చదవుకోక ముందు కాకర కాయ అంటే.. చదువుకొన్నాక కికర కాయ్ అన్నారట. ప్రస్తుతం తెలంగాణ విద్యాశాఖలో అదే పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులకు ఒకరంటే ఒకరికి పడటం లేదని సమాచారం. కీలక నిర్ణయాలను తీసుకోవడంలోనూ గందరగోళానికి దారితీస్తోందట.
విద్యాశాఖలో ఎడ్డెమంటే తెడ్డెమంటోన్న అధికారులు!
కరోనా కారణంగా విద్యాసంవత్సరం గాడి తప్పింది. ఈ ఏడాది సరిదిద్దితేకానీ.. వచ్చే ఏడాది టైమ్ టేబుల్ ప్రకారం నడవదు. విద్యాశాఖలోని అన్ని విభాగాలదీ ఇదే పరిస్థితి. ఇలాంటి సమయంలో కలిసి పనిచేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అధికారుల్లో కొందరు ఎడ్డెం అంటే ఇంకొందరు తెడ్డెం అని ముఖం చాటేస్తున్నారట. దీంతో ఏ అధికారి మాటలు వినాలో అర్థంకాక కిందిస్థాయి సిబ్బంది తల పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
పొంతనలేని ఆదేశాలు జారీ చేస్తున్నారా?
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి విద్యాశాఖలో ఒకరిద్దరు శాఖాధిపతులకు అస్సలు పడటం లేదట. ఎడమొఖం పెడముఖం అన్నట్టు ఉంటున్నట్టు సమాచారం. ఆదేశాల జారీ విషయంలోనూ పొంతనలేని నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఇలాంటి ఆదేశాలపై విద్యాశాఖలోనే కథలు కథలుగా చెప్పుకొంటున్నారు ఉద్యోగులు.
సీఎస్ వర్సెస్ విద్యాశాఖ స్పెషల్ సీఎస్?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖ స్పెషల్ సీఎస్‌కి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోందట. సెక్రటేరియట్ వర్గాల్లో దీనిపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. గత ఏడాది పదో తరగతి పరీక్షల దగ్గర మొదలైన పంచాయితీ ఇద్దరు అధికారుల మధ్య ఇంకా కొనసాగుతోందని సమాచారం. ముఖ్యమంత్రి సైతం సీఎస్‌ను సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడంతో.. మంత్రి సైతం ఆ ఆదేశాలను పాటిస్తున్నట్టు చెబుతున్నారు. విద్యాశాఖకు సంబంధించి ఏ ఫైల్ వచ్చినా.. మొదట CSకు పంపి నిర్ణయం తీసుకుంటున్నట్టు అధికారవర్గాల్లో జరుగుతున్న టాక్.
క్లాసుల ప్రారంభంపైనా భిన్నమైన సర్క్యులర్లు!
ఇటీవలే ఉన్నత విద్యా కాలేజీల్లో క్లాస్‌ల ప్రారంభంపై భిన్నమైన ఆదేశాలు వచ్చాయి. కేవలం ఫైనల్ ఇయర్ తరగతులు మాత్రమే ప్రారంభించాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాతి రోజు అన్ని క్లాసుల తరగతులు ప్రారంభించాలని సర్క్యులర్ ఇచ్చారు విద్యశాఖ కమిషనర్. ఈ విషయంలో ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు కమిషనర్‌కు మద్దతుగా నిలిచినట్టు ప్రచారం జరుగుతోంది.
విద్యాశాఖలో ఏం జరుగుతుందో చెప్పలేని స్థితి ఉందా?
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా విద్యాశాఖలోని ఇతర అధికారుల తీరు ఉందట. ఐఏఎస్ అధికారుల వర్గపోరుకు ఏ మాత్రం తీసిపోనట్టుగా డైరెక్టర్.. ఇతర అధికారులకు సఖ్యత లేదట. ఆఫీస్‌లో పని ఉన్నా లేకపోయినా అంతా అందుబాటులోనే ఉండాలని ఆదేశాలు ఇస్తున్నారట. ఈ అంశంలో ఒకరికొకరికి పడక నేరుగా CMOకే ఫిర్యాదు చేసుకున్న సందర్భాలు ఉన్నట్టు తెలుస్తోంది. టాప్ టు బోటమ్ అందరి తీరు ఒకేలా ఉండటంతో.. విద్యాశాఖలో ఏం జరుగుతుందో ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. కీలకమైన కరోనా సమయంలోనూ ఐక్యత లేకపోవడం ఆందోళన కలిగించే పరిణామంగా చెబుతున్నారు ఉద్యోగులు. మరి.. ఈ ఆధిపత్యపోరుకు ఎప్పుడు ఫుల్స్టాప్ పడుతుందో చూడాలి.
0 comments:
Post a comment