📙✍ఎయిడెడ్ పోస్టుల భర్తీకి హడావుడి!
🔸ప్రకాశంలో 5 బడుల్లో నియామకాలకు అనుమతి
🔸విద్యాశాఖను కోరిన మరికొన్ని యాజమాన్యాలు
🌷ఈనాడు, అమరావతి:
రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. న్యాయస్థానం ఆదేశాలతో కొన్ని బడుల్లో నియామకాలకు ప్రభుత్వం అనుమతించింది. గతంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో భర్తీ ప్రక్రియను మధ్యలోనే నిలిపేశారు. తాజాగా ప్రకాశం జిల్లాలోని 5 పాఠశాలల్లో నియామకాలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కడప, తూర్పుగోదావరి జిల్లాల్లోని మరికొన్ని యాజమాన్యాలు ఖాళీలను భర్తీ చేయాలని విద్యాశాఖను కోరుతున్నాయి. మొదట పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పోస్టులను హేతుబద్ధీకరించ నున్నారు. ఆ తర్వాత ఎన్ని పోస్టులు అవసరమవుతాయో గుర్తించాలని పాఠశాల విద్య కమిషనరేట్ నుంచి క్షేత్ర స్థాయికి ఆదేశాలిచ్చారు. 40 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడి చొప్పున హేతుబద్ధీకరణ చేయనున్నారు.
🔸పాత విధానంలోనే నియామకాలు..
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే ఉపాధ్యాయ అర్హత పరీక్షతోపాటు (టెట్) నియామక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాల్సి ఉంటుంది. ఎయిడెడ్కు వచ్చేసరికి ఉత్తర్వు-1 ప్రకారం డిప్యూటీ విద్యాధికారి, ఇద్దరు సబ్జెక్టు నిపుణులు రూపొందించిన ప్రశ్నపత్రంతోనే పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో పారదర్శకతపై గతంలో అనేక ఆరోపణలొచ్చాయి. ప్రశ్నపత్రాలను ముందుగానే లీక్ చేసిన ఘటనలు గతంలో చోటుచేసుకున్నాయి. ఏ జిల్లాలో పాఠశాల ఉందో అక్కడే నియామక ప్రకటన ఇస్తారు. రాత పరీక్షను 95 మార్కులు, మౌఖిక పరీక్షను 5 మార్కులకు నిర్వహిస్తారు. ఉపాధ్యాయుల నియామకాల్లో మౌఖిక పరీక్షలను రద్దు చేసి కొన్నేళ్లు గడుస్తున్నా ఇందులో ఈ నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది. దీంతో ఈ ఖాళీల భర్తీలో భారీగా పైరవీలు కొనసాగే పరిస్థితి ఏర్పడుతోంది.
🌷ప్రత్యేక డీఎస్సీ నిర్వహణ ఏమైంది?
ఎయిడెడ్ బడుల్లోని ఖాళీలన్నింటికీ కలిపి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని గత ప్రభుత్వంలో ఉత్తర్వులిచ్చారు. మైనారిటీ సంస్థలతో కలిపి అన్నింటికీ ఇదే విధానమంటూ ఉత్తర్వులు ఇవ్వడంతో కొన్ని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఆ ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. తాజాగా మైనారిటీ సంస్థలను మినహాయించి ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని ఇటీవల ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు పంపింది. పోస్టుల భర్తీలో పారదర్శకత, నాణ్యతా ప్రమాణాలు సాధించేందుకు ఇది అవసరమని పేర్కొంది. దీనిపై ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో పాత విధానంలోనే నియామకాలు సాగే అవకాశం ఉంది.
0 comments:
Post a comment