ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి త్వరలో జరగనున్న ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. జిల్లాల వారిగా వివిధ వర్గాలకు ప్రాధాన్యమిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం జిల్లా నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు జిల్లా నుంచి కల్యాణ చక్రవర్తి, విజయవాడ నుంచి కరీమున్నీసా, కడప జిల్లా నుంచి సీ.రామచంద్రయ్య, కర్నూలు జిల్లా నుంచి చల్లా భగీరథ రెడ్డి పేర్లను ఖరారు చేశారు. ఇక టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టడం లేదని సజ్జల తెలిపారు.
మార్చి 15న జరగనున్న ఎమ్మల్సీ ఎన్నికలకు ఈనెల 18న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 4వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, మార్చి 5న నామినేషన్ల పరిశీల, మార్చి 8వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు గడువు ఇచ్చింది. మార్చి 15న పోలింగ్ అదే రోజు కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఖాళీ అయిన స్థానాల విషయానికి వస్తే రాజ్యసభ ఎంపీగా వెళ్లడంతో మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ స్థానం ఖాళీ అయింది. అలాగే చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందడంతో ఆ స్థానం కూడా ఖాళీ అయింది. ఈ నెల 29తో ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, తిప్పేస్వామి, సుధారాణి, వీర వెంకన్న చౌదరిల పదవీ కాలం ముగియనుంది. మొత్తం 6స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
ఇదీ షెడ్యూల్
ఫిబ్రవరి 25న (గురువారం) నోటిఫికేషన్.. మార్చి 15న పోలింగ్
మార్చి4: నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
మార్చి 5: నామినేషన్ల పరిశీలన
మార్చి 8: నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
మార్చి 15: పోలింగ్ ఉదయం 9 గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్
మార్చి 15 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్, ఫలితాల ప్రకటన
0 comments:
Post a comment