PF tax rule: ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చిన పీఎఫ్ కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిందే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్లో ప్రావిడెంట్ ఫండ్(పీఎఫ్)కు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలను వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందువల్ల, ఉద్యోగులు, వ్యాపారులు ఈ నిబంధనల గురించి అవగాహన ఏర్పర్చుకుంటే ఆదాయపు పన్ను చెల్లింపుల సమయంలో ఇబ్బందులు పడకుండా జాగ్రత్త పడవచ్చు. కేంద్ర మంత్రి ప్రతిపాదనల ప్రకారం, ఇకపై ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో రూ.2.5 లక్షలకు పైగా జమ అయ్యే నగదుపై లభించే వడ్డీ మొత్తంపై పన్ను వర్తించనున్నట్లు చెప్పారు. అయితే, రూ.2.5 లక్షలలోపు డిపాజిట్లపై వచ్చే వడ్డీకి మాత్రం ఎటువంటి పన్ను కట్టాల్సిన పనిలేదని చెప్పారు. సాధారణంగా, ప్రతి ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో ఉద్యోగి మూల వేతనం నుంచి 12 శాతం జమ అవుతుంది.
అలాగే, ఇంతే మొత్తాన్ని కంపెనీ కూడా ఉద్యోగి పీఎఫ్ ఖాతాలో జమచేస్తుంది. అయితే, తాజా నిబంధనల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పీఎఫ్ ఖాతాలో ఎక్కువ నగదు జమచేసే ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడనుంది. తక్కువ వేతనాలు ఉన్న ఉద్యోగులపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఏదేమైనా, బడ్జెట్ 2020 ప్రకారం, ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ సిస్టం, సూపర్ న్యూ నేషన్ ఫండ్‌కు సంవత్సరానికి రూ. 7,50,000 కంటే ఎక్కువ మొత్తంలో యజమాని సహకారం కింద పీఎఫ్ ఖాతాలో జమ అయ్యే నగదుపై మాత్రమే ప్రభావం ఉండనుంది.
అధిక వేతనం పొందే వారిపై ప్రభావం..
కాగా, ఈ కొత్త నిబంధనలపై డెలాయిట్ ఇండియా పార్ట్నర్ ఆర్తి రాట్ మాట్లాడుతూ ''అధిక ఆదాయాన్ని పొందుతున్న ఉద్యోగులపై ఈ కొత్త నిబంధనలు ప్రభావం చూపనున్నాయి. ఉద్యోగి వాటా కింద ప్రావిడెంట్ ఫండ్‌కు రూ. 2,50,000లకు మించి జమ అవ్వగా.. వచ్చే వడ్డీ మొత్తంపై పన్ను వర్తించనుంది. ఈ కొత్త నిబంధన 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పీఎఫ్ అనేది ఖచ్చితమైన రాబడినిచ్చే సురక్షితమైన పెట్టుబడి పథకం. దీని కింద ఉద్యోగికి ఎటువంటి రిస్క్ లేకుండా మంచి రాబడి లభిస్తుంది . అత్యవసర సమయాల్లో ఉద్యోగికి ఈ నగదు ఎంతగానో ఉపయోగపడుతుంది.
రిటైర్మెంట్ సమయంలో పెద్ద మొత్తంలో మీ చేతికందుతుంది. తద్వారా, రిటైర్మెంట్ తర్వాత కూడా హాయిగా జీవితాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యంగా, పీఎఫ్ నుండి వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను విధించరు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే, చాలా మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా పీఎఫ్‌లో ఎక్కువ మొత్తాన్ని జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, తాజాగా అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్.. అధిక వేతనం పొందుతున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
ఎందుకంటే, ఇప్పటివరకు పీఎఫ్ నుంచి వచ్చే రాబడిపై ఎటువంటి పన్ను విధించేవారు కాదు. కానీ ఏప్రిల్ 1 నుంచి దీనిపై కూడా పన్ను విధించనున్నారు. పీఎఫ్ శాలరీ (బేసిక్ + డీఏ + అలవెన్సు)ల మొత్తం రూ .20 లక్షలకు మించి ఉంటే.. వారిపై పన్ను ఈ ప్రభావం పడనుంది. అనగా, ఉద్యోగి మొత్తం వేతనంలో ఇది కనీసం 50% అనుకుంటే.. అతని మొత్తం జీతం రూ .40 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటుంది. అటువంటి అధిక వేతనం గల ఉద్యోగులు తమ పీఎఫ్ వడ్డీ ఆదాయంపై టాక్స్ కట్టాల్సి ఉంటుంది.
అందువల్ల పీఎఫ్ పథకం తక్కువ -ఆదాయ వర్గాలకు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఇది అధిక ఆదాయ ఉద్యోగులకు ప్రతికూలంగా మారింది." అని ఆమె పేర్కొన్నారు.
0 comments:
Post a comment