పెట్రో ధరలు పెరగడంపై మోదీ స్పందన
పెట్రో ధరల పెంపుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇంధనం కోసం మన దేశం దిగుమతులపైనే అధికంగా ఆధారపడుతోందని, ఇది సరైనదేనా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు ఈ అంశంపై శ్రద్ధ తీసుకోలేదన్నారు. తమిళనాడులో ఆయిల్ అండ్ గ్యాస్ ప్రాజెక్టులను ఆన్లైన్ ద్వారా ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ మాట్లాడుతూ, 2019-20 ఆర్థిక సంవత్సరంలో మన దేశ అవసరాల్లో 85 శాతం ఆయిల్‌ను, 53 శాతం గ్యాస్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలిపారు. వైవిధ్యభరితమైన, ప్రతిభా సంపన్నమైన మనలాంటి దేశం ఇంధనం కోసం దిగుమతులపై ఇంతగా ఆధారపడవచ్చునా? అని ప్రశ్నించారు. తాను ఎవరినీ విమర్శించాలని అనుకోవడం లేదని, అయితే మనం దీనిపై చాలా ముందుగానే దృష్టి సారించి ఉంటే మధ్య తరగతి ప్రజలు ఇంతగా ఇబ్బంది పడేవారు కాదని చెప్పాలనుకుంటున్నానని తెలిపారు.
మధ్య తరగతి ప్రజల ఆందోళనలను తన ప్రభుత్వం అర్థం చేసుకోగలదన్నారు. రైతులు, వినియోగదారులకు ఉపయోగపడేందుకు ఇథనాల్‌పై మన దేశం దృష్టి సారించిందని తెలిపారు. చెరకు నుంచి తీసిన ఇథనాల్‌ను పెట్రోలుకు కలుపుతున్నట్లు, తద్వారా దిగుమతులను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పెట్రోలులో 8.5 శాతం ఇథనాల్ ఉంటోందని, దీనిని 2025 నాటికి 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దీనివల్ల దిగుమతులు తగ్గడంతోపాటు, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయం లభిస్తుందని చెప్పారు.
పునరుద్ధరణీయ ఇంధనాల వాడకంపై కూడా దృష్టి సారించినట్లు తెలిపారు. 2030 నాటికి దేశంలో ఉత్పత్తి అయ్యే ఇంధనంలో 40 శాతం పునరుద్ధరణీయ ఇంధనం ఉంటుందని తెలిపారు. సౌరశక్తి పెరిగిందని, ప్రజా రవాణా, ఎల్ఈడీ బల్బుల వినియోగం, నిర్దిష్ట కాలపరిమితి దాటిన వాహనాలపై నిషేధం, సాగు నీటి పారుదలలో సోలార్ పంపుల వాడకం వంటి చర్యలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
2019-20 సంవత్సరంలో చమురు శుద్ధి సామర్థ్యంలో ప్రపంచంలో నాలుగో స్థానంలో మన దేశం ఉందన్నారు. దాదాపు 65.2 మిలియన్ టన్నుల పెట్రోలియం ప్రొడక్ట్స్‌ను ఎగుమతి చేసినట్లు తెలిపారు. ఈ ఎగుమతులు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం భారత దేశ చమురు, సహజ వాయువు కంపెనీలు 27 దేశాల్లో ఉన్నాయన్నారు.
0 comments:
Post a comment