సెకండ్‌వేవ్‌లో కొత్త లక్షణాలు
ఆకలి మందగించడం, కీళ్ల నొప్పులు,నీరసం, జీర్ణాశయ సమస్యలు
ఇవి కనిపిస్తే వెంటనే టెస్ట్‌లకు వెళ్లాలి
ఎక్కువమందిలో కనిపించని లక్షణాలు
అందుకే కరోనా వ్యాప్తిలోనూ వేగం
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): సెకండ్‌వేవ్‌లో కరోనా వేగంగా వ్యాపించటానికి వైరస్‌లో ఏర్పడిన ఉత్పరివర్తనాలే కారణమని వైద్య నిపుణులు అంటున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో బ్రెజిల్, యూకే స్ట్రెయిన్లు అధికంగా కనిపిస్తున్నట్టు చెప్తున్నారు. ఇవి శక్తిమంతంగా ఉండటంవల్లే వేగంగా వ్యాపిస్తున్నాయని, రోగుల్లో వ్యాధి లక్షణాలు కూడా భిన్నంగా ఉన్నాయని అంటున్నారు.
గతంలో జలుబు, దగ్గు, జ్వరం, ఒంటి నొప్పులు, శ్వాస సమస్య వంటి లక్షణాలు అధికంగా ఉండేవి. ప్రస్తుతం జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం, నీరసం, కీళ్ళనొప్పులు వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. ఎవరికైనా ఈ లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. 80% రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని, దీనివల్లనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నదని చెప్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే వైరస్ శరీరంలోని గుండె, కాలేయం, మూత్రపిండాలు, కండ్లకు నష్టం కలిగిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో కూడా కొందరు రోగుల్లో ఈ అవయవాలు కరోనావల్ల దెబ్బతిన్నట్టు గుర్తించారు. కొందరికి కంటిచూపు మందగించినట్టు వైద్యులు తెలిపారు.
ఇవీ కొత్త లక్షణాలు
పొత్తికడుపులో నొప్పి,వికారం, వాంతులు
జీర్ణాశయ సమస్యలు, ఆకలి మందగించడం
నీరసం, కీళ్ల నొప్పులు
0 comments:
Post a comment