ఎన్నికల కమిషనర్లుగా ప్రభుత్వోద్యోగులా ? సుప్రీంకోర్టు ఆగ్రహం- రాజ్యాంగం అపహాస్యం
ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు సంబంధించి సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల కమిషనర్లుగా ఉండే వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులు కాకూడదని అత్యున్నత న్యాయస్ధానం వ్యాఖ్యానించింది. గోవా ఎన్నికల కమిషనర్ జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్‌పై బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన అప్పీలుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.
గోవాలోని ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ను ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఇంఛార్జ్ ఎన్నికల కమిషనర్ ఇచ్చారు. దీనిపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన బోంబే హైకోర్టు ఆ నోటిఫికేషన్ చెల్లదని తీర్పు ఇచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారించిన జస్టిస్ రోహింగ్టన్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ హృషికేష్ రాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. బోంబే హైకోర్టు తీర్పును సమర్ధించింది. ఎన్నికల కమిషనర్‌గా ఉండే వ్యక్తి ప్రభుత్వోద్యోగి కావడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్లేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఏ రాష్ట్రం కూడా ప్రభుత్వోద్యోగిగా ఉన్న వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అది ఎన్నికల కమిషన్ స్వతంత్రతకు భంగమని తెలిపింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ స్వతంత్రత కలిగిన సంస్ధ అని, అందులో ప్రభుత్వ ఉద్యోగులు కమిషనర్లుగా ఉండటం సరికాదని పేర్కొంది. గోవాలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా తప్పని తెలిపింది. ఆయన్ను తక్షణం తప్పించాలని సూచించింది.
0 Comments:
Post a Comment