Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Monday, 26 April 2021

చదువుకు కరోనా కాటు - వార్త సండే మేగజైన్ నందు కవర్ స్టోరీ గా కరోనాతో దెబ్బతిన్న విద్యా వ్యవస్థ గురించి వాసిలి సురేష్ ఉపాధ్యాయులు నెల్లూరు వారు రాసిన ఆర్టికల్

 తేది: 25/4/2021 వార్త సండే మేగజైన్ నందు కవర్ స్టోరీ గా కరోనాతో దెబ్బతిన్న విద్యా వ్యవస్థ గురించి నేను రాసిన ఆర్టికల్ "చదువుకు కరోనా కాటు" ప్రచురితం అయ్యింది.

- వాసిలి సురేష్..

***

చదువుకు కరోనా కాటు

***కొవిడ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమంది విద్యార్థుల్లో తొమ్మిదిమంది విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతిన్నదని ఇటీవల యునెస్కో ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే కొవిడ్ విద్యా వ్యవస్థ మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిందన్న విషయం అర్థమవుతోంది.  కొవిడ్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక  విద్యాసంస్థలు మూతపడ్డాయి. అంతర్జాతీయంగా 154 కోట్లమంది చదువు అర్ధాంతరంగా సగంలోనే ఆగిపోయాయి. భారతదేశంలో కొవిడ్ కారణంగా విద్యాసంస్థలు మూతబడి చదువును కోల్పోయిన విద్యార్థుల సంఖ్య 32 కోట్లకుపైనే ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే కరోనా  వైరస్‌వల్ల అర్ధాంతరంగా చదువు నిలిపేయవలసి వచ్చిన విద్యార్థుల్లో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉంది. విద్యార్థులు చదువులు అర్ధాంతరంగా మానివేయడం వల్ల మున్ముందు ఆర్థిక, సామాజిక విపరిణామాలెన్నో కలగనున్నాయి. ఈ కాలంలో ఆన్‌లైన్‌ లేదా రిమోట్‌ విద్య కొంతమేరకు ఉపశమనంగా నిలుస్తోంది. దీన్ని ఈ-లెర్నింగ్‌గానూ వ్యవహరిస్తున్నారు. పాఠశాల మొదలుకొని విశ్వవిద్యాలయం వరకు అన్ని సంస్థలూ ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాయి. ఏఐసీటీఈ, సీబీఎస్‌ఇ, యూజీసీలు అందుకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో కొంత మేర విజయవంతంగానే ఆన్లైన్ విద్యను నడిపారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆన్లైన్ విద్యనే జరపాలని సూచించడంతో దానికి సంబంధించిన  మార్గదర్శకాలు ఇచ్చి విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్నాయి. అయితే కొత్త ఆన్‌లైన్‌ విద్యావిధానంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పౌరులు సరిగ్గా ఇమడగలరా అనే సందేహం బలంగానే వ్యక్తమవుతోంది. ఈ లాక్డౌన్ కారణంగా స్కూళ్లు కాలేజీలు మూతబడటంతో విద్యావ్యవస్థకు సాంకేతికత ఉపయోగించుకొని ఆన్లైన్ విధానం అమలు చేయడమే గత్యంతరం అయింది. ఈ తరుణంలో  ప్రస్తుతం విద్యా వ్యవస్థలో రాణించాలంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆన్లైన్ విధానం ద్వారా నేర్చుకోవడంలో పేద విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే విద్యార్థులు వెనుకబడుతున్నారు. వీరి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను చేపట్టాల్సి ఉంది. ఏపి, తెలంగాణ రాష్ట్రాలలో దూరదర్శన్ ద్వారా వీడియో లెసన్స్ అందిస్తున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ఉపయోగ పడటం లేదు. కానీ ప్రైవేటు, కార్పొరేటు స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆన్లైన్లో తరగతులు, పరీక్షలు అన్నీ నిర్వహిస్తున్నారు. 

పరీక్షలు వాయిదా:

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం కీలకమైన కొన్ని పరీక్షలను వాయిదా వేసింది. ఇలా పలు రాష్ట్రాల్లో 10, 12వ తరగతుల పరీక్షలు వాయిదా పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. మహారాష్ట్రలో 10వ తరగతి పరీక్షలను జూన్‌కు, 12వ తరగతి ఎగ్జామ్స్‌ను మే నెలకు వాయిదా వేశారు. అదే విధంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ కూడా పది, పన్నెండో తరగతి పరీక్షలను ఒక నెల రోజులు వెనక్కు నెట్టాయి. అంటే ఒక నెల రోజులు వాయిదా వేశాయన్నమాట. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి. కరోనా గనుక అదుపులోకి రాకుంటే దేశం మొత్తం పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సి.బి.ఎస్.ఈ పదవ తరగతి పరీక్షలు రద్దు చేయగా 12 వ తరగతి పరీక్షలు వాయిదా వేశారు. 

ప్రైవేటు రంగంలో ఉపాధి కోల్పోయిన  ఉపాధ్యాయులు:

ప్రైవేటు స్కూళ్లు మూతపడటంతో ప్రైవేట్ రంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఉపాధ్యాయులు రోజువారీ కూలీలు మారవలసి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ళలో పనిచేసే ఉపాధ్యాయులకు నెలకు రెండు వేల రూపాయల నగదు, 25 కేజీల బియ్యం ప్రభుత్వ సాయం ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నది. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం 32 కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం. ఇదే విధంగా దేశ వ్యాప్తంగా నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రైవేట్ స్కూల్లో పనిచేసే  ఉపాధ్యాయులకు సాయం అందించాల్సిన అవసరం ఏర్పడింది.

ప్రాథమిక అంశాలపై పట్టు కోల్పోతున్న బాలలు:

భారతదేశంలో కోవిడ్-19 కారణంగా దాదాపు సంవత్సరం రోజులుగా పాఠశాలలు మూసి ఉన్నాయి. ఈ పాఠశాలల్లో  సుమారు 26 కోట్ల మంది విద్యార్థులు పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్రాల్లో స్కూళ్లు పూర్తిగా తెరిచి అన్ని తరగతులకు బోధన నిర్వహిస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో కేవలం  పెద్ద తరగతుల విద్యార్థులకు మాత్రమే బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే ఏడాదిగా స్కూళ్లు మూసి ఉన్నప్పటికి, ఈ మూసి ఉన్న కాలంలో కొన్ని విద్యాసంస్థలు ఆన్లైన్ ద్వారా విద్యాబోధన నిర్వహించడం జరిగింది. మళ్లీ కరోనా సెకండ్ వేవ్ రావడంతో దేశంలోని చాలా రాష్ట్రాల్లో స్కూళ్లు కాలేజీలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆగిన చదువులు ఆన్లైన్ విద్య ద్వారా కొంత మేరకు గాడిలో పడేందుకు వీలవుతుంది. అయితే ఈ ఆన్లైన్ పాఠాల వల్ల ప్రాధమికంగా కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి. చాలా మంది విద్యార్థులకు ఆన్ లైన్ పాఠాలు వినేంత ఆర్థిక, మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అధిక శాతం మంది ఆన్లైన్ విద్యకు దూరమయ్యారు. నిజానికి సహజంగా స్కూల్లో టీచర్ ఎదురుగా ఫేస్ టు ఫేస్ చెప్పే పాఠాల వల్ల కలిగే ప్రయోజనాలు  ఆన్ లైన్ క్లాసులతో కలుగలేదు. అంతేగాక ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆన్లైన్ విద్యా విధానం కొత్త కావడంతో అంత ప్రభావంతంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించలేక పోయారు.   కానీ, కరోనా కారణంగా ఈ సమయంలో ఆన్లైన్ తరగతులు వినే వారి సంఖ్య భారీగా పెరిగిందని చెప్పవచ్చు. అయితే పాఠశాల స్థాయిలో ఎక్కువ విద్యా సంస్థలు ఆన్లైన్ తరగతులు కూడా నవంబర్, డిసెంబర్ నెలల  మధ్య నుంచి ప్రారంభించారు. అందువల్ల అప్పటికే సగం విద్యాసంవత్సరం గడిచిపోయిందువల్ల  2020-21విద్యా  సంవత్సరంలో విద్యార్థులు నేర్చుకోవాల్సినంత నేర్చుకోలేకపోయారు. కోవిడ్ 19 మహమ్మారి సమయంలో పాఠశాలలను దీర్ఘకాలం మూసివేయడం, దాదాపు మొత్తం సంవత్సరం, పిల్లల అభ్యాస స్థాయిలపై గణనీయమైన ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ అభ్యాస నష్టం పాఠశాలలు తెరిచి ఉంటే పిల్లలు సంపాదించే సాధారణ పాఠ్యాంశ అభ్యాసాన్ని కోల్పోయారు, అదేవిధంగా మునుపటి తరగతిలో నేర్చుకున్న విద్యార్థులు  సామర్ధ్యాలు కూడా మరచిపోయారు. అంతేగాక 2020లో స్కూళ్లు మూసేటప్పటికి  వారికి తెలిసిన విషయాలు, వారు నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం చాలా వరకు  మర్చిపోయారు. ప్రాథమిక తరగతులలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలలో 'మర్చిపోవటం లేదా తిరోగమనం' రకమైన అభ్యాస నష్టం గురించి తెల్సుకోవడానికి జనవరి 2021 నందు అజీమ్ ప్రేంజి పౌండేషన్ విస్తృతమైన క్షేత్ర స్థాయి అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం భారత దేశంలోని ఛత్తీస్ ఘడ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో, 44 జిల్లాలకు చెందిన 1137 స్కూళ్ళలో 16067 విద్యార్థులతో వీరిలో 8768 బాలికలు కాగా 7299 మంది బాలురు వీరికి సంబంధించి అభ్యసనంలో జరిగిన నష్టం గురించి అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో రెండు వేల మంది ఉపాధ్యాయుల సహకారం కూడా తీసుకున్నారు. అజీమ్ ప్రేంజి పౌండేషన్ బృందం 400 మంది పాల్గొనగా ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవి ఏమిటంటే కోవిడ్ 19 కారణంగా స్కూళ్లకు  సెలవులు ప్రకటించక మునుపు  2020 మార్చిలో వారికి వచ్చిన వాటిల్లో 82 శాతం మంది గణితంలో ప్రాధమికమైన అంశాలు  కూడా మర్చిపోయారు. అదేవిధంగా 92 శాతం మంది భాషలో ప్రాధమిక అంశాలు మర్చిపోయారు. ఆ తర్వాత క్లాసుల్లో నేర్చుకోవడానికి పునాదిగా ఉండే అంశాలను కూడా వారి మెదడు నుంచి చెరిగిపోయినట్లు వెల్లడించారు. చాలా మంది విద్యార్థులు కూడికలు, తీసివేతలు కూడా మర్చిపోయారని, ఒక పేరాగ్రాఫ్ చదవడం చాలా మందికి ఇప్పుడు వీలుకావడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. కోవిడ్ 19 తగ్గుముఖం పడిన అనంతరం పిల్లల్లో సరైన అభ్యసన సామర్ధ్యాలు సాధించాలంటే మొదటగా వాళ్లు ఏం నేర్చుకోవాలో దాన్ని నేర్పించగలగాలి, ఆ తర్వాత అంతకు ముందు తరగతుల్లో వారు మర్చిపోయిన అంశాలను పునశ్చరణ చేయగలగాలి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇటువంటి పరిస్థితులే ఎదురవుతున్న నేపథ్యంలో   దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దీనికి  అవసరమైన కొత్త విధానాన్ని రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది. సరైన ప్రణాళిక, సరైన బోధనా పద్ధతులను ఎంచుకొని బోధించడానికి ఉపాధ్యాయులకు  సరిపడినంత సమయం ఇవ్వగలగాలి. విద్యార్థులు తాము కోల్పోయిన దాన్ని మళ్లీ వారు నేర్చుకోగలిగేలా చేయాలి. విద్యార్థులు భాషలో, గణితంలో ప్రాధమిక అంశాలు పై పట్టు సాధించేందుకు వీలయ్యే బ్రిడ్జి కోర్సులను స్కూళ్ళలో అమలు చేయాలి. దీనికోసం రాబోవు  విద్యాసంవత్సరాన్ని ఉపయోగించుకోవాలి. సిలబస్‌ బోధననే ప్రధానమైనదిగా భావించకుండా, అనవసరమైన అంశాలను గుర్తించి సిలబస్ నుంచి  తొలగించాలి. సిలబస్ సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. వీలుకాని పరిస్తితుల్లో ఆ సిలబస్ భాగాన్ని తర్వాత తరగతికి బదిలీ చేయాలి. నేర్చుకునేందుకు వారికి సరిపడినంత సమయం ఇవ్వాలి. ఇటువంటి చర్యలు తీసుకోకపోతే  విద్యార్థులు కోల్పోయిన అభ్యాస నష్టాన్ని భర్తీ చేయడం సులభం కాదు. ఉపాధ్యాయులు  విద్యార్థులకు సరిపడినంత సహాయసహకారాలు అందించాలి. ఉపాధ్యాయులకు అవసరమైన వృత్తి పరమైన శిక్షణా కార్యక్రమాలు, అవసరమైన వసతులు కల్పించాలి.  ప్రతి విద్యార్థి ప్రాథమిక అంశాలలో పట్టు సాధించేలా, మెరుగైన ప్రగతి సాధించేలా  ఉపాధ్యాయులు కృషి  చేయాలి. 26 కోట్ల మంది విద్యార్థులు ఈ ఏడాదిలో కోల్పోయిన దానిపై దృష్టిపెట్టకపోతే ఆ లోటు అలాగే ఉండిపోతుంది. ఆ తర్వాత అది విద్యార్థుల మీద ప్రభావం చూపుతుంది. సమాజంలో వారికి ఆ తర్వాత కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి దీనిమీద ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా శాఖలు దృష్టి కేంద్రీకరించాలి. సరైన ప్రణాళికలు సిద్ధం చేసి విద్యార్థులు కోల్పోయిన అభ్యాస నష్టాన్ని తిరిగి భర్తీ చేయాలి, విద్యార్థులు ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేందుకు వీలయ్యే విధానాన్ని రూపొందించి అమలు చేయాలి.

స్కూళ్లలో తగ్గిన పిల్లల నమోదు: 

కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు మూసివేసిన నేపథ్యంలో విద్యార్థుల చదువులు కష్టంగా మారింది. దేశంలో విద్యా వ్యవస్థను మెరుగుపరిచే లక్ష్యంతో నిర్వహించే యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్(ఎఎస్ఈఆర్) సర్వే కరోనా నేపథ్యంలో భారతదేశంలో పాఠశాల స్థాయి విద్యాస్థితిని తన  తాజా అధ్యయనం ద్వారా తెలిపింది.  ఎఎస్ఈఆర్ ఈ రిపోర్టు కోసం మొట్టమొదటిసారిగా ఫోన్ ఆధారంగా సర్వే చేయడం జరిగింది. వార్షిక స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (ఎఎస్ఈఆర్) ప్రకారం, 2018లో 6-10 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో స్కూళ్లలో నమోదు కాని పిల్లలు 1.8 శాతంగా ఉందని ఈ సర్వేలో వెల్లడైంది. 6-10 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో పాఠశాలల్లో నమోదు కాని విద్యార్థుల నిష్పత్తి 2018తో పోలిస్తే 2020లో గణనీయంగా పెరిగింది. దీనికి ప్రధానంగా కోవిడ్-19 మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేయడమే, చాలా మంది చిన్న పిల్లలు ఇంకా ఒకటవ తరగతిలో ప్రవేశం పొందలేదని ఈ సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు చేసుకున్న బాలుర నిష్పత్తి 2018లో 62.8 శాతం నుంచి 2020 నాటికి 66.4 శాతానికి పెరిగింది. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన బాలికల నిష్పత్తి ఇదే కాలంలో 70 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. సర్వేకు ముందు వారంలో కేవలం మూడో వంతు మంది పిల్లలు తమ టీచర్ల నుంచి మెటీరియల్ స్వంతంగా అందుకున్నప్పటికీ, చాలామంది పిల్లలు, అంటే 70.2 శాతం మంది, ఆ వారంలో ఏదో ఒక విధమైన అభ్యసన కార్యకలాపాలు  చేస్తున్నారు. ఈ కార్యకలాపాలను ప్రైవేట్ ట్యూటర్లు మరియు కుటుంబ సభ్యులు స్వయంగా, స్కూళ్ల నుంచి అందుకున్న వాటికి అదనంగా పంచుకున్నట్లుగా సర్వేలో తేలింది. ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలల్లో ఈ కార్యకలాపాలు చేస్తున్న పిల్లల నిష్పత్తి కూడా సమానంగా ఉంది. అయితే, ప్రైవేటు పాఠశాలల్లోని పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న వారి కంటే ఆన్లైన్ వనరులను  ఎక్కువగా పొందుతున్నారని  సర్వే తేల్చింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఈ సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా పాఠశాలలను మూసివేసిన ఆరు నెలలకు విద్యార్థులపై ఈ అధ్యయనం చేశారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం పాఠశాలలు ప్రవేశపెట్టిన ఆన్లైన్, వీడియో తరగతుల వల్ల ఎంత మేరకు ఉపయోగం ఉందో తెలుసుకునేందుకు ఈ అధ్యయనం నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లోనూ సర్వే మొత్తం 26 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేశారు. ఇది మొత్తం 52,227 గృహాలు మరియు 5 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల 59,251 మంది పిల్లలు, అలాగే ప్రాథమిక విద్యను అందించే 8,963 ప్రభుత్వ పాఠశాలల నుండి ఉపాధ్యాయులు లేదా ప్రధానోపాధ్యాయుల నుంచి సమాచారం సేకరించింది. విద్యార్థులు పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్‌ను సేకరించడానికి వాట్సాప్ ఎంతగానో ఉపయోగపడిందని సర్వే ద్వారా తెలుస్తోంది. పాఠశాలల్లో నమోదు చేసుకున్న పిల్లల్లో మూడింట ఒక వంతు మంది మాత్రమే ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు ఉపాధ్యాయుల నుంచి కొన్ని రకాల పాఠ్యపుస్తకాలు, స్టడీ మెటీరియల్ వంటివి పొందారని సర్వేలో వెల్లడైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులందరికీ మెటీరియల్ పంపడానికి వాట్సాప్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని నివేదిక పేర్కొంది. పాఠ్య పుస్తకాలు, వర్క్‌షీట్లు, వీడియోలు, రికార్డెడ్ లెక్చర్స్ వంటి వాటిని పిల్లలు పాఠశాలల నుంచి ఫోన్ ద్వారా లేదా వ్యక్తుల ద్వారా సేకరించారా లేదా అనే అంశంపై ఎఎస్ఈఆర్ దృష్టి సారించింది. 2020 సెప్టెంబరులో సర్వే చేయడానికి ముందు ఒక వారానికి సంబంధించిన వివరాలను సేకరించి సర్వే చేశారు. స్కూళ్లలో నమోదు చేసుకున్న పిల్లల్లో మూడింట ఒకవంతు మంది మాత్రమే  ఉపాధ్యాయుల నుంచి కొన్ని రకాల లెర్నింగ్ మెటీరియల్, యాక్టివిటీలను పొందారు. చిన్న తరగతుల కంటే పెద్ద తరగతుల్లో, అది కూడా ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో ఈ శాతం ఎక్కువ అని ఎఎస్ఈఆర్ తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల అనే తేడాలు లేకుండా స్టడీ మెటీరియల్‌ను చేరవేయడానికి వాట్సాప్స్‌ను ఎక్కువగా వాడుతున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో 87.2 శాతం, ప్రభుత్వ పాఠశాలల్లో 67.3 శాతం మంది ఇందుకు వాట్సాప్‌ను వాడుతున్నారని నివేదిక పేర్కొంది. పిల్లలందరిలో పావు వంతు కంటే తక్కువ మందికి మాత్రమే స్టడీ మెటీరియల్ అందిన రాష్ట్రాలను సర్వేలో గుర్తించారు. ఈ జాబితాలో రాజస్థాన్ (21.5%), ఉత్తర ప్రదేశ్ (21%), బీహార్ ఉన్నాయి. విద్యార్థుల కుటుంబాల్లో పెద్దగా చదువుకోని వారు, స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వంటి సదుపాయాలు లేని వారు పాఠాలు నేర్చుకోవడంలో వెనుకబడ్డారని సర్వే తెలిపింది. ప్రభుత్వ పాఠశాలల్లో 31.8 శాతం మంది విద్యార్థులు ఉపాధ్యాయులను కలిసి నేరుగా పాఠ్య పుస్తకాలు, స్టడీ మెటీరియల్ తీసుకున్నారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల్లో 11.5 శాతం మంది ఉపాధ్యాయుల నుంచి వాటిని సేకరించారు.

 మెజారిటీ పాఠశాలలు వారికి ఎలాంటి పాఠ్య పుస్తకాలు, అభ్యాసాలు పంపట్లేదని విద్యార్థులు చెప్పారు. వీరిలో 68.1 శాతం మంది పాఠశాలు స్టడీ మెటీరియల్ పంపట్లేదని, 11.0 శాతం మంది ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడం వల్ల పాఠ్యాంశాలను యాక్సెస్ చేయలేకపోతున్నామని, సుమారు 24.3% మంది స్మార్ట్‌ఫోన్లు లేకపోవడం వల్ల మెటీరియల్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నామని చెప్పారు. మరో ఐదు శాతం మంది కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొన్నారు. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్‌ను అందించేందుకు వివిధ పద్ధతులను ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం డిజిటల్ కంటెంట్, డెలివరీని మెరుగుపరచడానికి ఏమేం అవసరం అనే వాటిపై అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఎఎస్ఈఆర్ ప్రకటించింది.

కోవిడ్ మహమ్మారి వల్ల పెరుగుతున్న బాలకార్మిక వ్యవస్థ: 

చదువుకోవాల్సిన వయసులోనే బాలలు  కార్మికులుగా మారుతున్నారు. పరిశ్రమల్లో పనికి చేరి బాల కార్మికులుగా మారుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికుల సంఖ్య చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కానీ కోవిడ్ మహమ్మారి, మరియు లాక్‌డౌన్ కారణంగా బాల కార్మికుల సంఖ్య   పెరిగిపోతోందని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో), ఐక్యరాజ్య సమితి చిల్డ్రన్స్ ఫండ్ ఇటీవలి కాలంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. కోవిడ్ కారణంగా ఈ ఒక్క ఏడాదే ప్రపంచవ్యాప్తంగా 6 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి పడిపోయారని, దీంతో ఆ కుటుంబాలన్నీ తమ పిల్లల్ని బలవంతంగా పనుల్లో పెడుతున్నారని ఈ నివేదికలో వెల్లడయ్యింది. దీని ప్రకారం పేదరికం ఒక్క శాతం పెరిగితే, బాలకార్మికులు 0.7 శాతం పెరుగుతారు.

కరోనా వైరస్ బట్టబయలు కాక ముందే భారత్‌లో 5.6 కోట్ల మంది చిన్నారులు బడికి దూరంగా ఉన్నారు. వారిలో 1.1 కోట్ల మంది వరకు వ్యవసాయ క్షేత్రంలోనూ, ఫ్యాక్టరీల్లోనూ పనిచేస్తున్నారు. ఇక కరోనా వైరస్ సోకిన తర్వాత ఈ సమస్య మరింత పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో మొదటిసారి బడిలోకి చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ఇళ్లల్లోనే ఉంటూనే కుటీర పరిశ్రమల్లో పనచేయడానికి, ఇళ్లల్లో పనికి కుదురుతూ ఉండడంతో కరోనా సంక్షోభ సమయంలో స్కూలు డ్రాపౌవుట్లుగా మారే అవకాశం ఉంది. ప్రతీ అయిదుగురిలో ఒక విద్యార్థి స్కూలు నుంచి డ్రాప్ అవుట్ అయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ కార్మిక సంస్థ అంచనా వేసింది. పూర్తి స్థాయిలో మార్కెట్ పుంజుకొని నిర్మాణ రంగం, రైల్వేలు, ఇతర ఫ్యాక్టరీలు తెరుచుకుంటే భారత్‌లో దాదాపుగా ఇరవై శాతం డ్రాపవుట్లు పెరుగుతాయని ఈ అధ్యయనం ద్వారా వెల్లడయ్యింది.

కరోనా లాక్డౌన్ వల్ల భారతదేశంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి బాలకార్మిక వ్యవస్థను పెంచుతోంది. లాక్డౌన్ అనంతరం ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నంలో చాలా కుటుంబాల్లో  బాలలు పలకా పట్టాల్సిన చేతులతో పనిముట్లు పడుతున్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లోనూ చేరుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని అనేక స్వచ్చంధ సంస్థలు కోరుతున్నాయి. కరోనా నేపథ్యంలో పెరగనున్న బాలకార్మిక వ్యవస్థపై కైలాష్ సత్యార్థి చిల్డ్రన్స్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది.  దేశవ్యాప్తంగా బాల కార్మికవ్యవస్థ, మానవ అక్రమరవాణ, కార్మిక చట్టాల ఉల్లంఘన అంశాలపై యాభై మందికి పెగా ఎన్‌జిఒలు, వందలాది మంది ప్రతిస్పందనను ఆధారంగా చేసుకుని ఈ సర్వే నివేదికను సత్యార్థి ఫౌండేషన్ రూపొందించింది. సర్వేలో 89 శాతం ఎన్జీఓలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. లాక్డౌన్ ఎత్తి వేసిన అనంతరం బాలకార్మిక వ్యవస్థ బలోపేతం కావడంతోపాటు పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది.  లైంగిక దోపిడి కోసం పిల్లల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఈ సంస్థ పేర్కొంది. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేదని,  ఆయా రాష్ట్రాల పరిస్థితులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉందని తెలిపింది. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో బాలల అక్రమ రవాణా పెరిగే అవకాశాలున్నాయి. కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమాదం కూడా ఉంది.

ఈ పరిస్థితి అరికట్టాలంటే  గ్రామస్థాయిలో ఎక్కుగా నిఘావ్యవస్థ పెంచాలి. చట్టాన్ని అమలు చేసే సంస్థలు అప్రమత్తంగా ఉండాలి.  లాక్డౌన్ అనంతరం బాల్యవివాహాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి.  పరిస్థితులను చక్కదిద్ది బాల్యాన్ని పరిశ్రమల్లో బందీ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఉంది.  గ్రామస్థాయిలో నిఘావ్యవస్థ  రూపొందించి చట్టాలను బలోపేతం చేయాల్సి ఉంది.  గ్రామస్థాయిలో గ్రామ పంచాయితీలు పిల్లలను పనుల్లోకి వెళ్లకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తమవంతు కృషి చేస్తూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలి.  వ్యాపార కార్యకలాపాలు, వస్తువుల తయారీ కంపెనీల్లో బాలకార్మికులు పనులు చేయకుండా చూడాల్సిన బాధ్యత స్థానిక అధికారులతో పాటు పౌరులపై కూడా ఉంది.  స్వచ్ఛంద సంస్థల కృషితో రక్షించబడిన పిల్లలను వారి వయోపరిమితుల ఆధారంగా విద్యారంగం వైపు అడుగులు వేయాలి. రక్షించబడిన పిల్లల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం కల్పించాలి. గ్రామాల్లో అక్రమ రవాణా నియంత్రించడానికి పాఠశాలలు, సంఘాలు, స్థానిక పరిపాలన సంస్థలు కలిసి కట్టుగా కృషి చేయాలి.  అవగాహన కార్యక్రమాలను, ప్రచారాలను నిర్వహించి అక్రమరవాణాను అరికట్టాలి.  ప్రధానంగా అక్రమరవాణాకు సంబంధించి ఝార్ఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం తదితర ప్రాంతాలను సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ తన నివేదికలో విశ్లేషించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధానంగా అక్రమ తరలింపు అరికట్టుటలో రైల్వే సహకారం అనివార్యమని  గుర్తించాలి. కాబట్టి రైల్వేల ప్రయాణాల్లో అక్రమ తరలింపులు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా అక్రమంగా బాలల రవాణా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి  బాలకార్మిక వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలి.

ఆన్లైన్ విద్యతో అనర్థాలు: 

కరోనా కారణంగా పాఠశాల, కళాశాల విద్యా విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. విద్యా సంస్థలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంలో సందిగ్ధత నెలకొని ఉంది. భారతదేశంలో రోజురోజుకీ కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎప్పటి నుండి  విద్యాసంస్థలను ప్రారంభించాలో ప్రభుత్వం సూచనలు ఇవ్వలేక పోతున్నది. ఇప్పటికే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు టెలివిజన్, యుట్యూబ్ లాంటివి ఉపయోగించి ఆన్లైన్ క్లాసులు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నాయి. అదేవిధంగా చాలా ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు జూమ్, గూగుల్ మీట్ లాంటి సాంకేతికతను, ఇతర మొబైల్ అప్లికేషన్లను ఉపయోగించి విద్యార్థులకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ క్లాసుల కోసం విద్యార్థులు  రోజుకు సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటలపాటు చిన్నారులు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లకు సమయం కేటాయించవలసి వస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికలు ప్రకారం విద్యార్థులు రెండు గంటలకు మించి ఆన్లైన్ తరగతులు వినటం సాధ్యం కాదని, అంతకు మించిన సమయం వినియోగిస్తే పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలుపుతున్నాయి. ఆన్లైన్ క్లాసుల వల్ల విద్యార్థులకు ఆటలకు దూరమవుతున్నారు. ఇది విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి విఘాతం. ఉపాధ్యాయులు ఇప్పటవరకూ ఫేస్ టు ఫేస్ టీచింగ్ చేయడం, ఆన్లైన్ తరగతులు నిర్వహించడంలో తగిన నైపుణ్యం, శిక్షణ లేకపోవడం వల్ల, ఆన్లైన్ తరగతులు విజయవంతంగా, ప్రభావంతంగా నిర్వహించలేక పోవడంతో విద్యార్థులకు ప్రయోజనాలు కలుగకపోగా అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. వీటివల్ల విద్యార్థుల మానసిక ఆరోగ్యం, వినికిడి, చూపు మొదలగు వాటిపై ప్రతికూల ప్రభావం పడుతున్నది. విద్యార్థులు గంటల తరబడి ఇయర్‌ ఫోన్‌, హెడ్‌ఫోన్లు పెట్టుకుని ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లను చూడడం వల్ల చిన్నారుల్లో దృష్టి, వినికిడి సమస్యలతోపాటు మెడ కండరాల ఇబ్బందులూ ఎదురయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిన్నపాటి సూచనలు పాటిస్తే వాటిని దూరం చేసుకోవచ్చని సూచిస్తున్నారు. చిన్నారుల కంటిలో ఎకామిడేషన్‌ అనే ప్రక్రియకు ఇబ్బంది ఏర్పడుతున్నది. దాంతో తలపోటు, కళ్లు పొడిబారిపోవడం, నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చిన్నారులు దగ్గర్నుంచి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చూడడం వల్ల ఒక్కోసారి దూరంగా చూసినప్పుడు 30 సెకన్లపాటు వారికి ఏమీ కనిపించకపోవచ్చు.  కనురెప్పలు మూసే సంఖ్య తగ్గిపోతుంటుంది. దానివల్ల కార్నియా పొడిబారిపోయి ఆరిపోతుంది. ఇయర్‌ఫోన్లు ఎక్కువగా పెట్టుకోవడం వల్ల నరాలు ఎక్కువసేపు వైబ్రేట్‌ అయ్యి చెవిపోటు, వినికిడి సమస్య రావచ్ఛు. మెడ కండరాలకు సమస్యలొచ్చే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు పావు గంటకోసారి విరామం తీసుకుని ఎకామిడేటివ్‌ కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అంటే విరామం సమయంలో ఆరు మీటర్ల దూరంలో ఉన్న వస్తువును ఒక నిమిషం లేదా 30 సెకన్లపాటు చూడాలి. దీంతో కంటిలో కండరం ఉపశమనం పొందుతుంది. రెప్పలు ఎక్కువ సార్లు ఆడిస్తూ ఉండాలి. సమస్య ఎదురైతే గోరువెచ్చటి నీటిలో కాటన్‌ వస్త్రాన్ని ముంచి కంటికి కాపడం పెడితే కంటిలో తేమశాతం పెరుగుతుంది. ప్లూయిడ్స్‌, మంచినీరు ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువ సేపు హెడ్‌ఫోన్లు, ఇయర్‌ఫోన్లు పెట్టుకుని వినాల్సి వచ్చినప్పుడు అరగంటకోసారి విరామం తీసుకుంటే మంచిది. వీలైనంత వరకు హెడ్‌ఫోన్లను వదిలేసి స్పీకర్‌ ఆన్‌ చేసుకుని మామూలుగా పాఠాలు వినాలి. ఎక్కువ సౌండు పెట్టుకుని వినకుండా సాధారణంగా వినే వాల్యూమ్‌ పెట్టుకోవాలి. ఇటీవలి కాలంలో ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాసుల పేరుతో విద్యార్ధినులను వేధించినట్లు కేసులు కూడా నమోదవుతున్నాయి. స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం వలన టీనేజి పిల్లలు పోర్న్ వీడియోలు చూసి బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు పాల్పడిన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఆన్‌లైన్‌ తరగతులకోసం అంతర్జాల సేవలతో ట్యాబ్‌లు, సెల్‌ఫోన్లను విద్యార్థులకు ఇస్తున్న తల్లిదండ్రులు వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యార్థులు అంతర్జాలం, స్మార్ట్‌ఫోన్లకు ఎడిక్ట్‌ కాకుండా చూసుకోవాలి. ఒంటరిగా విద్యార్థులు ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరవడం వల్ల వారిలో భావవ్యక్తీకరణ లోపించే ప్రమాదం ఉంది. ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మెడ కండరాలకు సమస్య వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవాలి. కొన్ని చిన్నచిన్న కసరత్తులు చేయాలి. టీనేజ్‌లో ఉన్న పిల్లలు కరోనావైరస్ సమయంలో స్నేహితులను కలవకపోవడం వలన దీర్ఘకాలంలో ప్రతికూల పరిణామాలు ఉంటాయని న్యూరో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లాక్ డౌన్ లో సాంఘిక జీవనం కరువవ్వడం వలన వారి మానసిక ఎదుగుదల, ప్రవర్తన, మెదడు పని చేసే తీరు పై ప్రభావం చూపవచ్చని నిపుణులు అంటున్నారు. భౌతిక దూరం పాటిస్తున్న సమయంలో సోషల్ మీడియాని ఎక్కువగా వాడటం వలన ప్రతికూల ప్రభావాలు చాలా ఉంటాయని తెలుస్తోంది. పరిస్థితి సురక్షితం అనుకోగానే పిల్లలకు స్కూళ్ళు తెరవడం అవసరం ఏర్పడింది. 10 - 24 సంవత్సరాల మధ్య వయస్సుని యుక్త వయస్సుగా పరిగణిస్తారని, ఈ వయస్సులో పిల్లలు సాధారణంగా స్నేహితులతోను, కుటుంబంతోనూ గడపాలని అనుకుంటారు. పిల్లల్లో శారీరకంగా, మానసికంగా ఎదుగుదల జరగడానికి ఇది కీలకమైన వయస్సు. ఇదే వయస్సులో చాలా రకాలైన మానసిక సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. కానీ, కరోనావైరస్ మహమ్మారితో పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. "కోవిడ్-19 వలన చాలా మంది యుక్త వయస్సులో ఉన్న వారు తమ తోటి వారితో కలవడం లేదు, ఇది వారి మానసిక ఎదుగుదలకు చాలా ప్రతికూలంగా పని చేస్తుంది. యువత మానసిక సంక్షేమం కోసం పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. యువత సాంఘిక జీవనానికి దూరం కావడం వలన కలిగే ప్రభావం గురించి మరింత పరిశోధన జరగాల్సి ఉంది.   యూకేలో 69 శాతం మంది 12-15 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకి సోషల్ మీడియా ప్రొఫైల్ ఉండటం వలన స్నేహితులతో సోషల్ మీడియాలో సంభాషించడానికి అవకాశాలు ఉన్నాయి. భౌతిక దూరం పాటించడం వలన కలిగే ప్రభావాల నుంచి డిజిటల్ మాధ్యమాలు ఎలా సహాయపడతాయో కూడా చూడాల్సిన అవసరం ఉంది. సోషల్ మీడియా వాడటం వలన, పోస్ట్‌లు రాయడం వలన, ఒకరితో ఒకరు సంభాషించుకోవడం వలన పరస్పర సంబంధాలు మెరుగుపడతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే  సోషల్ మీడియాలో తరచుగా న్యూస్ ఫీడ్ ని చూడటం వలన మానసిక ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కూడా ఉండే అవకాశం ఉంది. లాక్ డౌన్ కారణంగా చాలా దేశాలలో స్కూళ్ళకి సెలవులు ప్రకటించిన తర్వాత భారతదేశంలో కొన్ని స్కూళ్లలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. కానీ ఈ ఆన్లైన్ క్లాసులు అనుకున్నంత స్థాయిలో ప్రభావంతంగా నిర్వహించడం లేదు, విజయవంతం కావటంలేదు. కాబట్టి నేడు ఆన్లైన్ విద్య అమలు కోసం ప్రభుత్వాలు అన్నీ విద్యా సంస్థల యాజమాన్యాలతో, విద్యా నిపుణులతో, సాంకేతిక నిపుణులతో చర్చించి ఒక జాతీయ విధానాన్ని తీసుకు రావాల్సిన అవసరం ఉంది. సరైన జాగ్రత్తలు, సూచనలు పాటిస్తూ ఆన్లైన్ విద్యను అందించక పోతే విద్యార్థులకు కలిగే ప్రయోజనాల కన్నా అనర్ధాలే ఎక్కువ సంభవిస్తాయి. కాబట్టి ఆన్లైన్ విద్య అమలు కోసం ప్రభుత్వాలు నేడు సరైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

- వాసిలి సురేష్

9494615360

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top