ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి
రేపల్లె : ఎన్నికల విధులకు వెళ్లిన పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు మృత్యువాత పడ్డాడు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) కార్యక్రమాలతోపాటు సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గనే కోటేశ్వరరావు (41) స్థానిక 15వ వార్డులో నివాసం ఉంటున్నారు. నగరం మండలం ముత్తుపల్లి హైస్కూల్లో ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా పని చేస్తున్నారు. పరిషత్ ఎన్నికల విధులు నిమిత్తం బుధవారం రాత్రి పిట్టలవానిపాలెం మండలం అల్లూరు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. గురువారం తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి విధులకు సిద్ధమయ్యే క్రమంలో గుండె నొప్పి రావడంతో మాత్రలు వేసుకున్నారు. అయినా కొద్దిసేపటికే కుప్పకూలిపోవడంతో వెంటనే బాపట్ల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతునికి భార్య, కుమార్తె ఉండగా, భార్య గర్భిణి అని తెలిసింది. కుటుంబీకులను రేపల్లె, నగరం, నిజాంపట్నం మండలాల ఎన్నికల ప్రత్యేకాధికారి, పులిచింతల ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సి.కొండయ్య, రేపల్లె తహశీల్దార్ విజయశ్రీ, ఉపాధ్యాయులు, యుటిఎఫ్, ఇతర సంఘాల నాయకులు పరామర్శించి సంతాపం తెలిపారు.
0 comments:
Post a comment