Viral Video : దేవుడా..ఓ మంచి దేవుడా...ఎంత బాగా ప్రార్ధన చేస్తున్నాడో..అసలు సంగతి తెలిస్తే నవ్వులే..
చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. మురిపాల మూటలు కట్టే వారి చిరునవ్వులు చూస్తుంటే.. అల్లరి చేసినా సరే క్షమించేయాలనిపిస్తుంది. పిల్లలు మాట్లాడితేనే ముద్దుగా ఉంటుంది. అటువంటిది ప్రార్థన చేస్తే ఇంకెంత ముద్దొచ్చేస్తారో తెలుసా ? తెలియకపోతే ఈ పిల్లాడ్ని చూడండి. బాగా ఆకలి మీద ఉన్నాడో లేక లాలీపాప్ అంటే అమితమైన ఇష్టమో కానీ.. స్కూల్లో ప్రార్థన జరుగుతుంటే అందరితో పాటు కళ్లు మూసుకొని "దేవుడా... మాకంత శక్తినివ్వు !" అంటూ పాడుకుంటూ, మధ్య మధ్యలో చేతికున్న లాలీపాప్‌ను ఇలా చప్పరిస్తూ ఆస్వాదించేస్తున్నాడు. కళ్లు మూసుకున్నా సరే వీలు చిక్కినప్పుడల్లా లాలీపాప్ చప్పరిస్తూనే ఎంతో సిన్సియర్‌గా ప్రార్థనాగీతం ఆలపిస్తున్నట్లుగా పోజులిచ్చాడు .
ఛత్తీస్‌గఢ్‌లోని కబిర్ధామ్ జిల్లా కలెక్టర్ అవనీష్ శరణ్ ఈ బుడ్డోడి వీడియో షేర్ చేశారు. ఆ తర్వాత ప్రముఖ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ... "ఈ పిల్లాడి రూటే సపరేటు... ఈ వీడియో చూసి ఎవరెవరు తమ బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నారు ?" అంటూ చమత్కరించారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతుండగా ఈ బుడ్డోడు తన అమాయకమైన ప్రార్థనతో అందర్నీ తెగ నవ్వించేస్తున్నాడు. నవ్వించడమే కాదు.. తన చిలిపి చేష్టలతో ప్రతి ఒక్కరిలో నిద్రాణంగా ఉన్న బాల్యపు చిలిపితనాన్ని మేల్కొల్పుతున్నాడు. అందరూ కూడా "ఈ గడసరి పిల్లాడు నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చేశాడు" అంటూ కామెంట్లతో తమ చిలిపితనాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు.
చాలా మంది తమకు చిన్నతనంలో చేసిన అల్లరి గుర్తుకువస్తుందంటూ జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఒకరైతే.. "అతడ్ని డిస్టర్బ్ చేయకండి.. మెడిటేషన్ చేసుకుంటున్నాడు" అని చమత్కరించారు. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేసి మీ బాల్యంలో ఇలాంటి చిలిపి పనులేమైనా ఉంటే వాటిని ఓసారి నెమరువేసుకొని హాయిగా నవ్వుకోండి.
0 comments:
Post a comment