Padmavathi Teacher - మా మంచి టీచరమ్మ!
ఉద్యోగాన్ని మొక్కుబడిలా చేసి మా పనైపోయింది అనుకునే వాళ్లని చూశాం. అలా కాకుండా ఆ పనిపై ప్రేమను పెంచుకునే వాళ్లని చూశారా? అయితే మీరు పద్మావతి టీచర్ గురించి తెలుసుకోవాల్సిందే! బడికొచ్చే పిల్లల కోసం సొంత డబ్బుతో పొదుపు ఖాతాలు తెరిచే ఈ పంతులమ్మ గురించిన ఆసక్తికరమైన విషయాలివి.. ఆ ప్రభుత్వబడిలో కొన్నినెలల క్రితం వరకూ పట్టుమని పదిమంది పిల్లలు కూడా చదువుకొనే వారు కాదు. దాంతో ఆ పాఠశాలని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ పద్మావతి టీచర్ చొరవతో ఇప్పుడక్కడ 50 మంది వరకూ చదువుతున్నారు. కూలీ పనులకు వెళ్లే వారు సైతం తమ బిడ్డల్ని కార్పొరేట్ పాఠశాలలకు పంపిస్తున్న తరుణంలో...
ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ఎన్నో విభిన్నమైన ప్రయోగాలు చేస్తున్నారామె. పద్మావతి ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థుల తల్లిదండ్రులని కలిసి వాళ్లకు నచ్చచెప్పి స్కూలుకి వచ్చేలా చేస్తున్నారు. ఇందుకోసం పోస్టాఫీసులో పొదుపు ఖాతాలు ప్రారంభించారు. రోజుకి రూపాయి చొప్పున.. అంటే ప్రతి నెలా ఒక్కో విద్యార్థి పేరిట రూ.30ని వారి పొదుపు ఖాతాకు తన జీతం నుంచి జమ చేస్తున్నారామె. ఈ ప్రయోగం వల్ల హాజరుశాతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం పరిధిలోని బందలాయి చెరువు ప్రాథమిక పాఠశాలకి పద్మావతి ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. ఏ గవర్నమెంట్ పాఠశాలలో విద్యార్థులు తక్కువ ఉన్నారని తెలిసినా అక్కడ తనదైన శైలిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్కడ చదివేవారికి ఒకటో తరగతిలోనే బ్యాంకు ఖాతాను ప్రారంభించి అందులో సొమ్ము జమ చేస్తున్నారు. అయిదు పూర్తయ్యాక ఆ సొమ్మును తీసి పై క్లాసుకి అవసరమైన పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేసుకునేందుకు అందిస్తారు. రవాణా సదుపాయం లేని పిల్లలకు ఆటోలో బడికి వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. బడివేళలకు ముందూ, తర్వాత ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఐదుగురు నిరుద్యోగ మహిళల్ని నియమించారు. వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2000 వరకు సొంత డబ్బుల్ని జీతంగా చెల్లిస్తున్నారు. ఇలా విద్యార్థుల కోసమే ప్రతి నెలా తన జీతం నుంచి రూ.12,000 వరకు ఖర్చు చేస్తున్నారు. మరోపక్క పేద వృద్ధులకు సాయం చేస్తూ... నిరుపేద గృహిణులకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించారు. 'పిల్లలకు చదువు చెప్పమని ప్రభుత్వం జీతం ఇస్తోంది. బడిలో వారే లేకపోతే చదువు ఎవరికి చెప్పాలి. అలాంటి రోజు రాకూడదనే నా ప్రయత్నం. నా దగ్గర చదువుకున్న వారిలో చాలామంది వేర్వేరు ఉన్నత వృత్తుల్లో స్థిరపడ్డారు. వారిలో ఒకరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్నారు. ఇంతకంటే నాకు సంతృప్తి ఏముంటుంది' అంటారు పద్మావతి.
- ముత్తా నారాయణరావు, అమరావతి
0 comments:
Post a comment