన్ల కొరత తీరేలా మరో 9లక్షల డోసులు చేరుకున్నాయి. జులైలో పిల్లలపై నోవావాక్స్‌ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభిచేందుకు సీరమ్‌ సంస్థ సిద్ధమవుతోంది. కరోనా కష్టకాలంలో ఊరటనిచ్చే ఇలాంటి కొన్ని వార్తలు మీకోసం..* కరోనా కష్టకాలంలో టెక్‌ దిగ్గజం గూగుల్‌ భారత్‌కు భారీ సాయం ప్రకటించింది. దేశంలో 80 ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, పలు సంస్థల భాగస్వామ్యంతో ఆరోగ్య కార్యకర్తలకు నైపుణ్య శిక్షణ కోసం రూ.113 కోట్లు సాయం అందిచనున్నట్టు ప్రకటించింది. గివ్‌ ఇండియా సంస్థకు రూ.90 కోట్లు, పాత్ సంస్థకు రూ.18.5కోట్ల మేర సాయం అందించనుంది. గ్రామీణ ప్రాంతాల్లో 20వేల మందికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు చేపడుతున్న అపోలో మెడ్‌స్కిల్స్‌కు ఆర్థిక సహకారం అందించనున్నట్టు తెలిపింది. 15 రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలకు నైపుణ్య శిక్షణకు ఆర్మాన్‌ సంస్థకు మరో రూ.3.6కోట్లు ఇవ్వనుంది.

* కరోనాను ఎదుర్కోవడంలో మన దేశంలో తయారవుతున్న వ్యాక్సిన్లు మెరుగైన పనితీరు కనబరుస్తుండగా.. తాజాగా హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌ ఇ తయారుచేస్తున్న కార్బివాక్స్‌ వ్యాక్సిన్‌ దాదాపు 90శాతానికి పైగా ప్రభావశీలత చూపిస్తున్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు.

* కరోనా కష్ట సమయంలో వాహనదారులకు కేంద్రం ఊరట కల్పించే కబురు చెప్పింది. మోటార్‌ వాహనాలకు సంబంధించిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ (డీఎల్‌), రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ (ఆర్సీ), ఇతర పర్మిట్లకు సంబంధించిన పత్రాల గడువును ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు పొడిగించింది. 2020 ఫిబ్రవరి 1తో గడువు ముగిసిన పత్రాలను ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు చెల్లుబాటు అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొవిడ్‌ వేళ వాహనదారులు ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. 

* మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ జిల్లా మేఘవాన్‌ పరియత్‌ గ్రామం వ్యాక్సినేషన్‌లో ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ అర్హులైన వారంతా తొలి డోసు అందుకున్నట్టు అధికారులు ప్రకటించారు. ఆ గ్రామంలో మొత్తంగా 1002 మంది ఓటర్లుఉండగా.. 956మందికి తొలి డోసు వేశారు. మిగిలిన వారు ఇటీవలే వైరస్‌ నుంచి కోలుకున్నవారు, గర్భిణులు ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. వీరంతా వైద్యుల సూచనల మేరకు టీకా వేయించుకోలేదు. దీంతో మధ్యప్రదేశ్‌లో 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకున్న తొలి గ్రామంగా రికార్డు సృష్టించింది. దీంతో ఆ గ్రామానికి ప్రోత్సాహకంగా స్థానిక ఎమ్మెల్యే రూ.5లక్షలు సాయం అందించారు. ఇప్పటికే కశ్మీర్‌లోని వయాన్‌ గ్రామం దేశంలోనే 100శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసుకున్న మొదటి గ్రామంగా నిలిచిన విషయం తెలిసిందే. 

* ఏపీకి కొత్తగా మరో 9లక్షల వ్యాక్సిన్‌ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ గన్నవరం విమానాశ్రయానికి చేరుకొంది. దీన్ని వ్యాక్సిన్‌ నిల్వ కేంద్రానికి అధికారులు తరలించారు. అక్కడి నుంచి  వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు కేటాయించనున్నారు. తాజాగా అందిన  కొవిడ్‌ టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న వ్యాక్సిన్‌ కొరతకు కొంత ఉపశమనం కలిగినట్లైంది.

* నోవావాక్స్‌ టీకాను పిల్లలపై ప్రయోగించేందుకు పుణెలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సిద్ధమవుతోంది.  అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌.. జులైలో చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తమ టీకా మూడో దశ ఫలితాల్లో కొవిడ్‌ను ఎదుర్కోవడంలో 90శాతం ప్రభావశీలంగా పనిచేస్తుందని ఇటీవల నోవావాక్స్‌ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌ నాటికి ఈ వ్యాక్సిన్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు సీరమ్‌ ప్రయత్నిస్తోంది.

* దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 19లక్షలకు పైగా టెస్ట్‌లు చేయగా.. 67వేల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రికవరీలు పెరగడం, మరణాలు తగ్గుముఖం పట్టడం ఉపశమనం కలిగిస్తోంది. అలాగే, నిన్న ఒక్కరోజే 34.6లక్షల డోసులకు పైగా టీకా పంపిణీ జరిగింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 8.26లక్షలకు తగ్గింది. రికవరీ రేటు 95.93శాతానికి పెరిగింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48శాతంగా ఉంది.

* వయోధికులు, దివ్యాంగులకు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ను మరింత సరళతరం చేస్తూ ఇళ్లకు సమీపంలోనే టీకా కేంద్రాల ఏర్పాటుకు కేంద్రం అనుమతించింది. వారికి వీలైనంత వేగంగా టీకాలు వేసేందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు సామాజిక న్యాయం, సాధికారిత శాఖ సహాయమంత్రి రతన్‌లాల్‌ కటారియా నిన్న తెలిపారు. దీంతో ఎక్కువ మంది వయోధికులు, దివ్యాంగులుకొవిడ్‌ నుంచి రక్షణ పొందతారని తెలిపారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top