Viral : డ్రైవర్ లేకుండా నడిచే ట్రాక్టర్... రాజస్థాన్ రైతు సృష్టి... ప్రశంసల జల్లు
జనరల్‌గా ట్రాక్టర్ నడపడం చాలా కష్టం. వెనకాల ట్రాలీ ఉంటే... మరింత జాగ్రత్తగా నడపాలి. అలాంటిది... అసలు డ్రైవర్‌తో పనే లేకుండా ట్రాక్టర్ దానంతట అదే నడిస్తే... ఇక రైతుకు అంత కంటే హాయి ఏముంటుంది. పొలంలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నేటప్పుడు... రైతులకు నడుము నొప్పి వస్తూ ఉంటుంది. ఇది శతాబ్దాలుగా రైతులు ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య. ట్రాక్టర్‌పై రైతు కూర్చుని డ్రైవ్ చేసే అవసరమే లేకుండా... ట్రాక్టర్ దానంతట అదే దుక్కి దున్నేస్తే... రైతుకు ఎంతో మేలు. ఈ కలను నిజం చేసి చూపిస్తున్నాడు రాజస్థాన్‌కి చెందిన ఈ 19 ఏళ్ల యువ రైతు. బారో సిటీలో నివసిస్తున్న యోగేష్... డ్రైవర్ సాయంతో నడిచే ట్రాక్టర్లో మార్పులు చేసి...
ఈ ఘనత సాధించాడు.
బీఎస్సీ ఫస్టియర్ చదువుతున్న యోగేష్కి ఓ రోజు కాల్ వచ్చింది. "నాన్నకు ఆరోగ్యం బాలేదు... అర్జెంటుగా నువ్వు ఊరికి రా" అన్నారు. హడావుడిగా ఊరెళ్లాడు. తండ్రిని జాగ్రత్తగా చూసుకుంటూ... మరోవైపు పొలం పనులు చెయ్యాల్సి వచ్చింది. దాదాపు 2 నెలలపాటూ ట్రాక్టర్‌తో పనులు చేశాడు. అప్పుడే అతనికి ఓ ఆలోచన వచ్చింది. మనం డ్రైవర్ లెస్ కార్లను చూస్తున్నాం... అలాంటప్పుడు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఎందుకు ఉండకూడదు అనుకున్నాడు. అలా రిమోట్ కంట్రోల్‌తో నడిచే ట్రాక్టర్‌ను తయారుచేశాడు.
జస్ట్ రూ.2,000తో ప్రయోగం ప్రారంభించాడు యోగేష్. తన ఉద్దేశాన్ని యోగేష్ తండ్రికి చెప్పినప్పుడు... పెద్దాయన... సరే అంటూ రూ.2000 ఇచ్చారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందో... ముందు నాకు చూపించు అన్నారు. నువ్వు చెప్పింది సాధ్యమే అని అనిపిస్తే... అప్పుడు మరింత డబ్బు ఇస్తాను అన్నారు. దాంతో... రూ.2వేలు పెట్టి... కొన్ని రకాల పరికరాలు కొన్నాడు. వాటిని ఉపయోగించి... ట్రాక్టర్‌ను ముందుకూ, వెనక్కీ రిమోట్‌తో కదిలించి చూపించాడు.
యోగేష్ చెప్పినది సాధ్యమే అని గ్రహించిన తండ్రి... తన బంధువుల దగ్గర రూ.50,000 అప్పు చేసి... కొడుక్కి ఇచ్చాడు. దాంతో యోగేష్... తన కల నిజం అయ్యేలా పూర్తి స్థాయి పరికరాలతో... మంచి రిమోట్ కంట్రోల్ తయారుచేసుకొని... ట్రాక్టర్‌ను అన్ని రకాలుగా రిమోట్‌తో నడిచేలా చేశాడు. ట్రాక్టర్ ఎలా వెళ్తోందో వీడియోలో మీరే చూడండి.
రిమోట్ కారణంగా... రైతులకు డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ఎంతో మేలు చేస్తుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. అనారోగ్య సమస్యలూ లేకుండా మేలు జరుగుతుంది. అందుకే ఈ ట్రాక్టర్ని చూసి స్థానికులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యోగేష్ భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని చెయ్యాలనుకుంటున్నాడు. మెచ్చుకుందామా.
0 comments:
Post a comment