కంటెయిన్మెంట్ జోన్లలో ఉండే సిబ్బందికి మినహాయింపు
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా ఇకపై పనిదినాల్లో కార్యాలయాలకు రావాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశించింది. అదే సమయంలో కంటెయిన్మెంట్ జోన్లలో నివాసం ఉండే సిబ్బందికి మినహాయింపు ఇచ్చింది. వారుండే ప్రాంతాలను కంటెయిన్మెంట్ ప్రాంతాల నుంచి తొలగించేవరకు ఈ మినహాయింపు ఉంటుంది. దిల్లీ సహా దేశంలో కొవిడ్-19 కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. ''అన్ని స్థాయుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పనిదినాల్లో ఎలాంటి మినహాయింపులు లేకుండా కార్యాలయాలకు వచ్చి పనిచేయాలి'' అని శనివారం పొద్దుపోయాక కేంద్ర ప్రభుత్వ విభాగాలకు ఓ ఆదేశం అందింది.
సమావేశాలను వీలైనంత మేరకు వీడియో సమావేశం విధానంలో నిర్వహించాలని సూచించింది. అన్ని విభాగాల క్యాంటీన్లు తెరచుకోవచ్చునని మరో ఆదేశం వెలువడింది.
కార్యాలయాలను క్రిమిరహితం చేయాలి
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా కట్టడికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజాగా ప్రామాణిక నిర్వహణ విధానాలను (ఎస్‌వోపీలు) శనివారం జారీచేసింది. వీటి ప్రకారం ఓ కార్యాలయంలో ఒకటి లేదా రెండు కొవిడ్-19 కేసులు బయటపడితే గత 48 గంటల్లో వారు కూర్చున్న, తిరిగిన ప్రాంతాలను క్రిమిరహితం చేస్తే చాలు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత కార్యాకలాపాలను పునరుద్ధరించుకోవచ్చు. ఒకవేళ కార్యాలయంలో పెద్దఎత్తున కేసులు బయటపడితే.. తిరిగి కార్యకలాపాలను ప్రారంభించడానికి ముందు ఆ భవనం లేదా బ్లాక్‌ను సంపూర్ణంగా క్రిమిరహితం చేయాలి.
* కంటెయిన్మెంట్ జోన్లలో ఉండే సిబ్బంది ఇంటి నుంచి పనిచేయవచ్చు.
* కార్యాలయాల్లో వీలైనంత వరకు ఆరు ఆడుగుల దూరం పాటించాలి. లోపల ఉన్నంతసేపూ మాస్కు ధరించాలి.
* చేతులు మురికిగా లేనప్పటికీ కనీసం 40 సెకన్ల నుంచి 60 సెకన్లపాటు తరచూ శుభ్రం చేసుకోవాలి. లేదా 20 సెకన్లపాటు శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
0 comments:
Post a comment