Pondicherry Crisis :పుదుచ్ఛేరిలో రాజకీయ సంక్షోభం వెనుక ఎవరున్నారు? మల్లాడి చక్రం తిప్పారా? కిరణ్ బేడీని అందుకే తప్పించారా?
పుదుచ్చేరిలో ఏం జరుగుతోంది..? రాజకీయ సంక్షోభం ఎటువైపు దారి తీస్తోంది..? ప్రభుత్వం పడిపోతోందా..? రాహుల్ రాకముందే ఈ తుఫాను చెలరేగడానికి కారణం ఏంటి? రాజీనామాల పర్వం వెనుక ఉండి నడిపిస్తోంది ఎవరు..? ప్రస్తుతం రాజకీయా వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయ్యింది. పుదుచ్చేరిలో పరిస్థితి చూస్తే ప్రభుత్వం రేపో.. మాపో పడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్బేడీపై వేటు పడడం.. తెలంగాణ గవర్నర్ తమిళి సైకి అదనపు బాద్యతలు అప్పగించడంపై ఏదో జరుగుతోంది అనే అనుమానాలు పెరుగుతున్నాయి.
దేశంలో తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అసోంలతోపాటు పుదుచ్చేరీలో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందే రాజకీయ సంక్షోభం తీవ్రమవుతోంది.
ఎన్నికలు మరో రెండు నెలలుండగా.. వరుస రాజీనామాలతో అధికార కాంగ్రెస్ చేయి పూర్తిగా విరిగిపోయింది. అధినేత రాహుల్ గాంధీ పార్టీని చక్కదిద్దేందుకు వస్తున్న తరుణంలో రాజీనామాల పర్వం ఊపందుకోవడం వెనుక కుట్ర కోణం దాగి ఉందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎన్నికలకు ముందే పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుద్దుచ్ఛేరి ఒకటి. తమిళనాడులో అంతర్భాగంగా కనిపించే ఈ ఫ్రెంచ్ కాలనీలో ఆంధ్రప్రదేశ్ మధ్యన సముద్ర తీరంలో వున్న యానాం కూడా ఒక అంతర్భాగం కావడంతో.. పుదుచ్చేరి రాజకీయలపై ఏపీలో కూడా ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. నెలరోజుల వ్యవధిలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో పార్టీ బలం మెజారిటీ మార్కుకు దిగువన చేరింది. దాంతో పుదుచ్చేరి రాజకీయాల్లో అనూహ్య మలుపులు చోటు చేసుకుంటున్నాయి.
నమశివాయం, తిప్పయింజన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు జనవరి 25న రాజీనామా చేయగా.. సోమవారం రాత్రి యానాం శాసనసభ్యుడు, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. మంగళవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి నారాయణస్వామికి సన్నిహితుడైన జాన్ కుమార్ 2019లో కామరాజ్ నగర్ నియోజకవర్గ ఉపఎన్నికలో గెలిచారు. ఇప్పటివరకు రాజీనామా చేసిన వారిలో జాన్ కుమార్ నాలుగోవారు. 33 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో మూడు నామినేటెడ్ స్థానాలు. 2016లో 30 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా.. కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. ఇప్పుడు నలుగురు రాజీనామా చేయడంతో ఆ పార్టీ బలం 11కి చేరింది. దాంతో నారాయణ స్వామి ప్రభుత్వం మైనారిటీలో పడినట్లయింది.
ఈ రాజీనామాల వెనుక మల్లాడి చక్రం తిప్పినట్టు యానం రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏపీ సముద్ర తీరంలో వుండే యానాం నుంచి మల్లాడి కృష్ణారావు దాదాపు పాతికేళ్ళుగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గత నెల 7న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. దానిని ముఖ్యమంత్రి ఇంకా ఆమోదించకముందే సోమవారం నాడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా లేఖను సమర్పించారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్ వీపీ శివకొలుందుకు పంపారు. మల్లాడి వ్యూహం ఏంటో తెలియక కాంగ్రెస్ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. నిజానికి జనవరి ఆరవ తేదీన మల్లాడి కృష్ణారావు ఉత్తమ శాసనసభ్యునిగా రజతోత్సవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ మర్నాడే ఆరోగ్య శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇంతవరకు ఆ రాజీనామాకు సీఎం ఆమోదం తెలపకపోడంతో పరిస్థితి సద్దుమణిగింది అనుకున్నారు. కానీ ఆయన నేరుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరో ఝలక్ ఇచ్చారు.
బొటాబొటి మెజారిటీతో 2016 నుంచి ప్రభుత్వంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి నారాయణస్వామి గత రెండు, మూడేళ్ళుగా అనేక ఇబ్బందులతో నెట్టుకొస్తున్నారు. ముఖ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్గా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ వచ్చినప్పట్నించి నారాయణ స్వామికి పక్కలో బల్లెంలా మారారు. దాంతో సీఎం, లెఫ్టినెంట్ గవర్నర్ల మధ్య తరచూ బిబేధాలు తలెత్తాయి. కరోనా టైం నుంచి వీరిద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. పలు మార్లు గవర్నర్ హోదాలో కిరణ్ బేడీ అధికారులతో రివ్యూలు నిర్వహించి, కోవిడ్ పరిస్థితులను స్వయంగా సమీక్షించడం ముఖ్యమంత్రి నారాయణ స్వామికి ఇబ్బందిగా మారింది. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలతో తలనొప్పి పెరిగింది.
ఈ రాజకీయా సంక్షోభానికి అసలు కారణం కషాయపార్టీ అంటూ ప్రచారం జరుగుతోంది. తమిళనాడు, బెంగాల్, కేరళ, అసోం రాష్ట్రాలతో కలిసి పుదుచ్ఛేరి కూడా మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలకు వెళ్ళబోతోంది. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ చాలా వేగంగా పావులు కదుపుతోంది. ప్రస్తుతం పుదుచ్ఛేరిలో ఎమ్మెల్యేల రాజీనామాల వెనుక కమలనాథుల హస్తం వుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం తమిళనాడులో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్కడ ఫళనిస్వామి ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే పుదుచ్చేరిలోనూ తమ మార్కు ఉండాలని ఆరాటపడుతున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు నుంచి పుదుచ్చేరి రాజకీయాలపై ఆయన ఫోకస్ చేసినట్టు సమాచారం. అందుకే తాజా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. రాజీనామాల పర్వం ఇలాగే కొనసాగితే.. పుదుచ్ఛేరిలో ప్రభుత్వం కూలిపోయి కేంద్ర పాలన అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. దాంతో నారాయణ స్వామి ఆధ్వర్యంలో కాకుండా కేంద్ర పాలన రూపంలో గవర్నర్ పెద్దరికంలో ఎన్నికలు జరిగే అవకాశం ఏర్పడుతుంది.
ఒక వేళ అలా జరిగినా కిరణ్ బేడీ పెద్దరికంలో పాలన అంటే.. అది కూడా తలతో కొరివి గొక్కున్నట్టే అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు.. ఆమె ముక్కుసూటిగా ఉంటారు.. ఎవరి మాట వినే రకం కాదు.. అందకే కిరణ్ బేడీని అక్కడ నుంచి తప్పించి.. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి అదనపు బాధ్యలు అప్పగించారని పుదుచ్చేరి పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
0 comments:
Post a comment