*📚✍ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నేడే
🌻కలెక్టరేట్ (గుంటూరు), న్యూస్టుడే: కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఉదయం 7 గంటలకు గుంటూరులోని ఆంధ్రా క్రైస్తవ కళాశాలలోని అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిచి బ్యాలెట్ బాక్సులను లెక్కింపు కేంద్రం లోపలికి తీసుకొస్తారు. అనంతరం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 8 గంటలకు ఒకసారి ఉద్యోగులు ఓట్ల లెక్కింపు విధులకు మారతారు. ఇలా మూడు షిఫ్టుల్లో ఉద్యోగులకు విధులను కేటాయించారు. ఓట్ల లెక్కింపు త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్ వద్ద ఐదుగురు సిబ్బంది ఉంటారు. వీరితో పాటు తహసీల్దార్, ఎంపీడీవో స్థాయి అధికారులు సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లుగా ఉంటారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రిటర్నింగ్ అధికారులు పాల్గొననున్నారు.
♦19 మంది అభ్యర్థులు
కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులున్నారు. విజయం ఎవరిదన్నది లెక్కింపు ప్రక్రియతో తేలనుంది. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తారు. ప్రథమ ప్రాధాన్యత ఓటుతో ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.
♦విజయం ఎవరిని వరించేనో?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీ చేయగా విజయం ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఐదారుగురు అభ్యర్థుల మధ్యనే పోటీ నెలకొందని భావిస్తున్నారు. అభ్యర్థులకు మద్దతు తెలిపిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఉపాధ్యాయ ఓటర్లతో ఓటింగ్ వేయించారు. సాధారణ ఎన్నికలకు భిన్నంగా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరగనుంది. తొలుత అభ్యర్థులకు వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఎవరైనా అభ్యర్థి 50 శాతం ఓట్లు సాధిస్తే వారిని విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఎవరికీ 50 శాతం ఓట్లు రాకుంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును చేపడతారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కనీసం రెండు రోజులు పడుతుందని అధికారులు భావిస్తున్నారు. మొదటి రోజు లెక్కింపులో అభ్యర్థులకు వచ్చిన ఓట్ల ఆధారంగా వారి విజయావకాశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
0 comments:
Post a comment