Troubled teaching with apps
యాప్ లతో యాతన కొరవడిన బోధన
***
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేయడం వల్ల పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఫలితంగా కొన్ని పాఠశాలలకు ఉపాధ్యాయులే లేకపోగా, మరికొన్ని పాఠశాలలలు ఏకోపాధ్యాయులకే పరిమితమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు లేక మూతపడిన స్కూళ్లకు ఉపాధ్యాయులను డెప్యుటేషన్స్ వేసి తాత్కాలిక సర్దుబాటు చేశారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు సెలవులు పెడితే సమీపంలోని వారిని తాత్కాలికంగా పంపిస్తున్నారు. దీనితో స్కూల్లో రెగ్యులర్ ఉపాధ్యాయుడు లేక బోధన కుంటుపడుతోంది. ప్రస్తుతం ఈ సమస్యను అధిగమించడానికి డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు అత్యవసరంగా భర్తీ చేయవల్సిన అవసరం ఏర్పడింది. పోస్టులు భర్తీ చేసేవరకు కనీసం అకడమిక్ ఇన్స్ట్రక్టర్ లను అయినా నియమించి ప్రభుత్వ స్కూళ్ళలో ఉపాధ్యాయ కొరతను అధిగమించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు కింద పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, స్కూళ్లను బాగుచేస్తున్నప్పటికి ఉపాధ్యాయ కొరత వల్ల బోధన సరిగా లేక విద్యార్థులకు మేలు జరుగటం లేదని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయుల బదిలీలకు ముందు ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేని బడులు రాష్ట్ర వ్యాప్తంగా 1,286 ఉండగా, హేతుబద్దీకరణ తర్వాత ఈ సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పని చేస్తున్న వారు కొందరు బదిలీపై వెళ్లిపోగా, కొన్నింటిలో ఖాళీలున్నా ఎవ్వరూ ఎంపిక చేసుకోకపోవడంతో ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఏర్పడింది. కొన్ని జిల్లాల్లో సమీపంలోని వారిని వారం, పది రోజులకు డిప్యుటేషన్‌పై పంపిస్తుండగా, మరికొన్ని చోట్ల తాత్కాలిక సర్దుబాటు చేశారు. డేప్యుటేషన్పై వచ్చేవారు మారుతుండటంతో విద్యార్థుల్లోనూ గజిబిజి ఏర్పడుతోంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ బదిలీ అయ్యారు. ఈ స్థానాల్లోకి ఎవ్వరూ రాకపోవడంతో బదిలీ అయిన వారినే తాత్కాలిక పద్ధతిపై ఇక్కడే కొనసాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక స్థాయిలో ఒకటి నుంచి ఐదు తరగతులకు కలిపి ఒకే ఉపాధ్యాయుడు ఉన్న బడులు ఎనిమిది వేల వరకు ఉన్నట్లు అంచనా. ఈ స్కూళ్ళలో అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ పని చేసేవారు సెలవు సమాచారాన్ని ఉన్నతాధికారులకు అందిస్తే తాత్కాలిక సర్దుబాటు చేస్తున్నారు. ఉపాధ్యాయులు ఐదు తరగతుల విద్యార్థులను ఒకే గదిలో ఉంచి చదువు చెబుతున్నారు. దీంతో విద్యార్థులందరిపైనా దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధ్యాయులు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు విరామం లేకుండా బోధించాల్సి వస్తోంది. దీంతో ఉపాధ్యాయులపై పని ఒత్తిడి అధికమయ్యింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది వేల పాఠశాలలు వరకూ ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి ఉన్నాయని, అలాగే పదహారు వేలకు పైగా ఎస్జీటీ పోస్టులు వరకూ ఖాళీలు ఉన్నట్లు అంచనా. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలు అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, నాడు-నేడు మొదలగు వాటి వల్ల పాఠశాలల్లో విద్యార్థులు సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉపాధ్యాయుల కొరతతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో పర్యవేక్షణ కోసం మొబైల్ యాప్స్ వినియోగం ఎక్కువ అయ్యింది. ఉపాధ్యాయుడు పాఠశాలకు పోయిన దగ్గర నుండి బయోమెట్రిక్ ఈ-హాజరుతో మొదలై పిల్లలు హాజరు, మద్యాహ్న బోజనం, శానిటైజేషన్, ప్రధానోపాధ్యాయుల ఇన్స్పెక్షన్ పోటోలు అప్లోడు చేయడం లాంటివి చేయవలసి వస్తోంది. సర్వర్ సరిగా పనిచేస్తేనే అరగంట పాటు సమయం పడుతుంది. ఇక సర్వర్ సరిగా పనిచేయకపోవడం, సిగ్నల్ సరిగాలేకపోయేసరికి గంటల సమయం కేటాయించవల్సి వస్తోంది. అందువల్ల ఉపాధ్యాయుల బోధనా గంటలు వృధా అవుతున్నాయి. ఈ విషయం అధికారులు గమనించి యాప్స్ నుండి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, ఈ-హాజరు నమోదు కావడం లేదని ఉపాధ్యాయులపై తీసుకుంటున్న చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులు ఈ-హాజరు నమోదుకాక మానసిక ఆందోళన చెందుతున్నారు. పాఠశాలకు సమయానికి హాజరైనప్పటికీ, ఈ-హాజరులో ఉన్న సాంకేతిక సమస్యల వలన ఉపాధ్యాయుల హాజరు నమోదు కావడం లేదు. పరికరాల లోపం, సాంకేతిక సమస్య, సర్వర్ సమస్యలతో యాప్స్ నందు వివరాలు సకాలంలో నమోదుకాక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమస్యలు ప్రత్యేకంగా అధికారులు పరిశీలించాలి. సాంకేతిక సమస్యలు సక్రమంగా పరిష్కరించకుండా చర్యలు తీసుకోవడం తగదు. ఇటీవల జరిగిన ఉపాధ్యాయ బదిలీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పాఠశాలల ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారినవి. కొన్ని పాఠశాలలో విద్యార్థులు సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఖాళీలు బ్లాక్ చేయడం వల్ల ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి విద్యాహక్కు చట్టం ప్రకారం అమలు కావడం లేదు. అయినప్పటికీ ఉన్న ఉపాధ్యాయులే ఎంతో శ్రమించి బోధన చేస్తున్నారు. కానీ యాప్స్ నందు వివరాలు సకాలంలో నమోదు చేయలేదని చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయులను భయాందోళనలకు గురిచేస్తున్నారు. ప్రాథమిక స్థాయిలో ఇంగ్లీష్ మీడియం బోధనకు ప్రత్యేకంగా ఇంగ్లీష్ ఎస్జీటీ పోస్టులు లేనప్పటికీ ఎస్జీటీ తెలుగు ఉపాధ్యాయులే ఎంతో శ్రమించి గత మూడు సంవత్సరాలుగా కొన్ని పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఉన్న యాప్స్ నిర్వహణే కష్టంగా ఉండగా ఇప్పుడు అదనంగా స్టూడెంట్ అటెండెన్స్ యాప్, ఐ.ఎమ్.ఎమ్.ఎస్ యాప్, జగనన్న గోరుముద్ద యాప్ నిర్వహణ మరింత ఇబ్బందిగా మారింది. దీంతో ఉపాధ్యాయులపై పని భారం అధికమవుతోంది. అధిక సమయాన్ని యాప్స్ కొరకు వినియోగించడంతో, బోధనకు అవసరమైనంత సమయం కేటాయించడం లేదు. దీంతో ప్రాధమిక విద్యా లక్ష్యాలకు సాధించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉపాధ్యాయులకు యాప్స్ నిర్వహణ బాధ్యత పెట్టకూడదు. ఒకవేళ తప్పనిసరి అయితే ఈ పరిస్థితులు అధిగమించడానికి ఇంటిగ్రేటెడ్ యాప్ ఏర్పాటు చేసి అమలు చేయాలి. రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయడానికి వెంటనే డియస్సి ప్రకటించాలి. అప్పటివరకు అవసరమైన చోట మరియు ఏకోపాధ్యాయ పాఠశాలలకు కనీసం విద్యావాలంటీర్లను లేదా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను ఏర్పాటు చేయవలసి ఉంది.
- వాసిలి సురేష్
9494615360
0 comments:
Post a comment