📚✍ఇంటర్ ప్రవేశాలు తగ్గుముఖం
🌻ఈనాడు, అమరావతి: కరోనా ప్రభావం.. ఆపై విద్యా సంవత్సరం బాగా ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఈ ఏడాది జూనియర్ ఇంటర్లో ప్రవేశాలు బాగా తగ్గాయి. కార్పొరేట్ కళాశాలల వసతిగృహాల్లో ఉండి చదువుకోవడానికి బయట ప్రాంతాల విద్యార్థులు ఆసక్తి కనబరచలేదు. ఎంసెట్.. జేఈఈలో ర్యాంకుల కోసం ప్రధానంగా రాయలసీమ జిల్లాల నుంచి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు గుంటూరుకు వచ్చి చదువుకునేవారు. వారంతా స్థానిక కార్పొరేట్ కళాశాల వసతిగృహాల్లో ఉండేవారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడంతో చాలా మంది స్థానికంగా ఉన్న ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లోనే చేరారు. ఆన్లైన్లో తరగతులకు హాజరయ్యారు. జనవరి 18 నుంచి రెగ్యులర్ తరగతులు ప్రారంభమయ్యాయి. నాలుగైదు నెలలే కదా అని తల్లిదండ్రులు తమ పిల్లలను బయట ప్రాంతాల నుంచి పంపడానికి ఇష్టపడలేదు. ఒక్క గుంటూరు నగరంలోనే 8వేలకు పైగా సీట్లు భర్తీ కాలేదని గుర్తించారు. ఇంటర్ విద్యకు గుంటూరు, విజయవాడలో బాగా డిమాండ్ ఉంటుంది. ఈ రెండు చోట్ల కాస్త అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని, వీరు బాగా చొరవ తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరూ తమ పిల్లలను సుదూరాల నుంచి ఇక్కడకు తీసుకొచ్చి చదివించేవారు. ఒకవైపు ఇంటర్ క్లాసులు, వాటితోపాటే ఎంసెట్, జేఈఈలకు స్వల్ప, దీర్ఘకాలిక కోచింగ్లు ఇస్తూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచేవారు. ఈ ఏడాది కరోనాతో తల్లిదండ్రులు భయపడిపోయారు. జిల్లాలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ అన్ని యాజమాన్యాల్లో కలిపి 283 కళాశాలలకు అనుమతులు రాగా వాటిల్లో మాన్యువల్ ప్రవేశాలకు అవకాశం కల్పించారు. వీటన్నింటిలో కలిపి 65వేల వరకు సీట్లు ఉన్నాయి. నిర్దేశిత సీట్లలో గురువారం నాటికి 48,159 మాత్రమే భర్తీ అయ్యాయి. మరోవైపు ప్రవేశాలు శుక్రవారంతో ముగుస్తున్నాయి. గడువు ముగిసేలోపు ఏమైనా పెరిగినా ఓ వంద సీట్లు పెరుగుతాయేమోనని, అంతకుమించి పెరగవని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా వర్గాలు తెలిపాయి. గతేడాది 56,028 మంది చేరారు. దానితో పోలిస్తే ఈఏడాది 8 వేలకు పైగా ప్రవేశాలు తగ్గాయని బోర్డు వర్గాలు వెల్లడించాయి. గుంటూరు నగరంలోనే వసతితో కూడిన విద్యను బోధించేలా అనేక కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయి. ఏటా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల నుంచి బాగా వచ్చి ఇక్కడ ప్రవేశాలు పొందేవారు. ఈ ఏడాది కరోనాతో తల్లిదండ్రులు వెనకంజవేశారు. అందుకే సీట్లు భర్తీ కాలేదని కార్పొరేట్ కళాశాల వర్గాలు పేర్కొన్నాయి.
♦సామాజిక దూరంపై ఆందోళనతో...
అసలే ఇరుకిరుకు గదులు. సాధారణ రోజుల్లోనే ఒక్కో గదిలో నాలుగైదు బెడ్లు వేసి పిల్లలను కుక్కేసినట్లు ఉంచేవారు. అలాంటిది కరోనా నేపథ్యంలో అసలు భౌతికదూరం పాటించడం అసాధ్యమని సగటున ప్రతి తల్లిదండ్రి అనుమానపడి తమ పిల్లలను ఈ ఏడాదికి వారు నివసించే ప్రాంతాల్లోనే చదివించుకోవడానికి ఇష్టపడ్డారు. సీట్లు నిండకపోవటానికి ఇదే కారణమని కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపాల్ ఒకరు తెలిపారు. మొత్తంగా కరోనా ప్రభావంతో కార్పొరేట్ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంతో ఆ మేరకు కొందరు అధ్యాపకుల కొలువులకు ఎసరొచ్చిందని, ఆయా కళాశాలల్లో వసతిగృహాలు నడిపే కాంట్రాక్టర్లకు పనులు లేకుండా పోయాయని తెలుస్తోంది.
0 comments:
Post a comment