టీవీ కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ధరలు
న్యూఢిల్లీ: టీవీ కొనే ఆలోచన ఏమైనా ఉంటే ఇప్పుడే కొనుగోలు చేసుకోవడం మంచిది. వచ్చే నెల చూద్దాంలే అనుకుంటే కనుక అప్పుడు ఆ ఆలోచనే విరమించుకునే పరిస్థితి రావొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ నుంచి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రపంచ మార్కెట్లలో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతున్నాయి. ఫలితంగా పానసోనిక్, హయెర్, థామ్సన్ వంటి బ్రాండ్లు ఏప్రిల్ నుంచి టీవీ ధరలను పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఓపెన్-సెల్ ధర పెరగడంతో ఎల్‌జీ ఇప్పటికే ధరలను పెంచేసింది.
ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతుండడంతో ఏప్రిల్ నుంచి టీవీ ధరలు పెంచక తప్పదని పానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో మనీశ్ శర్మ తెలిపారు.
ఎంత వరకు పెరగొచ్చన్న ప్రశ్నకు.. 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. టీవీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని హయెర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎరిక్ బ్రాగంజా అభిప్రాయపడ్డారు. టీవీ తయారీలో ఓపెన్ సెల్ ప్యానెల్‌ది కీలక పాత్ర. యూనిట్‌లో 60 శాతాన్ని ఇదే కవర్ చేస్తుంది. టెలివిజన్ ప్యానెళ్లను ఓపెన్ సెల్ స్థితిలో కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి.
భారత్‌లో 32 అంగుళాల టీవీలకు విపరీతమైన డిమాండ్ ఉంది. వచ్చే నెల నుంచి ఈ టీవీ ధర రూ. 5,000-రూ. 6,000 మధ్య పెరిగే అవకాశం ఉందని వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ గ్రూప్ డైరెక్టర్ అర్జున్ బజాజ్ తెలిపారు. ఇండస్ట్రీ బాడీ సీఈఏఎంఏ , ఫ్రోస్ట్ అండ్ సుల్లివన్ జాయింట్ రిపోర్టు ప్రకారం 2024-25 నాటికి టీవీ మార్కెట్ 284 లక్షల యూనిట్లకు చేరుకుంటుంది. 2018-19 ఇది 175 లక్షల యూనిట్లుగా ఉంది.
0 Comments:
Post a Comment