విస్మరించకూడని జబ్బు.. క్రానిక్ కిడ్నీ డిసీజ్
మన దేహంలో మూత్రపిండాల పని చాలా కీలకం. తొలుత కొంతవరకు తమను తాము రిపేర్ చేసుకునే దశలోనే ఉన్నా, ఒక స్థాయి దాటి దెబ్బతింటే మాత్రం తమను తాము చక్కబరచుకోలేవు. పైగా మన దేహంలో రెండు కిడ్నీలు ఉండటంతో ఏది సరిగా పని చేయలేక పోయినా, దాని బాధ్యతను మరొకటి తీసుకుంటుంది. ఫలితంగా అవి పూర్తిగా పనిచేయలేని పరిస్థితికి వచ్చేదాకా మనకు ఆ విషయం తెలియదు. అందుకే, వాటికి ఆ స్థితి రాకముందే మనం తెలుసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డయాబెటిస్ లేదా హైబీపీతో బాధపడుతుంటే మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. దీర్ఘకాలిక కిడ్నీ జబ్బు (క్రానిక్ కిడ్నీ డిసీజ్) వచ్చే అవకాశం ఉంది. 'సీకేడీ' అంటూ సంక్షిప్తంగా పిలిచే ఈ జబ్బుపై అవగాహన కోసమే ఈ కథనం.
ముందు చెప్పుకున్నట్టుగా కిడ్నీలు దీర్ఘకాలంపాటు సరిగా పనిచేయని పరిస్థితే 'క్రానిక్ కిడ్నీ డిసీజ్'. దీర్ఘకాలం అంటే కనీసం మూడు నెలలపాటు అన్నమాట. రెండు కిడ్నీల్లో ఏ ఒక్కటి సరిగా పనిచేయకపోయినా, దాని బాధ్యతను పక్క కిడ్నీ తీసుకోవడం వల్ల సీకేడీని చాలా ఆలస్యంగా గుర్తిస్తామని చెప్పుకున్నాం కదా. అలా చేయిదాటిపోయాక కిడ్నీల పనితీరు మెల్లమెల్లగా మరింత దెబ్బతింటూ పోతున్నకొద్దీ, రోగి బాధ మరింతగా పెరుగుతుంది.
మూత్రపిండాలు ఏం చేస్తాయంటే..
మన దేహంలోని మలినాలను బయటకు విసర్జించడంతోపాటు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, విటమిన్-డి వంటి లవణాలు, ఖనిజాలు, విటమిన్లతోపాటు ఎరిథ్రోపాయిటన్ అనే హార్మోన్‌ను కూడా కిడ్నీలు నియంత్రిస్తూ ఉంటాయి. ఈ నియంత్రణ ప్రక్రియ సరిగా జరగక పోవడంవల్ల దేహంలో సోడియం తగ్గిపోవడం, పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదు పెరగడం వంటి అనర్థాలు చోటు చేసుకుంటాయి. దాంతో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
కిడ్నీ సమస్యలకు దారితీసే కారణాలు
సాధారణంగా ఈ కింద పేర్కొన్న కండిషన్స్ ఉన్నవారికి కిడ్నీ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. అవి...
డయాబెటిస్
హైపర్ టెన్షన్ (హైబీపీ)
కిడ్నీలో రాళ్లు
మల్ట్టిపుల్ యూరిన్ ఇన్ఫెక్షన్లు
మూత్రంలో ప్రొటీన్ మోతాదులు ఎక్కువగా ఉండటం
మూత్రంలో రక్తం
మాంసాహారం, ఉప్పు ఎక్కువగా తినడం.
కనిపించే లక్షణాలు..
మూత్రపిండాల సమస్యతో బాధ పడేవారికి సాధారణంగా కాళ్ల వాపులు, ముఖం వాపు, పొట్ట ఉబ్బరం, నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలుంటాయి. నీరసం చాలా ఎక్కువగా ఉంటుంది. నిలబడినా, కూర్చున్నా చాలా ఆయాసపడతారు. దీనివల్ల తమ రోజువారీ పనులు చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి.
కిడ్నీ జబ్బులతో ముప్పు..
కిడ్నీ సమస్యతో బాధపడేవారిలో 50 శాతం మందికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవి కేవలం రక్తపోటు, డయాబెటిస్ వల్ల మాత్రమే కాకుండా కిడ్నీ జబ్బులవల్ల కూడా వచ్చే ముప్పు ఉంటుంది. మనం తొలిదశలోనే కిడ్నీ సమస్యలను గుర్తించకపోతే రక్తం తగ్గడం, ఎముకలు బలహీనపడటం, గుండెతోపాటు ఊపిరితిత్తుల్లోనూ నీరుచేరడం వంటి సమస్యలకు దారి తీయవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో రోగికి డయాలసిస్ తప్పనిసరి. అయితే అలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అంటే అప్పటికే జరగాల్సిన నష్టం పూర్తిగా జరిగిపోయినట్టే.
ఈ పనులు చేయకండి..
ఇలాంటి కండిషన్లో ఉన్నవారిలో కొందరు ఇతరత్రా వైద్య ప్రక్రియలు, నాటు వైద్యాలంటూ ప్రత్యామ్నాయాల కోసం వెళ్లి వ్యాధిని మరింతగా ముదరబెట్టుకుంటారు. కొన్ని ప్రక్రియల వల్ల వ్యాధిని సూచించే క్రియాటినిన్ అనే రసాయనం తాత్కాలికంగా తగ్గినట్లుగా పరీక్షల్లో కనిపించవచ్చు. కానీ, ఆ నాటువైద్యాల్లో ఉపయోగించే మందులు, రసాయనాలను శుద్ధి చేసే బాధ్యత మూత్రపిండాలపై అధికంగా పడి, అవి మరింతగా దెబ్బతింటాయి. ఇక కొందరు తాము అన్నం తగ్గిస్తే రక్తంలో చక్కెర తగ్గుతుందంటూ ఆహారం పరిమితంగా తీసుకోవడం లేదా సరిగా తీసుకోకపోవడం చేస్తుంటారు. ఇదికూడా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలా ఆహారం తీసుకోకపోవడం, మందులు సరిగా వాడకపోవడం వల్ల ఎప్పుడో రావాల్సిన మూత్రపిండాల సమస్య 10 లేదా 15 ఏండ్ల ముందుగానే రావచ్చు.
మూత్రపిండాల సమస్యలు - దశలు
మూత్రపిండాల సమస్యను ఐదు దశలుగా వర్గీకరించవచ్చు. మొదటి దశలో కిడ్నీ పనితీరు 35 నుంచి 50 శాతం దెబ్బతింటుంది. లక్షణాలు పెద్దగా కనిపించవు. ఇలా క్రమంగా పనితీరు తగ్గుతూపోతూ రెండూ, మూడు, నాలుగు దశలు దాటవచ్చు. ఆయా దశల్లో ఎప్పుడైనా ఇతర వ్యాధులకు నిర్వహిస్తున్న పరీక్షల్లో కిడ్నీ సమస్య బయటపడవచ్చు. సమస్య ఐదో దశకు చేరిందంటే ఇక అది ఏమాత్రం బాగు చేయలేని చివరి దశ అన్నమాట. దాన్నే 'ఎండ్ స్టేజ్ డిసీజ్'గా చెబుతారు. అందుకే డయాబెటిస్, హైపర్ టెన్షన్ (హైబీపీ) ఉన్నవారు తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ తొలిదశలోనే గుర్తిస్తే వ్యాధిని మందులతోనే తగ్గించవచ్చు. చాలామంది కిడ్నీ సమస్య అంటే దానికి డయాలసిస్ తప్పదనే భావనతో నెఫ్రాలజిస్టు (కిడ్నీ డాక్టరు) దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోడానికి వెనుకాడతారు. కానీ, కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచుకొని ముందే పరీక్ష చేయించుకుంటే అసలు సమస్యను ఎప్పటికీ డయాలసిస్ వరకు రాకుండా నివారించుకోవచ్చు.
చేయించుకోవాల్సిన పరీక్షలు
'సీరమ్ క్రియాటినిన్' అనే పరీక్షతో కిడ్నీ సమస్య ఉన్నదీ లేనిదీ తెలుసుకోవచ్చు. ఇది చాలా చిన్నదీ, చవకదీ. చిన్నపాటి సమస్య వస్తుందనిపించినప్పుడు లేదా వచ్చిందనుకున్నప్పుడు తొలి ఏడాదిలో మూడు నెలలకోసారి పరీక్ష చేయించుకోవాలి. ఆ తర్వాత ఏడాదికోసారి చేయించుకుంటే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల మూత్రపిండాల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చు.
ఎందుకు చేసుకోవాలి?
కిడ్నీ బయాప్సీ కారణాలు, ఉపయోగాలు..
ఇతర పద్ధతులతో వ్యాధిని నిర్ధారించలేనప్పుడు.
కిడ్నీల పరిస్థితులను తెలుసుకొని దానికి మెరుగైన చికిత్సను అందించడానికి అవకాశం ఉంటుంది.
కిడ్నీ జబ్బు అనేది ఎంత తొందరగా తీవ్రం అవుతుందో తెలుసుకోవచ్చు.
కిడ్నీలు ఎంత వరకు దెబ్బతిన్నాయో తెలుసుకోవచ్చు
కిడ్నీ చికిత్స ఎంతవరకు పని చేస్తున్నది, కిడ్నీ ఆరోగ్యం ఎంత మెరుగపడింది వంటి విషయాలపై అవగాహన పెంచుకోవచ్చు.
ట్రాన్స్‌ప్లాంట్ చేసిన కిడ్నీ ఆరోగ్యాన్ని లేదా అది ఎందుకు సరిగా పని చేయటం లేదో తెలుసుకోవచ్చు. ఇంకేదైనా సమస్యలున్నా కూడా ఇందులో కనుక్కోవచ్చు.
మీ రక్త లేదా మూత్ర పరీక్షలో కింద తెలిసిన విధంగా ఉంటే బయాప్సీ పరీక్షను చేసుకోవడానికి మీ డాక్టర్ ఆదేశిస్తారు.
మూత్రంలోని రక్తం కిడ్నీ నుంచి రావడం..
ప్రోటీన్ శాతం (ప్రోటీన్ యూరియా) మూత్రంలో ఎక్కువగా ఉంటే లేదా ఇతర ఏదైనా కిడ్నీ సమస్యలు ఉన్నట్టుగా అనిపిస్తే..
కిడ్నీ పనితీరు సరిగా ఉండకపోవడం లేదా మూత్రంలో వ్యర్థాలు ఎక్కువగా ఉండటం. పైన తెలిపిన లక్షణాలున్న అందరికీ బయాప్సీ పరీక్ష అవసరం ఉండకపోవచ్చు. మీకు ఉన్న లక్షణాలు, రక్త పరీక్షలను బట్టి బయాప్సీ చేసుకోవాలా? వద్దా? అని నిర్ణయిస్తారు.
0 Comments:
Post a Comment