Andhra Pradesh corona update: నాలుగు జిల్లాలను వెంటాడుతున్న కరోనా భయం: మళ్లీ కఠిన ఆంక్షలు దిశగా అధికారుల కసరత్తు!
ఏపీని వైరస్ వెంటాడుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. మళ్లీ గత అనుభవాలు భయపెడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నాలుగు జిల్లాలో పరిస్థితి గందరగోళంగా మారింది. ప్రతి రోజూ 30కి తగ్గకుండా కేసులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 31 వేల 138 నమూనాలను పరీక్షించగా 368 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 8 లక్షల 93 వేల 734కి చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ తాజాగా బులెటిన్ విడుదల చేసింది. అయితే 24 గంటల వ్యవధిలో కరోనాతో రాష్ట్రంలో ఎలాంటి మరణం సంభవించకపోవడం ఊరట కలిగిస్తోంది.
ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా సోకి మృతి చెందిన వారి సంఖ్య 7189 మందికి చేరింది. ఒక్కరోజులో 263 కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా..2 వేల 188 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1 కోటి 47లక్షల36 వేల 326 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల సంఖ్య చూస్తే.. అనంతపురం 40, చిత్తూరు 40, తూర్పుగోదావరి 20, గుంటూరు 79, కడప 10, కృష్ణా 37, కర్నూలు 49, నెల్లూరు 20, ప్రకాశం 6, శ్రీకాకుళం 10, విశాఖపట్నం 39, విజయనగరం 9, పశ్చిమ గోదావరి 9 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా గుంటూరు, చిత్తూరు జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళన పెంచుతోంది. అత్యధికంగా గుంటూరులో 79 కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ భారీగా కేసులు వస్తుండడంతో ఇప్పటికే చాలా చోట్ల నిబంధనలను కఠినం చేశారు. అయితే కరోనా కేసులు అదుపులోకి రాడం లేదు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ పంపిణీ మరింత వేగవంతం అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వం అవగాహన కల్పిస్తున్నా.. కొందరి ప్రజల్లో అనుమానాలు ఉండడంతో వ్యాక్సిన్ వేసుకోడానికి ముందుకు రావడం లేదు.
ఇటు చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసులను కలవరపెడుతోంది. గతేడాది కాలంలో జిల్లాలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేసులో ఉన్న చిత్తూరు జిల్లాలో.. తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకొంది.
ముఖ్యంగా కరోనా కేసులు పెరగడానికి ప్రజల నిర్లక్షమే ప్రధాన కారణం. ప్రజలు ఎవరూ గతంలో లాక్ డౌన్ అమల్లో ఉన్న సమయంలో మాస్కులు పెట్టుకున్నట్టు ఇప్పుడు పెట్టుకోవడం లేదు. అసలు జనసమూహం ఉన్న ప్రదేశాల్లో ఎక్కడా మాస్కులు పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్, రైతు బజార్లు, వైన్ షాప్స్ ఎక్కడా మాస్కు లేనిదే అనుమతి లేదని బోర్డులు పెడుతున్నారు తప్పా.. అక్కడ మాస్కులు పెట్టుకున్న జాడ లేదనే చెప్పాలి. శానిటైజర్ తప్పనిసరి, భౌతికదూరం అన్న నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. అందుకే రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.
0 comments:
Post a comment